Begin typing your search above and press return to search.

మొత్తం కాషాయమయం...అదే లక్ష్యం !

భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి. అలాగే అనేక కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. అయితే వీటిని ఏకమొత్తంగా గతంలో కాంగ్రెస్ ఏలింది.

By:  Satya P   |   15 Nov 2025 8:53 PM IST
మొత్తం కాషాయమయం...అదే లక్ష్యం !
X

భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి. అలాగే అనేక కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. అయితే వీటిని ఏకమొత్తంగా గతంలో కాంగ్రెస్ ఏలింది. ఒకసారి కాదు అనేక ఎన్నికల్లో గెలిచింది. దశాబ్దాల పాటు పాలించింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత చూస్తే కనుక ఇప్పటికి 78 ఏళ్ళు నిండిపోయాయి. ఈ మొత్తం కాలంలో కాంగ్రెస్ పాలనా కాలం అచ్చంగా యాభై ఆరేళ్ళు అంటే దాదాపు ఆరు దశాబ్దాలు. ఇక మిగిలిన ఇరవై ఏళ్ళ కాలమే విపక్షాలది. అందులో జనతా పాలన మూడేళ్ళు, నేషనల్ ఫ్రంట్ పాలన రెండేళ్ళు, బీజేపీ పాలన 17 ఏళ్ళు కలుపుకుంటే 22 ఏళ్ళు అవుతుంది. ఇక దేశంలో పంచాయతీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకూ అంతా కాంగ్రెస్ వారినే గెలిపించుకుని ఖద్దరు పార్టీ పాలన చేసింది. భారత దేశం మొత్తం రాజకీయ మ్యాప్ లో కాంగ్రెస్ తప్ప మరో పార్టీ ఎక్కడా కనిపించని పరిస్థితి ఒకనాడు ఉండేది.




బీజేపీ కోరిక :

బీజేపీ కోరిక కూడా అదే. 1952న ఏర్పాటు అయిన జనసంఘ్ నుంచి 1980లో బీజేపీ గా రూపాంతరం చెందిన తర్వాత కూడా చూస్తే కాషాయం పార్టీ టార్గెట్ దేశం మొత్తం పాలించాలి. అది కూడా సుదీర్ఘ కాలం పాలించాలి. అంటే కాంగ్రెస్ పాలించినట్లుగా తాము కూడా ఆరు దశాబ్దాలు అంతకంటే ఎక్కువగానే ఏలాలని. ఆ విధంగా వాజ్ పేయి అద్వానీ హయాంలో అయితే కోరిక ఒక మాదిరిగా నెరవేరింది. కానీ నరేంద్ర మోడీ అమిత్ షా ద్వయం మాత్రం దానికి అత్యధిక శాతం సాకారం చేస్తూ వస్తున్నారు ఈ లక్ష్య సాధనలో వారు చాలా వరకూ విజయం సాధించారు.

జెండా పాతాలని :

ఈ రోజున చూస్తే దేశంలో కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణా వంటి దక్షిణాది రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్ వంటి చోట్ల కాషాయం జెండా పాతాలని చూస్తోంది. ఈ రాష్ట్రాలు కనుక చేజిక్కితే భరతదేశం రాజకీయ మ్యాప్ లో మొత్తానికి మొత్తం కాషాయం కనిపిస్తుంది అన్నది కమలనాధుల భావన. అదే వారి ఆశ కూడా. ఈ నేపధ్యంలో బీహార్ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలుస్తున్న వేళ ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి ఒకరు ఇక తమ తదుపరి లక్ష్యం బెంగాల్ అని చెప్పేశారు. అలాగే తమిళనాడులో అయితే మిత్రులతో కలిసి రావాలని అధికారం అందుకోవాలని బీజేపీ చూస్తోంది. ఈ రెండు రాష్ట్రాలకు 2026లో ఎన్నికలు ఉన్నాయి.

కష్టమైనా సాధించేలా :

ఇక కేరళలో వామపక్షాలు అధికారంలో ఉంటున్నాయి. లేదా కాంగ్రెస్ గెలుస్తూ వస్తోంది. అలాంటి చోట 2024 లోక్ సభ ఎన్నికల్లో ఒక సీటుని బీజేపీ సాధించింది. ఆ పార్టీ బలం అయితే కొంత పెరిగింది. ఇక దశల వారీగా కేరళలో కూడా కాషాయం జెండా ఎగరేయాలని చూస్తోంది. ఇది కొంచెం కష్టమైనా ఆ భారీ సవాల్ ని స్వీకరించేందుకు బీజేపీ సిద్ధంగానే ఉంది అని అంటున్నారు కర్ణాటకలో అయితే కొంతకాలం అధికారంలో ఉంది 2028లో ఎన్నికలు జరిగితే కచ్చితంగా గెలిచి తీరాలని స్కెచ్ గీస్తోంది. అక్కడ మరో ప్రాంతీయ పక్షం జేడీఎస్ కూడా ఎన్డీయేలో ఉంది. తెలంగాణాలో అయితే 2028 టార్గెట్ గా పెట్టుకుంది. దానికి తగిన ప్లాన్స్ కూడా కాషాయ దళానికి ఉన్నాయని అంటున్నారు. మొత్తం మీద చూస్తే మమతా బెనర్జీని మాజీ ని చేయడం తక్షణ కర్తవ్యం గా బీజేపీ పెద్దలకు ఉంది అని అంటున్నారు. సో రానున్న రోజులు అయితే బీజేపీ ప్లాన్స్ అన్నీ పీక్స్ లోనే ఉండబోతున్నాయి అన్న మాట.