Begin typing your search above and press return to search.

లడ్డూ కావాలా బాబూ...బీజేపీ సంబరాలు షురూ !

గెలుపు ఆనందం వేరే లెవెల్. దానికి సరిసాటి ఏదీ రాదు. ఎందుకంటే విజయం మజా అలాంటిది. రెక్కల గుర్రం ఎక్కి చుక్కల లోకం అంతా ఒక్కసారిగా తిరిగేసినట్లుగా ఉంటుంది.

By:  Satya P   |   13 Nov 2025 9:17 AM IST
లడ్డూ కావాలా బాబూ...బీజేపీ సంబరాలు షురూ !
X

గెలుపు ఆనందం వేరే లెవెల్. దానికి సరిసాటి ఏదీ రాదు. ఎందుకంటే విజయం మజా అలాంటిది. రెక్కల గుర్రం ఎక్కి చుక్కల లోకం అంతా ఒక్కసారిగా తిరిగేసినట్లుగా ఉంటుంది. ఇక హోరా హోరీ పోరులో సక్సెస్ చిక్కితే అది విజయానికి వేయింతలు గా ఉంటుంది. అందుకే బీహార్ బీజేపీ ఇపుడు హుషార్ చేస్తోంది. మరో మారు బీహార్ లో అధికారంలోకి వచ్చేది మేమే అంటూ ఖుషీ చేస్తోంది.

భారీగానే అంతా :

ఈ నెల 14న బీహార్ లో ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. ఎగ్జిట్ పోల్స్ అయితే అన్నీ ఎన్డీయే ప్రభుత్వమే మరోసారి అధికారంలోకి వస్తుందని చెప్పేశాయి. ఇంకేముంది బీజేపీ సంబరానికి ఎక్కడా అవధులు లేకుండా పోతున్నాయి. అందుకే ఏకంగా 501 కిలోల భారీ లడ్డూకి ఆర్డర్ ఇచ్చేసింది. అంతే కాదు పాట్నాలో శుక్రవారం ఆకాశమే హద్దుగా విజయోత్సవాలు చేసుకునేందుకు కూడా రంగం సిద్ధం చేసింది.

ఆర్డర్ వచ్చేసింది :

ఇప్పటికే పాట్నాకు చెందిన ఒక ప్రముఖ మిఠాయి దుకాణం యజమానికి భారీ లడ్డూ తయారు చేయమని బీజేపీ నేతలు పురమాయించారుట. ఆ విషయాన్ని సదరు వ్యక్తి చెప్పడంతో బీజేపీ ధీమా ఏ లెవెల్ లో ఉందో అర్ధం అవుతోంది. అంతే కాదు బీహార్ కి చెందిన బీజేపీ నాయకులు మీడియా ముందుకు వచ్చి గెలిచేది మేమే అంటున్నారు.

అన్ని పండుగలూ ఒకే రోజు :

బీహార్ లో ఎన్నికల ఫలితాలు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఫేవర్ గా ఉంటాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు దసరా దీపావళి హోళీ, అన్ని పండుగలు ఒకే రోజు చేసుకుంటామని చెబుతున్నారు. ఒక వందల కేజీల లడ్డూ ఎందుకు ఆర్డర్ ఇచ్చారు అంటే ప్రజలతో ఈ సంబరాలు చేసుకుంటామని వారికి ఈ లడ్డూలు పంచుతామని చెబుతున్నారు.

స్వీప్ చేస్తామంటూ :

గతానికి కంటే ఈసారి పోలింగ్ శాతం బాగా పెరిగింది అంటే అది తమకు అనుకూలమని అధికార పార్టీ చెబుతోంది. అంతే కాదు ఓటర్లు అంతా ఎన్డీయేకు బీజేపీకి అనుకూలంగా ఓటెత్తారు అంటున్నారు. ఇంతటి విజయం తమకు దక్కబోతోంది అని అందుకే ఈ నెల 14వ తేదీ తమకు ఎంతో ముఖ్యమని మరుపు రానిదని అంటున్నారు. తాము గెలిచి చూపిస్తామని కూడా సవాల్ చేస్తున్నారు.

అంతవరకే వారిది :

అయితే ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ అయితే బీజేపీ సంబరాలు అన్నీ ఎగ్జిట్ పోల్స్ వరకే అని అంటున్నారు. అసలు రిజల్ట్ తమకు అనుకూలంగా ఉంటుందని ఈ నెల 18న బీహార్ సీఎం గా తాను ప్రమాణం చేయబోతున్నాను అని కూడా ఆయన ధీమాగా చెబుతున్నారు. సర్వే సంస్థలు బీజేపీ వారు చెబితే వేసిన అంకెలు అవి అని అసలు అంకెలు ఏంటో బీహార్ ప్రజలు చెబుతారు అని ఆయన గట్టి నమ్మకం ప్రదర్శిస్తున్నారు.