Begin typing your search above and press return to search.

జనసేనకు బీజేపీ షాక్! కూటమి ఉండదని సంచలన ప్రకటన

ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామి జనసేన పార్టీతో పొత్తు ఉండదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తేల్చిచెప్పారు.

By:  Tupaki Political Desk   |   7 Aug 2026 10:46 PM IST
జనసేనకు బీజేపీ షాక్! కూటమి ఉండదని సంచలన ప్రకటన
X

ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామి జనసేన పార్టీతో పొత్తు ఉండదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తేల్చిచెప్పారు. జనసేన-బీజేపీ పొత్తు కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితమని కుండబద్ధలు కొట్టారు. ఎన్డీఏలో భాగస్వామి అయినప్పటికీ జనసేనతోపాటు ఏ ఇతర పార్టీతోనూ తెలంగాణలో పొత్తులు పెట్టుకోమని ఢిల్లీలో ప్రకటించారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని రామచంద్రరావు స్పష్టం చేశారు. పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తోపాటు పలువురు ఎంపీలతో కలిసి ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తో సమావేశమయ్యారు. అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

జనసేనతో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన ప్రకటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ ప్రకటన తెలంగాణలో జనసేనను విస్తరించాలని భావిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఎదురెబ్బగా పరిగణించాలని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీలో కూటమి నిర్మాణంలో కీలకంగా పనిచేయడమే కాకుండా, జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ మూడోసారి ప్రధాని అవడానికి ఏపీలో కూటమి సాధించిన విజయమే ప్రధాన కారణంగా చెబుతున్నారు. పవన్ లేనిదే ఏపీలో కూటమి ఉండేది కాదని, బీజేపీకి ఈ స్థాయిలో మద్దతు లభించేది కాదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ తెలంగాణలో బీజేపీ ప్రయోజనాల కోసమంటూ ఎటువంటి మొహమాటం లేకుండా ఏకపక్షంగా పొత్తులు ఉండవని ప్రకటించడమే హాట్ టాపిక్ అవుతోందని అంటున్నారు.

ఇక బీజేపీ ఈ నిర్ణయానికి రావడానికి తెలంగాణ పరిస్థితులే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించినప్పటికీ ఆ రాష్ట్రంలో ఆంధ్రా రాజకీయ పెత్తనాన్ని ప్రజలు సహించే పరిస్థితిలో లేరని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ, జనసేన పార్టీలను ఆంధ్రా పార్టీలుగా ప్రజలు భావిస్తున్నందున ఆ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీకి నష్టమే ఎక్కువ జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు దీటుగా నిలబడాలంటే ఒంటరిగా పోటీ చేయడం ఒక్కటే మార్గమని బీజేపీ అధిష్టానం భావిస్తోందని అంటున్నారు.

ఇక తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రత్యేక 'రోడ్ మ్యాప్'ను రూపొందిస్తున్నామని బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్రంలోని 937 మండలాల్లో విస్తృత పర్యటనలు, కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్ తరహా వ్యూహంతో తెలంగాణలోనూ విజయం సాధించి, బీజేపీ జెండాను రెపరెపలాడిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలోని కీలక నాయకులు చాలామంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, సమయం కోసం వేచి చూస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో నేతల మధ్య విభేదాలు లేవని, కేవలం భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని, వాటిని అధిగమించి ముందుకు వెళ్తామని వివరించారు.

ఢిల్లీలో కీలక భేటీ

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, పలువురు ఎంపీలు హాజరయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని నియోజకవర్గాల వారీగా సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై కలిసికట్టుగా పోరాటం చేయాలని, ప్రజా సమస్యలను ఎండగట్టాలని ఈ సందర్భంగా అధిష్టానం దిశానిర్దేశం చేసింది. ఇకపై నితిన్ నబీన్ ప్రతి మూడు నెలలకు ఒకసారి తెలంగాణకు వచ్చి పార్టీ నేతలతో సమావేశమవుతారని రాంచందర్ రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లడమే తదుపరి కార్యాచరణగా బీజేపీ అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు.