అధికారం లక్ష్యంగా అడుగులు: బీజేపీ నేతలకు నితిన్ దిశానిర్దేశం
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అందరూ అడుగులు వేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్.. దిశానిర్దేశం చేశారు.
By: Garuda Media | 29 Jun 2026 9:16 AM ISTతెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అందరూ అడుగులు వేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్.. దిశానిర్దేశం చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆదివారం ఆయన రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టారు. స్థానిక నాయకులతో విస్తృతంగా చర్చించారు. అదేసమయంలో ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట, నాగర్ కర్నూలు, మెదక్, ఆసిఫాబాద్ జిల్లాల్లో బీజేపీ ఆఫీసులను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులను ఉద్దేశించి నితిన్ మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం దక్కించుకునే దిశగా అడుగులు వేయాలన్నారు. నేతలు, కార్యకర్తలు .. ప్రజల సమస్యలపై ఎక్కువగా దృష్టి పెట్టాలని సూచించారు. వాటిపై పోరాటాలు కూడా చేయాలని సూచించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తెలంగాణలో కూడా అమలు చేస్తున్నారని చెప్పారు.
అయితే.. కేంద్రం అమలు చేస్తున్న పథకాలకు రాష్ట్ర లేబుల్ వేసుకుంటున్నారన్న నితిన్.. వీటిపై స్థానికంగా ఉన్న వారికి అవగాహన కల్పించాలని సూచించారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని నితిన్ సూచించారు. రాష్ట్రం అభివృద్ధి చెందేందుకు డబుల్ ఇంజన్ సర్కారు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనికిగాను ప్రతి ఒక్కరూ కష్టపడాలన్నారు.
బెంగాల్ స్ఫూర్తితో..
ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ సాధించిన విజయాన్ని నితిన్ నబీన్ ప్రస్తావించారు. అక్కడ ఎలా అయితే.. విజయం దక్కించుకున్నామో.. తెలంగాణలోనూ అదే విధంగా దూకుడుగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ''ఏమీ లేదని బెంగ వద్దు. గతంలో కూడా పార్టీ రెండు ఎంపీ స్థానాల నుంచి ఎదిగిన విషయాన్ని గుర్తు చేసుకోండి. అదే స్ఫూర్తితో ముందుకు సాగాలి. అదేసమయంలో పశ్చిమ బెంగాల్‌లో ఎలా అధికారం దక్కించుకున్నామన్ని కూడా గుర్తించాలి.'' అని దిశానిర్దేశం చేశారు. తెలంగాణ సాకారంలో బీజేపీ పాత్రను ప్రతి ఒక్కరికీ మరోసారి గుర్తు చేయాలని సూచించారు.
