బీజేపీకి మాత్రమే అది సాధ్యం - నరేంద్ర మోడీ
భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఒక సాధారణ కార్యకర్త కూడా జాతీయ పార్టీకి అధ్యక్షుడు కావడం సాధ్యపడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
By: Satya P | 20 Jan 2026 12:48 PM ISTభారతీయ జనతా పార్టీలో మాత్రమే ఒక సాధారణ కార్యకర్త కూడా జాతీయ పార్టీకి అధ్యక్షుడు కావడం సాధ్యపడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇది పార్టీ గొప్పతనం అన్నారు. పూర్తి ప్రజాస్వామిక వాతావరణంలో పార్టీ నడుస్తోందని, సంస్థాగతంగా బీజేపీ బలంగా ఉండడానికి ఇదే కారణం అన్నారు.
నబీన్ ప్రమాణం :
ఇక బీజేపీకి నూతన అధ్యక్షుడిగా నితిన్ నబీన్ మంగళవారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. భారతీయ జనతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇప్పటిదాకా ఉన్న నితిన్ నబిన్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు పార్టీ జాతీయ రిటర్నింగ్ అధికారి డాక్టర్ కె. లక్ష్మణ్ న్యూఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో పార్టీ కొత్త అధ్యక్షుడిగా మిస్టర్ నబిన్ నియామకాన్ని ప్రకటించారు. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జెపి నడ్డా నితిన్ గడ్కరీ నబిన్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో నరేంద్ర మోడీ మాట్లాడుతూ అనేక అంశాలను ప్రస్తావించారు.
కార్యకర్త కేంద్రంగానే :
దేశంలో మరే పార్టీలో లేని విధంగా కార్యకర్త కేంద్రంగా బీజేపీ సిద్ధాంతాలు ఉంటాయని మోడీ గుర్తు చేశారు. దేశ సేవ ప్రజా సేవ లక్ష్యంగా బీజేపీ పార్టీ మొత్తం పనిచేస్తోందని ఆయన అన్నారు. బీజేపీ అందరి ఆలోచనలకు విలువ ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. అందరి ఆమోదంతోనే పార్టీ ముందుకు సాగుతుందని చెప్పారు. ఈ దేశంలో వరసగా మూడు సార్లు బీజేపీ అధికారంలోకి వచ్చింది అంటే అది కార్యకర్తల కృషి అని మోడీ అన్నారు. నితిన్ నబీన్ కొత్త ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ మోడీ అభినందించారు.
తేడా పార్టీ అంటూ :
బీజేపీ మిగిలిన పార్టీలలో తేడా గల పార్టీ అని మోడీ అభివర్ణించారు. బీజేపీ సుదీర్ఘమైన ప్రస్థానం అంతా ఈ విధంగానే సాగిందని అన్నారు. పార్టీ కోసం ఎవరైతే అంకిత భావంతో పనిచేస్తారో నిబద్ధతో ఉంటారో వారికి అగ్రాసనం వేయడం పార్టీ చేస్తూ వచ్చిందని అన్నారు. కార్యకర్తలే బీజపీకి ఎంతో ముఖ్యమని అన్నారు. వారే పార్టీకి అసలైన సారధులు అని ఆయన కొనియాడారు. బీజేపీని వారు ఇప్పటిదాకా తీసుకుని వచ్చారని ఆయన అన్నారు. డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ అటల్ బిహారీ వాజ్ పేయి వంటి వారు బీజేపీకి ప్రేరణగా నిలుస్తున్నారని అన్నారు. దేశం కోసం పాటు పడే పార్టీగా బీజేపీ ఉందని అన్నారు. బీజేపీ నాయకత్వం అనుభవం సమర్ధతతో కొనసాగుతోందని నరేంద్ర మోడీ చెప్పారు.
