బీజేపీకి కొత్త రక్తం.. ఏపీకి ప్రాధాన్యం
భారతీయ జనతా పార్టీ లో కీలక సంస్థాగత మార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు.
By: A.N.Kumar | 17 Aug 2026 8:00 PM ISTభారతీయ జనతా పార్టీ లో కీలక సంస్థాగత మార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. అనుభవజ్ఞులతో పాటు యువ నాయకులకు ప్రాధాన్యం కల్పిస్తూ రూపొందించిన ఈ కొత్త టీమ్‌లో మహిళలకు కూడా కీలక పదవులు దక్కాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం లభించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కొత్త కార్యవర్గంలో మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నుంచి ఓటమి తర్వాత కొంతకాలం పార్టీ సంస్థాగత కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆమెకు ఇప్పుడు కీలక బాధ్యత అప్పగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే గతంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రామ్ మాధవ్ ను జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కశ్మీర్‌లో పార్టీ విస్తరణలో గతంలో రామ్ మాధవ్ కీలక పాత్ర పోషించారు.
జాతీయ ఉపాధ్యక్షులుగా మొత్తం 13 మందికి అవకాశం కల్పించారు. ఇందులో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా, రామ్ మాధవ్, డి. పురంధేశ్వరి, బైజయంత్ జయ్ పాండా తదితరులు ఉన్నారు. దీంతో అనుభవం ఉన్న నేతలకు పార్టీ కీలక నిర్ణయాత్మక బాధ్యతలు కొనసాగించినట్లు స్పష్టమవుతోంది.
జాతీయ ప్రధాన కార్యదర్శులుగా వినోద్ తావ్డే, సునీల్ బన్సల్, బిప్లబ్ కుమార్ దేబ్, స్మృతి ఇరానీ, సతీశ్ పూనియా, గజేంద్ర పటేల్, హరీశ్ ద్వివేది, సంజయ్ భాటియా నియమితులయ్యారు. సంస్థాగత వ్యవహారాల్లో కీలకమైన బి.ఎల్. సంతోష్ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్)గా కొనసాగనున్నారు. శివప్రకాశ్, సౌదాన్ సింగ్ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శులు (ఆర్గనైజేషన్)గా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఏపీకి కీలక పదవులు
కొత్త బీజేపీ టీమ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కూడా ప్రాధాన్యం దక్కింది. డి. పురంధేశ్వరికి జాతీయ ఉపాధ్యక్షురాలి బాధ్యతలు దక్కగా.. విష్ణుకుమార్ రాజుకు జాయింట్ కో-ఆర్డినేటర్ బాధ్యతలు లభించాయి. అలాగే ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఏపీకి చెందిన విష్ణువర్ధన్ రెడ్డికి అవకాశం కల్పించినట్లు పార్టీ ప్రకటించింది. జాతీయ స్థాయిలో ఏపీ నేతలకు కీలక బాధ్యతలు దక్కడం రాష్ట్రంలో బీజేపీ సంస్థాగత బలోపేతానికి ప్రాధాన్యం ఇస్తున్న సంకేతంగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
కొత్త కార్యవర్గంలో 16 మంది జాతీయ మంత్రులను కూడా నియమించారు. కవితా పాటీదార్, కే. సురేంద్రన్, డాక్టర్ భోలా సింగ్, డాక్టర్ ప్రదీప్ వర్మ, జగదీశ్ ఈశ్వర్‌భాయ్ పటేల్, డాక్టర్ సందీప్ పాఠక్, ఫాంగ్నోన్ కోన్యాక్, సంగీత యాదవ్, అనిల్ ఆంటోనీ, డాక్టర్ ఎం. వెంకటేశన్, మనోజ్ టిగ్గా, సిద్ధార్థ్ శంభు, డాక్టర్ స్వదేశ్ సింగ్, మృగాంక దేవ్ బర్మన్, రోహన్ గుప్తా, జయ ప్రకాశ్ తదితరులకు ఈ జాబితాలో చోటు కల్పించారు.
పార్టీ ఆర్థిక విభాగంలోనూ మార్పులు జరిగాయి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను జాతీయ కోశాధికారిగా నియమించారు. రాజస్థాన్‌కు చెందిన రాజేశ్ మంగళ్‌ను జాతీయ సహ-కోశాధికారిగా నియమించారు. తరుణ్ చుగ్‌కు కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు.
46 ఏళ్ల వయసులో జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్ నాయకత్వంలో ఈ పునర్వ్యవస్థీకరణ జరగడం కూడా ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. యువత, మహిళలు, అనుభవజ్ఞుల మధ్య సమతుల్యత సాధించేలా కొత్త టీమ్‌ను రూపొందించినట్లు కనిపిస్తోంది.
రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ మార్పులకు మరింత ప్రాధాన్యం ఉంది. 2027లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, గోవా సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాల వారీగా పార్టీకి బలమైన సంస్థాగత నిర్మాణం కల్పించడమే లక్ష్యంగా కొత్త కార్యవర్గాన్ని రూపొందించినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మొత్తంగా చూస్తే.. బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గంలో యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు అనుభవజ్ఞులను కొనసాగించింది. మహిళలకు కీలక పదవులు కేటాయించింది. అదే సమయంలో ఏపీ సహా పలు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించింది. రాబోయే ఎన్నికల్లో పార్టీ వ్యూహాలను అమలు చేయడంలో ఈ కొత్త టీమ్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
