Begin typing your search above and press return to search.

మోడీ ప్లస్ బీజేపీ బలం పెరిగిందా ...తగ్గిందా ?

నరేంద్ర మోడీ అంటే తిరుగులేని నాయకుడు అని చెబుతారు. ఆయన 2014లో ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగితే బీజేపీకి 283 సీట్లతో పూర్తి మెజారిటీ వచ్చింది.

By:  Satya P   |   28 Aug 2026 2:00 PM IST
మోడీ ప్లస్ బీజేపీ బలం పెరిగిందా ...తగ్గిందా ?
X

నరేంద్ర మోడీ అంటే తిరుగులేని నాయకుడు అని చెబుతారు. ఆయన 2014లో ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగితే బీజేపీకి 283 సీట్లతో పూర్తి మెజారిటీ వచ్చింది. ఇక 2019 ఎన్నికల్లో అయితే ఏకంగా 306 దాకా ఎంపీ సీట్లను గెలుచుకుని బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని పటిష్టంగా కేంద్రంలో ఏర్పాటు చేసింది. ఆ ధీమాతో 2024లో ఏకంగా 400 ప్లస్ అంటూ బరిలోకి దిగింది. కానీ బీజేపీకి సొంతంగా దక్కినవి కేవలం 240 సీట్లు మాత్రమే. ఇపుడు చూస్తే రెండేళ్ళ కాలం గడచిపోయింది. దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. కొత్తగా జెన్ జీ ఉద్యమాలు తోడు అయ్యాయి. ఎల్ నినో ప్రభావంతో ఎక్కడ చూసినా కరవు వర్షాభావ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.

ధరలు దారుణంగానే :

అదే విధంగా చూస్తే కనుక నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. పశ్చిమాసియా సంక్షోభం ప్రభావంతో పెట్రోల్ డీజిల్ గ్యాస్ బండ వంటి వాటి రేట్లు పెరిగాయి. ఇక నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం అలా చకోర పక్షులుగా చూస్తూనే ఉంది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు ఒక్కోటి ప్రైవేట్ పరం చేయాలన్న ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. ఇంకో వైపు చూస్తే సమాజంలో వివిధ వర్గాలలో అసంతృప్తి గట్టిగానే ఉంది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో మూడ్ ఆఫ్ ది నేషన్ అంటూ వచ్చిన ఒక సర్వే బీజేపీకే అధికారం అని చెప్పడం మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

కేంద్రంలో నాలుగవసారి :

ఇక దేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే బీజేపీదే అధికారం అంటూ ఇండియా టుడే సీ-ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే స్పష్టం చేసింది. ఈ సర్వే ప్రకారం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి వరసగా నాలుగోసారి దేశంలో అధికారంలోకి వస్తుందని తేల్చింది. దేశవ్యాప్తంగా ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమికి మొత్తం 326 సీట్లు దక్కుతాయని అంచనా వేసింది. అంటే ప్రస్తుతం ఎన్డీయేకు ఉన్న 294 కాస్తా మరో ముప్పయి దాకా పెరిగిపోతాయన్న మాట. అలాగే బీజేపీ ఒంటరిగా 261 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే చెప్పింది. అంటే ఇక్కడ కూడా 21 సీట్లు అదనంగా కలుస్తాయన్న మాట. అయినప్పటికీ ఇది మ్యాజిక్ ఫిగర్ కంటే కాస్త తక్కువగానే ఉంది. కానీ ఎన్డీయే కూటమి బలంతో కేంద్రంలో ప్రభుత్వం బీజేపీ ఏర్పాటు చేస్తుందని సర్వే చెబుతోంది. అలాగే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 185 సీట్లు లభిస్తాయని ఈ సర్వే పేర్కొంది.ఇందులో కాంగ్రెస్ పార్టీకి 106 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. అంటే ఆ పార్టీకి మరో ఏడు సీట్లు సొంతంగా పెరుగుతాయన్న మాట. ఇవన్నీ పక్కన పెడితే : ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన సర్వేతో పోలిస్తే ఎన్డీయేకు 26 సీట్లు తగ్గినప్పటికీ, మెజారిటీ మాత్రం స్పష్టంగా నిలబెట్టుకుందని సర్వే వెల్లడించింది.

మెజారిటీకి దూరంగానే :

మరి బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవడం చూస్తూంటే నరేంద్ర మోడీకి కానీ బీజేపీకి కానీ బలం పెరిగినట్లా లేక తగ్గినట్లా అన్న దాని మీదనే చర్చ సాగుతోంది. మోడీ రెండు ఎన్నికల్లో ఒంటి చేత్తో ఫుల్ మెజారిటీ తెచ్చిన సంగతిని ఇక్కడ గుర్తు చేసుకుంటున్నారు. అలాంటిది మూడవసారి కాదు నాల్గవసారి కూడా బీజేపీ మిత్రుల మీదనే ఆధారపడుతుందని చెబుతున్న ఈ సర్వే కాషాయం పార్టీకి పూర్తి గెలుపు తీపిని అందించలేకపోయింది అని అంటున్నారు. జెన్ జీ అసంతృప్తిగా ఉన్నా బీజేపీ మిత్రుల సాయంతో మరోసారి అధికారం దక్కించుకుంటుందని చెప్పడం ద్వారా అధికార శిబిరంలో అయితే కొంత ఉత్సాహాన్ని ఈ సర్వే ఇవ్వవచ్చు. కానీ ఇదే సర్వే జనవరిలో చేసిన దానికీ ఇప్పటికీ బీజేపీ బలం తగ్గిందని చెబుతోంది. ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరగడానికి ఇంకా మూడేళ్ళ సమయం ఉంది అప్పటికి ఇంకా సీట్లు తగ్గుతాయా లేదా పెరుగుతాయా అనేది చూడాలి. అయితే దానికి ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదని ఈ ఏడాది జనవరిలో చెప్పిన సీట్లకే ఎనిమిది నెలలలో కోత పడితే మూడేళ్ళలో ఇంకెంత కోత పడుతుందో అన్నది రాజకీయ విశ్లేషకుల మాటగా ఉంది.