Begin typing your search above and press return to search.

తన కృత్రిమ కాళ్లను రాజ్యసభ టేబుల్ మీద పెట్టిన బీజేపీ ఎంపీ బ్యాక్ గ్రౌండ్ ఇదే

కేరళ నుంచి రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ఎంపికైన సీనియర్ బీజేపీ నేత సి.సదానందన్ మాస్టర్ తన కృత్రిమకాళ్లను టేబుల్ మీద పెట్టి.. రాజకీయ హింసపై ప్రసంగించటం సంచలనంగా మారింది.

By:  Garuda Media   |   3 Feb 2026 11:02 AM IST
తన కృత్రిమ కాళ్లను రాజ్యసభ టేబుల్ మీద పెట్టిన బీజేపీ ఎంపీ బ్యాక్ గ్రౌండ్ ఇదే
X

రాజ్యసభలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కేరళ నుంచి రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ఎంపికైన సీనియర్ బీజేపీ నేత సి.సదానందన్ మాస్టర్ తన కృత్రిమకాళ్లను టేబుల్ మీద పెట్టి.. రాజకీయ హింసపై ప్రసంగించటం సంచలనంగా మారింది. తన తొలి ప్రసంగంతో అందరూ ఆయన గురించి మాట్లాడేలా చేయటమే కాదు.. ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు తెర తీసిన పరిస్థితి. తన తాజా చర్యతో రాజకీయ హింస ఎంత దారుణంగా ఉంటుందన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పారు. ఇంతకూ ఈ బీజేపీ ఎంపీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఆయన కాళ్లు రెండు ఎలా పోయాయి? ఈ దుర్మార్గ ఘటనకు పాల్పడిన వారెవరు? వారిప్పుడు ఎక్కడ ఉన్నారు? లాంటి ప్రశ్నలకు సమాధానాల్ని వెతికితే..

కేరళకు చెందిన సి. సదానందన్ మాస్టర్ బీజేపీ సీనియర్ నాయకులు. కేరళ రాష్ట్ర బీజేపీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో కార్యకర్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన.. అంచలంచెలుగా ఎదిగారు. ఇక్కడే మరో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. నిజానికి ఈ నిర్ణయమే ఆయనకు ఈ రోజు కాళ్లు లేకుండా చేసిందని చెప్పాలి.

సదానందన్ మాస్టర్ తొలుత సీపీఐ(ఎం) విద్యార్థి విభాగమైన ఎస్ఎఫ్ఐలో పని చేశారు. ఆయన కుటుంబం సైతం వామపక్ష సానుభూతిపరులే. కాలేజీ రోజుల తర్వాత సీపీఎం సిద్ధాంతాల పట్ల ఆసక్తిని కోల్పోయారు. అందుకు విరుద్ధమైన భావజాలానికి ప్రతీకైన ఆర్ఎస్ఎస్ వైపు ఆకర్షితులయ్యారు. అలా ఆయన సంఘ్ లో భాగస్వామ్యమై.. కన్నూరు జిల్లాలో మట్టన్నూర్ లాంటి సీపీఎంకు కంచుకోట ప్రాంతంలో సంఘ్ ను బలోపేతం అయ్యేలా చేయటంలో కీలకపాత్ర పోషించారు. ఆయన వాగ్దాటి.. చురుకుదనం ఆ ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ వేగంగా విస్తరించింది.

ఈ పరిణామాల్ని సహించలేని ఆయన రాజకీయ ప్రత్యర్థులు.. మరెవరూ సీపీఎంకు వ్యతిరేకంగా పని చేయకూడదన్న హెచ్చరికను జారీ చేసేందుకు వీలుగా ఆయనపై దారుణ దాడికి ప్లాన్ చేశారు. 1994 జనవరి 25న ఆయన తన సోదరి పెళ్లి సంబంధం మాట్లాడి ఇంటికి తిరిగి వస్తున్నారు. బస్సు దిగిన వెంటనే ఎనిమిది మంది సీపీఎం కార్యకర్తలు ఆయన్ను పట్టుకొని.. రోడ్డు మీద పడేసి మోకాళ్ల వరకు రెండు కాళ్లను నరికేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. అంతేకాదు.. ఆ కాళ్లు మళ్లీ అతకకుండా ఉండేందుకు.. రెండు కాళ్లను రోడ్డు మీద నుజ్జునుజ్జు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై ఈ దాడి జరిగే సమయానికి ఆయనకు 30 ఏళ్లు మాత్రమే.

ఈ కేసులో ఎనిమిది మంది సీపీఎం కార్యకర్తలు దోషులుగా తేలారు 1997లో ట్రయల్ కోర్టు వారికి ఏడేళ్లు కఠిన కారాగార శిక్ష విధించింది. అయితే.. నిందితులు కోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానాలకు అప్పీలుకు వెళ్లారు. చివరకు సుప్రీంకోర్టు వారి అప్పీల్ ను తిరస్కరించింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత 2025 ఆగస్టు నాలుగున ఈ ఎనిమిది మంది దోషులు కేరళలోని తలస్సేరి కోర్టు ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం వారు కన్నూర్ సెంట్రల్ జైల్ లో శిక్ష అనుభవిస్తున్నారు.

అయితే.. ఈ కిరాతకులు జైలుకు వెళ్లే సమయంలో సీపీఎం నాయకులు వారికి ఘనంగా వీడ్కోలు పలకటం వివాదంగా మారింది. మాజీ మంత్రి కేకే శైలజ లాంటి నేతలు ఈ దోషులకు వీడ్కోలు సభలో పాల్గొనటం పెనుదుమారంగా మారింది. నిందితులు జైలుకు వెళ్లే సమయంలో పార్టీ శ్రేణులు వీరికి అనుకూలంగా నినాదాలు చేయటం.. వారిని అమరవీరుల స్థాయిలో గౌరవించిన తీరు గురించి తెలిస్తే షాక్ తినాల్సిందే. ఇంత హడావుడి చేయటమే తప్పించి ఎక్కడా పశ్చాత్తాపాన్ని ప్రకటించకపోవటం గమనార్హం.