లాఠీ చార్జ్ కాదు.. కాల్పులు జరిగేవి: కాక రేపుతున్న కొండా వ్యాఖ్యలు!
ఢిల్లీ పరిణామాలు.. అనంతరం దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు .. ఎంపీలు స్పందిస్తున్నారు.
By: Garuda Media | 27 July 2026 3:42 PM ISTతెలంగాణ నాయకుడు, బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. ఢిల్లీలో విద్యార్థులు చేసిన నిరసన.. అనంతరం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యతిరేకంగా.. పోలీసులకు అనుకూలంగా కొండా చేసిన వ్యా ఖ్యలు మరోసారి ఆందోళనలకు విద్యార్థులు పిలుపునిచ్చేలా చేశాయి. కొండాకు వ్యతిరేకంగా తెలంగాణ కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.
ఏం జరిగింది?
ఢిల్లీ పరిణామాలు.. అనంతరం దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు .. ఎంపీలు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోని నివాసంలో కొండా విశ్వేశ్వరరెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో చేపట్టిన నిరసనల వెనుక అతీత శక్తులు ఉన్నాయని తెలిపారు. వారికి విదేశీ నిధులు అందుతున్నాయని కొందరు చెబుతున్న మాటల్లోనూ నిజం ఉందేమోనని అనిపిస్తోంద న్నారు. అంతేకాదు.. కొందరు నిరసన కారులను పెంచి పోషించారని ఆరోపించారు.
ఢిల్లీ నిరసన కారులకు కొందరు భోజనం, పండ్లు, నీళ్లు పంపించడాన్ని కూడా కొండా తప్పుబట్టారు. లేని పోని సమస్యపై నిరసన వ్యక్తం చేస్తున్న వారికి ఇలాంటి సాయాలు అవసరం లేదన్న ఆయన.. ఇలాంటి వి మన దేశంలోనే జరుగుతాయని అన్నారు. ఇక, ఢిల్లీ పోలీసులు విద్యార్థులపై చేసిన లాఠీ చార్జీని ప్రస్తావిస్తూ.. చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. ఇక్కడ పోలీసులు కేవలం లాఠీ చార్జివరకే ఆగారని కొండా అన్నారు. అదే అమెరికాలో అయితే.. కాల్చి పారేసేవారని వ్యాఖ్యానించారు.
ఇక్కడా అక్కడా కూడా ప్రజాస్వామ్యమే ఉందని.. అయినా.. అమెరికాలో అయితే కాల్పులు జరిపేవారని వ్యాఖ్యానించారు. దీనిపై కాక్రోచ్ జనతాపార్టీ డిల్లీ విభాగం కూడాస్పందించింది. అలా అయితే.. చర్చలకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. కాల్పులే జరిపి ఉంటే బాగుండేదికదా! అని ఓ కార్యకర్త వ్యాఖ్యానిం చారు. ఇక, అమెరికా గురించి కూడా కొండా తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. అమెరికాలో నిరసన కారులపై కాల్పులు జరిగిన ఉదంతాలు లేవని.. అక్కడ నిరసనకు పెద్దపీట వేస్తారని.. పేర్కొన్నారు. కేవలం వాటర్ క్యానెన్లను మాత్రమే ప్రయోగిస్తారని తెలిపారు.
