Begin typing your search above and press return to search.

కూటమి ఎంపీతో వైసీపీకి చెలగాటమేనా ?

ఇక సీఎం రమేష్ తన పలుకుబడితో రూరల్ జిల్లాలో వైసీపీ బలం ఎదగకుండా చేస్తున్నారు ఆయన అన్ని పార్టీల నేతలతో ఉన్న పరిచయాలతో ముందుకు సాగుతున్నారు.

By:  Satya P   |   14 Oct 2025 4:00 PM IST
కూటమి ఎంపీతో  వైసీపీకి చెలగాటమేనా ?
X

రాజకీయాల్లో ఎవరు ఎపుడు ఏమిటి ఎలా తమ ప్రభావాన్ని చూపిస్తారు అన్నది పరిస్థితుల బట్టి ఉంటుంది. ఎక్కడో కడప జిల్లా నుంచి వచ్చిన మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఫక్తు రూరల్ బేస్డ్ ఏరియాగా ఉన్న అనకాపల్లి నుంచి లాస్ట్ మినిట్ లో టికెట్ సాధించి బీజేపీ నుంచి గెలవడం అన్నది రాజకీయంగా జరిగిన ఒకానొక అద్భుతంగానే చెబుతారు ఎందుకంటే విశాఖ సిటీలో కొన్ని ఏరియాలు తప్పించి పెద్దగా తెలియనిది బీజేపీ కమలం పువ్వు గుర్తు. ఇక సీఎం రమేష్ అంటే ఏకంగా ఆ ప్రాంతానికే చెందిన వారు కాదు, అయినా సరే ఆయన ఢంకా భజాయించి మరీ విజయం సాధించారు అంటే ఆయన రాజకీయ చతురతకు నిదర్శనంగానే అంతా చూస్తున్నారు.

కీలకంగా మారిన వైనం :

సీఎం రమేష్ బీజేపీలోనే కీలకంగా ఉన్నారు. ఆయనకు నేరుగా కేంద్ర బీజేపీ పెద్దలతోనే మంచి అనుబంధం ఉంది. అందుకే ఆయనకు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి కూడా దక్కింది. వివిధ పార్లమెంటరీ కమిటీలలో ఆయన సభ్యుడిగా ఉంటున్నారు కేంద్ర మంత్రి అవుతారని కూడా ఒక దశలో ప్రచారం సాగింది, కానీ సామాజిక సమీకరణల వల్లనే అది ఆగింది. అయితే ఈ టెరంలో ఏదో నాటికి ఆయన కేంద్ర మంత్రి అవుతారు అని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఆయనకు టీడీపీతో ఉన్న దశాబ్దాల అనుబంధం చంద్రబాబుతో నేరుగా ఉన్న పరిచయాలు జనసేనతో ఉన్న అనుబంధాలు అన్నీ కలసి ఆయన ఉమ్మడి విశాఖ జిల్లాలో అతి ముఖ్య నాయకుడిగా మారిపోయారు అని అంటున్నారు.

వైసీపీ విమర్శలతోనే :

ఇక సీఎం రమేష్ తన పలుకుబడితో రూరల్ జిల్లాలో వైసీపీ బలం ఎదగకుండా చేస్తున్నారు ఆయన అన్ని పార్టీల నేతలతో ఉన్న పరిచయాలతో ముందుకు సాగుతున్నారు. పార్టీలో ఉన్న వారిని తన వైపుగా తిప్పుకుంటున్నారు. ఎవరినీ చేజారిపోకుండా చూస్తున్నారు. ఆయనకు భవిష్యత్తు ఆలోచనలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. మరోసారి అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలవాలని ఆయన చూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తన బలాన్ని పెంచుకుంటున్నారు. అదే సమయంలో వైసీపీ ఎక్కడా ఎత్తిగిల్లకుండా చేస్తున్నారు. దాంతో వైసీపీలో ఆక్రోశం అయితే గట్టిగానే ఉంది. దాంతో విమర్శలతోనే వైసీపీ దూకుడు చేస్తోంది తప్ప అంతకు మించి ఏమీ చేయలేకపోతోంది అని అంటున్నారు.

ఏమి ఉద్ధరించారంటూ :

తాజాగా మాజీ మంత్రి వైసీపీ కీలక నేత గుడివాడ అమర్నాధ్ సీఎం రమేష్ ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలే చేశారు. ఎక్కడో రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర కు వచ్చి ఎంపీగా అయ్యారని కానీ ఈ ప్రాంతానికి ఏమి ఉద్ధరించారని ఆయన ప్రశ్నించారు ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడ నుంచి అయినా పోటీ చేయవచ్చు అని దాని వల్లనే ఆయన తమ ప్రాంతంలో ఎంపీ కాగలిగారు అని ఆయన సెటైర్లు వేశారు. సొంత రాజకీయాలు చేసుకోవడం తప్పించి ఆయన వల్ల ఉత్తరాంధ్రకు ఒనగూడేది ఏదీ లేదని గుడివాడ హాట్ కామెంట్స్ చేశారు.

ఢీ కొట్టడం అంటే :

అంగబలం అర్ధబలం సమృద్ధిగా ఉన్న బిగ్ షాట్ గా సీఎం రమేష్ ఉన్నారు. ఆయన కూటమి మొత్తానికి కో ఆర్డినేటర్ గా వ్యవహరిస్తునారు. ఇదే జోరుతో ఆయన 2029లోనూ ఎలక్షనీరింగ్ చేస్తే వైసీపీకి మళ్ళీ ఇబ్బందులు రాజకీయంగా తప్పవా అన్న చర్చ అయితే ఉంది. వైసీపీ విషయానికి వస్తే 2014 టైం లో కేవలం ఏడాదికే పార్టీ గ్రాఫ్ బాగా పెరిగింది. గెలుపు ఆశలు నాడే ఎంతో కొంత కనిపించాయి. కానీ ఇపుడు ఏణ్ణర్థం అవుతున్నా విశాఖ రూరల్ జిల్లాలో చాలా అసెంబ్లీ నియోజకవర్గాలలో గ్రాఫ్ పెరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది అంటున్నారు. రాజకీయాలు జనాలు రావడమే కాదు ఇంకా చాలా చేయాల్సి ఉందని అంటున్నారు. వైసీపీ ఈ విషయంలో తగిన వ్యూహాలు నేర్వకపోతే ఇబ్బందులే అని అంటున్నారు.