రూ.70 లక్షల బాణసంచా ఖర్చు.. ఎమ్మెల్యే ఇంట వివాహం వీడియో వైరల్!
అవును... మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగిన బీజేపి ఎమ్మెల్యే గోలు శుక్లా కుమారుడు అంజనేష్ శుక్లా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
By: Raja Ch | 16 Dec 2025 4:28 PM ISTఇటీవల రకరకాల పెళ్లిళ్లు జరుగుతున్నాయి! ఇందులో కొన్ని రాజమహల్స్ లో అంగరంగ వైభవంగా జరుగుతుంటే.. మరికొన్ని వారి వారి బడ్జెట్ లో ఇంటి వద్దో, కళ్యాణ మండపాల్లోనో జరుగుతున్నాయి. మరికొన్ని సింపుల్ గా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ తో జరుగుతుంటే.. మరికొన్ని మాత్రం తమదైన హైలెట్స్ తో సోషల్ మీడియాలో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. అలాంటి వివాహానికి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.
అవును... మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగిన బీజేపి ఎమ్మెల్యే గోలు శుక్లా కుమారుడు అంజనేష్ శుక్లా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రధానంగా ఈ వివాహ వేదిక డెకరేషన్, బాణసంచా చేసిన కళాత్మక సందడి మరింత చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. కేవలం బాణసంచా ఖర్చే రూ.70 లక్షల వరకూ అయ్యిందంట!
సాధారణంగా ఇటీవల వివాహ వేదికలు కాస్త ఇంగ్లిష్ వివాహాల స్టైల్లో ఉంటున్నాయని అంటున్న వేళ.. ఈ వివాహ వేదిక మాత్రం ఓ ప్రత్యేకమైన మతపరమైన ఇతివృత్తం చుట్టూ రూపొందించబడింది. ఈ ప్రాంగణం అంతటా హిందు దేవతల విగ్రహాలు ఉన్నాయి. ప్రధానంగా, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా అన్నట్లుగా ప్రధాన వేదికపై శివుడు కేంద్ర స్థానాన్ని ఆక్రమించాడు!
ఈ స్పెషల్ డే కోసం వరుడు అంజనేష్ భారీ ఎంబ్రాయిడరీ వర్క్ తో డిజైన్ చేసిన షెర్వానీని ఎంచుకోగా.. వధువు సీమర్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించింది. వైరల్ అవుతున్న మరో వీడియోలో ఇండోర్ లోని ఖజ్రానా ఆలయంలో ప్రధాన దేవత ముందు వధూవరులు దండలు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి!
కాగా... ఇండోర్-3 అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2023 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 15వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందిన గోలు శుక్లా... అఫిడవిట్ లో తన ఆస్తులు రూ.61 కోట్లకు పైనే అని, అప్పులు రూ.6 కోట్లకు పైన అని వెల్లడించారు! ఇక మెటీరియల్ హ్యాండ్లింగ్, క్రేన్ వ్యాపారాలు ఆయన ప్రధాన ఆదాయ వనరులు కాగా.. ఆయన భార్య పెట్రోల్ బంక్ డైరెక్టర్ గా ఉన్నట్లు పేర్కొన్నారు!!
