Begin typing your search above and press return to search.

యూపీ సీఎం అభ్యర్థి ఆయనే...బీజేపీ ఫుల్ క్లారిటీ !

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం. దేశానికి గుండె కాయ. ఎక్కువ ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు ఉన్న స్టేట్. దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసే నైపుణ్యం ఉన్న స్టేట్ కూడా యూపీనే.

By:  Satya P   |   24 April 2026 9:13 AM IST
యూపీ సీఎం అభ్యర్థి ఆయనే...బీజేపీ ఫుల్ క్లారిటీ !
X

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం. దేశానికి గుండె కాయ. ఎక్కువ ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు ఉన్న స్టేట్. దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసే నైపుణ్యం ఉన్న స్టేట్ కూడా యూపీనే. పైగా బీజేపీకి బలం ఉన్న ప్రాంతం. అటువంటి యూపీలో వరసగా రెండు సార్లు బీజేపీ గెలిచింది. 2017, 2022 ఎన్నికల్లో విజయ ఢంకా మోగించింది. రెండు సార్లు యోగీ సీఎం గా ఉన్నారు ఆయన ముఖ్యమంత్రిత్వం 2027 నాటికి పదేళ్ళు పూర్తి చేసుకుంటోంది. 2027 లో యూపీకి సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో యూపీలో ఎన్నికల సన్నాహాల్లో బీజేపీ అపుడే దిగిపోతోంది. ఏడాది ముందుగానే అక్కడ బీజేపీ తన విజయావకాశాలను పెంచుకునే ప్రయత్నంలో పడింది. దానికి మిషన్ 2027 అని పేరు కూడా పెట్టింది.

యోగిని మారుస్తారా :

ఇక యూపీ ఎన్నికల్లో బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు ఉంటారు అన్నది ఇపుడు చర్చగా మారింది. యోగి ఆదిత్యనాథ్ సీఎం గా కంటిన్యూ అవుతున్నారు. ఆయన్ని మారుస్తారా అన్నది ఒక వైపు ప్రచారంగా ఉంది. ఆయనను కేంద్ర రాజకీయాలకు తీసుకుని వస్తారని కూడా అప్పట్లో ప్రచారం సాగింది. ఈ నేపధ్యంలో బీజేపీ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. యోగీనే తమ సీఎం అభ్యర్థి అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టం చేశారు. అంతే కాదు ఆయనే తమ ఫేస్ అని ఆయనే తమ ఇమేజ్ అని కూడా చెప్పారు. ఆయన నాయకత్వంలోనే యూపీ ఎన్నికలను తాము ధీటుగా ఎదుర్కొంటామని ఆయన తెలిపారు.

హ్యాట్రిక్ విక్టరీ కోసం :

యూపీలో హ్యాట్రిక్ విక్టరీ కోసం బీజేపీ ఇప్పటి నుంచే రంగంలోకి దిగుతోంది. యూపీ ప్రభుత్వం 2027 నాటికి పదేళ్ళుగా కొనసాగున్నట్లు లెక్క. మరి యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుందా అన్నది ఒక చర్చ. అదే సమయంలో 2024 పార్లమెంట్ ఎన్నికల తరువాత సమాజ్ వాదీ పార్టీ బాగా పుంజుకుంది. ఆ పార్టీ 37 దాకా ఎంపీ సీట్లను సాధించి అతి పెద్ద పార్టీగా నిలిచింది. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ దెబ్బ తింది. దానికి యోగీ చరిష్మా తగ్గిపోవడమే కారణం అని కేంద్ర బీజేపీ పెద్దలు భావిస్తున్నారు అని కూడా ప్రచారం సాగింది. దాంతో పాటుగా ఆయనకు కేంద్రంలో ఏలుతున్న పెద్దలతో కొంత గ్యాప్ ఉంది అన్నట్లుగానూ ప్రచారం సాగింది. ఈ నేపధ్యంలో యోగిని తప్పిస్తారు అని అప్పుడపుడు వార్తలూ వస్తున్నాయి. అయితే యోగి నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని సాక్షాత్తూ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలియచేయడంతో ఆ చర్చకు ఫుల్ స్టాప్ పడినట్లే అని అంటున్నారు.

యోగి వర్సెస్ అఖిలేష్ :

ఇదిలా ఉంటే యూపీలో యోగి సీఎం గా ఉంటే విపక్ష నేతగా ఎస్పీ అధినేత అఖిలేష్ ఉన్నారు. ఆయన ఇండియా కూటమిలో ఉన్నారు దాంతో ఎన్డీయే వర్సెస్ ఇండియా కూటమిగా కూడా ఈ ఎన్నికలను చూడాలి. పైగా యూపీ ఎవరి చేతుల్లోకి వెళ్తే 2029 ఎన్నికల్లో వారికే అధికార పీఠం కేంద్రంలో దక్కేందుకు ఆస్కారం ఉంటుంది. దాంతో భీకరమైన పోరుకు తెర లేస్తుంది అని అంటున్నారు ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీ తన ప్రచారం స్టార్ట్ చేసింది. ఆ పార్టీ సీఎం అభ్యర్ధి అఖిలేష్ అన్నది తెలిసిందే. దాంతో బీజేపీ కూడా ఎలాంటి డౌట్స్ కి ఆస్కారం ఇవ్వకుండా తమ అభ్యర్థిగా యోగిని ప్రకటించింది అని అంటున్నారు. మోడీ యోగీ డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో ఎన్నికల్లో జనాల వద్దకు వెళ్ళేందుకు బీజేపీ పక్కా ప్లాన్ తో సిద్ధంగా ఉంది అని అంటున్నారు.