బీజేపీకి ఆశలున్నాయి... గ్రౌండ్ లెవెల్ లో సీన్ ఏంటి ?
పై స్థాయిలో పార్టీ అగ్ర నాయకత్వం ఎంతగా ప్రయత్నం చేసినా పూర్తిగా నియంత్రించలేని స్థితి ఉంటుంది అని అంటున్నారు. స్థానికం కాబట్టి ఎవరి అభిప్రాయాలు వారివిగా స్వేచ్చగా ఉంటారని అంటున్నారు.
By: Satya P | 6 Sept 2026 4:00 PM ISTఏపీలో కూటమిలో మూడవ మిత్రపక్షంగా బీజేపీ ఉంది. రెండు ప్రాంతీయ పార్టీల మధ్య ఒక జాతీయ పక్షంగా ఉంది. అయితే పెద్దన్నగా టీడీపీ కూటమి ఉంటే రెండో పార్టీగా జనసేన తన ప్రాధాన్యతను కాపాడుకుంటోంది. బీజేపీ మాత్రం జూనియర్ మిత్రుడిగానే ఉంది. ఏపీలో రెండేళ్ల అధికారం తరువాత కూడా బీజేపీ తన బలాన్ని పెద్దగా పెంచుకోలేకపోయింది అని అంటున్నారు. 2024 ఎన్నికల్లో కూటమితో ఉన్న పొత్తుల కారణంగా 10 ఎమ్మెల్యే సీట్లకు 8 దక్కాయి. అలాగే అయిదు ఎంపీ సీట్లకు మూడు దక్కించుకుంది. అప్పట్లో నూటికి నూరు శాతం ఓట్ల బదలాయింపు జరిగింది. ఆ ఫలితాన్ని కమలం పార్టీ అనుభవించింది. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు అంటే పూర్తిగా గ్రౌండ్ లెవెల్ లో ఉండే రాజకీయాలను బట్టి ఆధారపడి ఉంటాయి. పై స్థాయిలో పార్టీ అగ్ర నాయకత్వం ఎంతగా ప్రయత్నం చేసినా పూర్తిగా నియంత్రించలేని స్థితి ఉంటుంది అని అంటున్నారు. స్థానికం కాబట్టి ఎవరి అభిప్రాయాలు వారివిగా స్వేచ్చగా ఉంటారని అంటున్నారు.
నితిన్ నబీన్ దిశా నిర్దేశం :
ఇక చూస్తే ఇటీవలనే ఏపీ పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విశాఖలో జరిగిన పార్టీ రాష్ట్ర సాయి నేతల సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గణనీయంగా ఫలితాలు సాధించాలని దిశా నిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికలు చాలా కీలకంగా కూడా చెప్పారు. బీజేపీ తన పరిస్థితిని మెరుగుపరచుకోవాలని ప్రతీ చోటా బీజేపీ ఉనికి చాటుకోవాలని సూచించారు. అయితే జాతీయ పార్టీ చెప్పినంత సులువు అయితే కాదని అంటున్నారు. ఏపీలో బీజేపీకి క్షేత్ర స్థాయిలో బలం అయితే పెద్దగా పెరగలేదు, పార్టీకి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కూడా ఉన్నారు. అలాగే సీనియర్ నాయకులు ఉన్నారు, కానీ పార్టీని జనంలోకి తీసుకుని వెళ్ళి పటిష్టం చేసే పని పెద్దగా జరిగింది లేదని అంటున్నారు. దాంతో ఈసారి కూడా పొత్తులలో భాగంగా టీడీపీ సీట్లు ఇస్తే వారి నుంచి ఓట్ల బదిలీ సక్రమంగా జరిగితే బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ప్రత్యక్ష ఎన్నికలతోనే :
మేయర్ జెడ్పీ చైర్మన్ వంటివి ప్రత్యక్ష ఎన్నికలుగా ఉన్నాయి. దాంతో వాటిలో గెలవాలి అంటే కచ్చితంగా సొంత బలం కొంత అయినా ఉండాలి. ఆ మీదట మిత్రుల సపొర్టు ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా పొత్తులలో కేటాయించిన టీడీపీ నుంచి ఏ మేరకు ఓట్ల బదిలీకి గ్రౌండ్ లెవెల్ లో క్యాడర్ సహకరిస్తుందని ప్రశ్నలు ఉన్నాయి. అలా జరగకపోతే బీజేపీకి ఇచ్చిన సీట్లలో వైసీపీకే రాజకీయ లాభం కలుగుతుందని కూడా కూటమిలో చర్చ సాగుతోంది. ఇక ఏపీలో ఏ పార్టీకి ఎంత బలం ఎక్కడెక్కడ ఉంది అన్నది కూటమి పెద్దలు కూడా అంచనా వేసుకుంటున్నారని అంటున్నారు. దానిని బట్టే సీట్ల సర్దుబాటు ఉండొచ్చు అని చెబుతున్నారు.
అయిదు శాతం సీట్లు మాత్రమే :
ప్రత్యక్ష ఎన్నికలు అంటే అంగబలం అర్ధబలం ఉండాలని బిగ్ షాట్స్ రంగంలోకి దిగితే కానీ విజయం చేకూరదని చెబుతున్నారు. బీజేపీ లాంటి పార్టీలు ఈ విషయంలో ఏ మేరకు ప్రభావం చూపించగలవన్నది కూడా చర్చిస్తున్నారు. అయిదు శాతం సీట్లు మాత్రమే బీజేపీకి ఇస్తామని అంటున్నారు అని ప్రచారం ఆ మధ్య సాగింది.అదే నిజం అయితే మేయర్ జెడ్పీ చైర్మన్ల విషయంలో ఏమైనా దక్కుతాయా మున్సిపల్ చైర్మన్లలో ఎన్ని వస్తాయి అన్నది కూడా కమలం పార్టీలో డిస్కషన్ సాగుతోంది. అదే సమయంలో ఎక్కువ సీట్లు కావాలని పార్టీలో క్యాడర్ కోరుతున్నారు కానీ సీట్లు తీసుకుని పోటీ చేసి ఓటమి పాలు అయితే కూటమిలోనూ జాతీయ నాయకత్వం వద్ద కూడా చెప్పుకోవడానికి ఇబ్బంది అవుతుందని కూడా పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారని అంటున్నారు.
