జగన్ కు మ్యాప్ రెడీ చేస్తున్నారా? ఎమ్మెల్యే ఆది మాటలే సంకేతాలా?
జమ్మలమడుగు ఎమ్మెల్యే ప్రకటన ద్వారా కూటమి ప్రభుత్వం వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం చేస్తోందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
By: Tupaki Political Desk | 6 Nov 2025 3:09 PM ISTకేసులు, అరెస్టులతో ప్రతిపక్షాన్ని గడగడలాడిస్తున్న కూటమి ప్రభుత్వం మరో సంచలనానికి తెరతీస్తోందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జమ్మలమడుగు ఎమ్మెల్యే, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు త్వరలో పెను సంచలనం నమోదయ్యే అవకాశం ఉందనే సంకేతాలిస్తున్నట్లు చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ టార్గెట్ గా ఎమ్మెల్యే ఆది బుధవారం మీడియాతో మాట్లాడారు. జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యతోపాటు ఏపీ లిక్కర్ స్కాంపైనా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే జగన్ కు చెక్ చెప్పబోతున్నట్లు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి హింట్ ఇచ్చారు.
జమ్మలమడుగు ఎమ్మెల్యే ప్రకటన ద్వారా కూటమి ప్రభుత్వం వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం చేస్తోందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు కొనసాగింపుపై ఇటీవల కోర్టులో వాదలు జరుగుతున్నాయి. ఈ విషయంలో వైసీపీకి అనుకూలంగా ఉన్న కొందరు నిందితులు దర్యాప్తు అవసరం లేదని వాదిస్తుండగా, ఏ2 నిందితుడు సునీల్ యాదవ్ దర్యాప్తు కొనసాగించాలని కోరుతూ పిటిషన్ వేశాడు. గత కొంతకాలంగా సహచర నిందితులతో విభేదిస్తున్న సునీల్ యాదవ్ సంచలన ఆరోపణలు చేస్తున్నాడు. దీంతో వివేకా కేసుపై విస్తృత చర్చ జరుగుతోంది.
వివేకా హత్య సమాచారం మాజీ సీఎం జగన్, ఆయన భార్య భారతికి ఎప్పుడు తెలిసింది? ఎలా తెలిసింది? అనే విషయాలపై దర్యాప్తు చేయాల్సివుందని సునీత వాదిస్తున్నారు. ఈ కేసులో అసలు దోషులు తప్పించుకున్నారని బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి ఆరోపిస్తున్నారు. సీబీఐ దర్యాప్తులో మొత్తం కుట్ర బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ కేసులో జగన్ టార్గెట్ గా ప్రభుత్వం పావులు కదుపుతుందా? అన్న సందేహాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో లిక్కర్ స్కాంలో జగన్ ను అరెస్టు చేస్తారని ఆదినారాయణరెడ్డి చెప్పడంతో ఏదో జరగబోతోందనే టెన్షన్ క్రియేట్ చేస్తోందని అంటున్నారు.
లిక్కర్ కేసులో జగన్ ను అరెస్టు చేస్తారని ఇటీవల మళ్లీ ప్రచారం ఎక్కువైంది. వైసీపీ శ్రేణుల్లో కూడా ఈ విషయంపై అంతర్గతంగా చర్చ నడుస్తోందని అంటున్నారు. వైసీపీ హయాంలో రూ.3,500 కోట్ల స్కాం జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ స్కాంపై సీఐడీ సిట్ దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 40 మంది వ్యక్తులు, సంస్థలను నిందితులుగా గుర్తించిన సిట్.. 12 మందిని అరెస్టు చేసింది. రెండు వేర్వేరు చార్జిషీట్లు దాఖలుచేసింది. ఇందులో జగన్ పేరును కూడా ప్రస్తావించింది. అయితే మాజీ సీఎం ను కుట్రదారుగా కానీ, నిందితుడుగా కానీ ఎక్కడా పేర్కొనలేదు. అయితే చార్జిషీట్ లో జగన్ పేరు ఉండటంతో ఆయన అరెస్టుకు ప్రభుత్వం ముందుగా సంకేతాలిచ్చినట్లేనని న్యాయవాద వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇదే సమయంలో ఆధారాలు లేనందున జగన్ అరెస్టు జరగకపోవచ్చని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి సమయంలో లిక్కర్ స్కాంలో జగన్ పాత్ర ఉందని ఆదినారాయణరెడ్డి చేసిన ఆరోపణలు హీట్ పెంచుతున్నారు. అంతేకాకుండా జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని ఆదినారాయణరెడ్డి చెప్పడం చూస్తే ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
