మాజీ సీఎంను నోటికొచ్చినట్లు మాట్లాడి.. కాంగ్రెస్ ను గెలిపించిన బీజేపీ!
తాను మాట్లాడే మాటల్ని జనాలు పెద్దగా పట్టించుకోరన్న వాదనలో పస లేదన్న విషయం తాజాగా వెలువడిన మహారాష్ట్ర స్థానిక ఎన్నికలు చెప్పకనే చెప్పేశాయి.
By: Garuda Media | 17 Jan 2026 12:34 PM ISTఘాటు విమర్శలు చేయటం.. నోటికి ఎంత వస్తే అంతలా మాట్లాడటమే రాజకీయం కాదు. తాను మాట్లాడే మాటల్ని జనాలు పెద్దగా పట్టించుకోరన్న వాదనలో పస లేదన్న విషయం తాజాగా వెలువడిన మహారాష్ట్ర స్థానిక ఎన్నికలు చెప్పకనే చెప్పేశాయి. సుదీర్ఘ విరామం తర్వాత ఎన్సీపీ.. ఠాక్రే సోదరులు చెట్టాపట్టాలేసుకొని వేర్వేరుగా పోటీ చేసినా.. వీరికి ఓటమి తప్పలేదు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. మహారాష్ట్రలోని లాతూర్ స్థానిక ఎన్నికల ఫలితం మాత్రం మిగిలిన వాటికి భిన్నంగా చోటు చేసుకోవటమే ఇందుకు కారణమని తెలిస్తే విస్మయానికి గురి కావాల్సిందే. అసలేం జరిగిందంటే.. మహారాష్ట్రలో జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాలు వెలువడగా.. చాలా చోట్ల బీజేపీ అధిక్యంలో ఉంటే.. అందుకు భిన్నంగా లాతూరు మున్సిపల్ కార్పొరేషన్ లో మాత్రం ఆ పార్టీ ఓటమిపాలై.. అనూహ్య రీతిలో కాంగ్రెస్ గెలుపొందటం హాట్ టాపిక్ గా మారింది. అదెలా సాధ్యమైందంటే.. బీజేపీ ముఖ్యనేత నోటి దూలతోనే ఇలా జరిగిందని చెప్పాలి.
ఎన్నికల ప్రచారానికి ముందు లాతూర్ లో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర చవాన్.. అనూహ్య రీతిలో మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ పై విమర్శలు గుప్పించారు. ఆయన సొంతూరులో ఆయన గురుతులు తుడిచి పెట్టేయాలని కార్యకర్తలకు పిలుపునివ్వటం వివాదంగా మారింది. మహారాష్ట్ర డెవలప్ మెంట్ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ముఖ్యనేతను తక్కువ చేసి మాట్లాడటాన్ని అక్కడి ప్రజలు అస్సలు తట్టుకోలేకపోయారు.
మహారాష్ట్రకు ముఖ్యమైన ఒక నేతను ఉద్దేశించి తక్కువ చేసి మాట్లాడటాన్నితీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ భావోద్వేగాన్ని తగిన మోతాదులో దట్టించింది. అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి కం బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్ ముఖ్ స్పందిస్తూ.. సామాన్యుల మనసుల్లో నుంచి తన తండ్రి గురుతుల్ని చెరిపేయరంటూ చేసిన వీడియో ప్రకటనకు లాతూరు వాసులు ఇట్టే కనెక్టు అయ్యారు.
దీంతో తన మాటలతో జరిగిన డ్యామేజ్ ను గుర్తించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్పందిస్తూ.. తాను సీరియస్ కామెంట్లు చేయలేదన్న డ్యామేజ్ కంట్రోల్ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు కూడా చెప్పేశారు. అయితే.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 2017లో లాతూరు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 36 సీట్లతో విజయం సాధిస్తే.. ఈసారి కాంగ్రెస్ పార్టీ 43 సీట్లతో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించింది. మొత్తంగా ముఖ్య నేత నోటి దూల కీలక మున్సిపాలిటీని మిస్ చేసుకునేలా చేసిందని చెప్పాలి.
