Begin typing your search above and press return to search.

జనసేన గాలి తీసేసిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్?

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల వేడి కనిపిస్తోంది. ఈ తరుణంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి.

By:  A.N.Kumar   |   11 Feb 2026 3:00 PM IST
జనసేన గాలి తీసేసిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్?
X

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల వేడి కనిపిస్తోంది. ఈ తరుణంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ఏపీలో మిత్రపక్షంగా ఉన్న జనసేనపై ఆయన చేసిన వ్యాఖ్యలు ‘మిత్రద్రోహం’ కిందకు వస్తాయని జనసైనికులు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు.

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తాజాగా విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీకి ఎవరి మద్దతు అవసరం లేదని కుండబద్దలు కొట్టారు. "ఆంధ్రప్రదేశ్‌లో జనసేనతో పొత్తు ఉంది, కానీ తెలంగాణలో లేదు. ఇక్కడ మేము ఒంటరిగానే బలంగా ఉన్నాం" అని ఆయన వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ ను పిలిచారన్న వార్తలపై స్పందిస్తూ.. "ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన వస్తాడా?" అంటూ ఎద్దేవా చేయడం జనసేన కార్యకర్తలను తీవ్రంగా గాయపరిచింది.

‘ఎన్నికల తర్వాత పవన్ వస్తాడా?’

ఇదే సందర్భంలో “ఎన్నికలు అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ వస్తాడా?” అన్న వ్యాఖ్య మరింత చర్చకు దారి తీసింది. ఈ మాటలు జనసేనను తగ్గించేలా ఉన్నాయంటూ ఆ పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఎన్నికల ముందు టీబీజేపీ అధ్యక్షుడు పవన్‌ను కలిసి ప్రచారానికి ఆహ్వానించిన విషయం గుర్తుచేస్తూ ఇప్పుడు ఇలా మాట్లాడటం సరికాదని జనసైనికులు హితవు పలుకుతున్నారు.

ఆంధ్రాలో పొత్తు.. తెలంగాణలో దూరం?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ–జనసేన పొత్తు కొనసాగుతోంది. అయితే తెలంగాణలో మాత్రం అధికారికంగా ఎలాంటి కూటమి లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అరవింద్ వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య సమన్వయంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

బీజేపీ–జనసేన మధ్య తెలంగాణలో సంబంధాలు ఎలా ఉండబోతున్నాయన్నదిపై ఈ వ్యాఖ్యలు మరింత సందేహాలను కలిగించాయి. ఎన్నికల వేళ మిత్రపక్షాల మధ్య సమన్వయం ఎంతవరకు ఉంటుందన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. తెలంగాణలో బీజేపీ స్వతంత్రంగా బలపడాలనే వ్యూహంతో ఇలాంటి వ్యాఖ్యలు రావచ్చని చెబుతున్నారు. అయితే జనసేనతో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉందని సూచిస్తున్నారు.

జనసేన శ్రేణుల్లో అసంతృప్తి

జనసేన కార్యకర్తలు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “మా నాయకుడిని పిలిచి ప్రచారం చేయించుకోవాలనుకుని, తర్వాత అవసరం లేదనడం అవమానకరం” అని అంటున్నారు. రెండు పార్టీల మధ్య స్పష్టత లేకపోతే భవిష్యత్ ఎన్నికల్లో ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ వివాదంపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం లేదా జనసేన అధినేత స్పందిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ–జనసేన సంబంధాల దిశ ఏమిటో త్వరలోనే తేలనుంది.