రాజమండ్రి మేయర్ సీటుకు ఫుల్ డిమాండ్
రాజమండ్రి మేయర్ సీటు ఇపుడు కూటమిలోని అన్ని పార్టీలకు హాట్ ఫేవరేట్ గా మారుతోంది. ఇది పక్కాగా గెలిచే సీటు.
By: Satya P | 12 Oct 2026 11:35 AM ISTరాజమండ్రి మేయర్ సీటు ఇపుడు కూటమిలోని అన్ని పార్టీలకు హాట్ ఫేవరేట్ గా మారుతోంది. ఇది పక్కాగా గెలిచే సీటు. దాంతోనే కూటమిలో టీడీపీతో పాటుగా జనసేన బీజేపీ ఈ సీటు మీద ఫుల్ ఫోకస్ పెట్టేశాయి. రాజమండ్రీ మేయర్ అంటే ఆ రాజసం ఆ లెక్క వేరబ్బా అనుకుంటూ మూడు పార్టీలలోని ఆశావహులు అంతా ఆరాటపడుతున్నారు. రాజమండ్రి సీటుకు ఉన్న సక్సెస్ ట్రాక్ రికార్డు ఆశావహులనే కాదు రాజకీయ పార్టీలను ఈ సీటు వైపు లాగేస్తోంది. ఎక్కడైనా తేడా కొడితే కొట్టొచ్చు కానీ రాజమండ్రి మాత్రం అసలు అలాంటిది ఉండదు, ఇక్కడ టీడీపీ బలంగా ఉండడంతో గతంలో అనేక ఎన్నికలలో గెలిచి సత్తా చాటింది. ఈ సీటుకు ఫలానా పార్టీ అభ్యర్ధి అని కూటమి నుంచి ప్రకటించడమే లాంచనం. మేయర్ అయిపోయినట్లే అన్నంత గ్యారంటీ ఇచ్చే గెలుపు సీటు ఇది. అందుకే ఈ సీటు అంటే అంత వలపు పార్టీలకు అంటున్నారు.
గతంలో గెలిచింది వీరే :
ఇదిలా ఉంటే రాజమండ్రి మేయర్ సీటుకు గతంలో గెలిచిన పార్టీల హిస్టరీ చూస్తే ఎక్కువ సార్లు టీడీపీనే కనిపిస్తుంది. ఇక్కడ తెలుగుదేశం ప్రభావం అధికంగా ఉంటుంది. ఆ పార్టీ రాజకీయంగా బలంగా ఉండడమే కాదు ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా రాజమండ్రి అంటే సైకిలెక్కేయాల్సిందే అన్నంత సెంటిమెంట్ ఉంది. ఆ సక్సెస్ స్టోరీ చూస్తే కనుక చాలానే ఉంది. 1994లో రాజమండ్రి మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేసినప్పటి నుండి ఇక్కడ జరిగిన అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ స్పష్టమైన ఆధిక్యతను కనబరిచింది అన్నది చరిత్ర గుర్తు చేస్తోంది. ఇక 1994లో రాజమండ్రి కార్పొరేషన్‌గా మారిన తర్వాత మొదటి మేయర్‌గా మాతురి శ్రీనివాస చక్రవర్తి ఎన్నికయ్యారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు మేయర్ పీఠాన్ని దక్కించుకున్నప్పటికీ మొత్తంగా చూసినపుడు ఓవరాల్‌గా నగర పరిధిలోని డివిజన్లలో మేయర్ స్థానాల్లో టీడీపీ అత్యధిక సార్లు స్పష్టమైన గెలుపు రికార్డులను నమోదు చేసింది.
టీడీపీ బిగ్ సౌండ్ :
టీడీపీకి ఇక్కడ పక్కాగా గెలుపు ఉంటుంది. ఇక రాజమండ్రి కార్పోరేషన్ కి చివరిగా జరిగిన ఎన్నికలు 2014లో అయితే ఆ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం మొత్తం 50 వార్డులకు గాను టీడీపీ ఏకంగా 34 స్థానాలను కైవసం చేసుకుని భారీ మెజారిటీతో మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ఆ ఎన్నికల్లో వైసీపీ కేవలం 8 స్థానాలకే పరిమితమైంది. ఇక్కడ కేవలం మేయర్ పీఠమే కాకుండా రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రను పరిశీలించినా కూడా ఇక్కడ టీడీపీ అభ్యర్థులే వరసగా గెలుస్తూ వస్తున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి భవాని, ప్రస్తుత ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ టీడీపీ నుంచి విజయం సాధిస్తూ వస్తున్నారు. దాంతో రాజమండ్రి అంటే కళ్ళు మూసుకుని టీడీపీ గెలిచే సీటుగా పొలిటికల్ హిస్టరీలో సెపరేట్ పేజీ ఉంది. ఈ కారణం వల్లనే రాజమండ్రి సీటు మీద మిత్ర పక్షాలు సైతం మోజు పడుతున్నాయి.
బీజేపీ సైతం :
ఈసారి జరిగే కార్పొరేషన్ ఎన్నికలలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిగా బరిలో ఉండబోతున్నాయి. దీంతో రాజమండ్రి మేయర్ సీటు ఎవరికి దక్కుతుందనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. పక్కాగా ఇది టీడీపీ సీటు. దాంతో తమ్ముళ్లు ఎక్కడా తగ్గేది లేదని అంటున్నారు. రాజమండ్రి కార్పోరేషన్ కి 2021లో ఎన్నికలు జరగకపోవడంతో టీడీపీలో ఆశావహుల సంఖ్య కూడా ఈసారి అధికంగా ఉంది. 2021లో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పరిసర గ్రామాలను విలీనం చేయడంతో కోర్టు కేసులు పరిపాలనాపరమైన చిక్కుల కారణంగా అప్పట్లో ఎన్నికలు జరగలేదు. ఇపుడు అన్నీ క్లియర్ కావడంతో ఎన్నికలకు రంగం సిద్ధం చేశారు. దాంతో టీడీపీ నుంచి అనూహ్యమైన పోటీ నెలకొంది. మరో వైపు చూస్తే బీజేపీ కూడా రేసులోకి వస్తోంది. రాజమండ్రి ఎంపీ సీటులో బీజేపీ విజయం సాధించడంతో ఆ పరిధిలోని రాజమండ్రి మేయర్ కూడా తమకే కావాలని పట్టుపడుతోంది. ఇది గ్యారంటీగా గెలిచే సీటు కావడంతో కూడా కమలం ఆశలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి.
జనసేన రెడీ :
అంతే కాదు జనసేన నుంచి కూడా అనేక మంది ఈ సీటు మీద కన్నేశారు అని ప్రచారం సాగుతోంది. రాజమండ్రిలో జనసేన కూడా తమ పట్టుకుని పెంచుకునేందుకు ఈ సీటుని ఆశిస్తోంది. 2024 ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ సీటు కోసం జనసేన పట్టుబట్టి వెనక్కి తగ్గింది. అందువల్ల ఈసారి రాజమండ్రి మేయర్ సీటు ఇవ్వాలని కోరుతోందని అంటున్నారు. దీంతో రాజమండ్రి మేయర్ సీటు ఎవరికి అన్న చర్చ అయితే సాగుతోంది. ఎవరికి టికెట్ ఇచ్చినా మేయర్ గా పోటీ చేయాలీ అంటే కనీసంగా పాతిక లక్షల రూపాయలు అయినా ఖర్చు చేయగల సామర్థ్యం ఉండాలని అంటున్నారు. అంగబలం అర్ధబలం దండీగా ఉన్న వారికే మేయర్ గా పోటీ చేసేందుకు ప్రధాన అర్హత అని తేలుతున్న నేపథ్యంలో ఎవరిని మేయర్ అభ్యర్ధిత్వం వరిస్తుంది. ఏ పార్టీకి ఆ లక్కీ చాన్స్ దక్కుతుంది అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే అన్ని విధాలుగా బిగ్ షాట్స్ అనదగిన వాళ్ళుఎక్కడా తగ్గకుండా మూడు పార్టీల నుంచి ఎవరి ప్రయత్నాలలో వారు ఫుల్ బిజీగా ఉన్నారని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
