Begin typing your search above and press return to search.

మున్సిపోల్ సిత్రం: ఫ్యామిలీ ప్యాక్ మాదిరి భార్య భర్త కొడుక్కి టికెట్లు

తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న మున్సిపోల్ ఎన్నికల్లో సిత్రవిచిత్రమైన సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి.

By:  Garuda Media   |   9 Feb 2026 10:13 AM IST
మున్సిపోల్ సిత్రం: ఫ్యామిలీ ప్యాక్ మాదిరి భార్య భర్త కొడుక్కి టికెట్లు
X

తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న మున్సిపోల్ ఎన్నికల్లో సిత్రవిచిత్రమైన సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. ఫ్యామిలీ ప్యాక్ మాదిరి.. ఒకే కుటుంబానికి చెందిన భార్య, భర్త, కొడుకు ముగ్గురికి టికెట్లు ఇవ్వటంతో.. వారు ముగ్గురు ఇప్పుడు ఎన్నికల బరిలో నిలిచిన ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. దీనికి ఉమ్మడి మహబూబ్ నగర్ లోని అయిజ మున్సిపాలిటీ వేదికగా మారింది.

అవును.. అయిజ మున్సిపల్ ఎన్నికల బరిలో ఒకే కుటుంబానికి చెందిన భార్య (ప్రమీలమ్మ), భర్త (మాదన్న), కొడుకు (నవీన్) ముగ్గురు ఎన్నికల బరిలో నిలిచారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి టికెట్లు ఇచ్చిన పార్టీగా బీజేపీ నిలిచింది. 16వ వార్డులో మాదన్న, 17వ వార్డులో ప్రమీలమ్మ ఎన్నికల బరిలో నిలిస్తే.. వారి కుమారుడు నీవీన్ కు ఐదో వార్డు నుంచి పోటీలో ఉన్నారు. ఇలా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఎన్నికల బరిలో ఉండటం ఆసక్తికరంగా మారింది. మరి.. ఈ ఫ్యామిలీ ప్యాక్ కు ఓటర్లు ఎలాంటి తీర్పును ఇస్తారో చూడాలి.

ఇదే జిల్లాలోని కోస్గి మున్సిపాలిటీలోనూ మరో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇక్కడి నాలుగో వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా రాములు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తమ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ నేతలు హైజాక్ చేశారంటూ మండిపడుతున్న బీజేపీ సానుభూతిపరులు అనూహ్య రీతిలో ప్రచారానికి తెర తీశారు. పార్టీ అభ్యర్థిగా ఉనన రాములు నాయక్ ను తమ అభ్యర్థి కాదంటూ ప్రచారానికి దిగారు. అక్కడితో ఆగని వారు.. తమ పార్టీకి అభ్యర్థి లేరని..కాకుంటే తమ పార్టీని గెలిపించాలని కోరుతూ చేస్తున్న ప్రచారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తమ పార్టీకి అభ్యర్థి లేరని.. కాకుంటే కమలం గుర్తుకు మాత్రం ఓటు వేయటం మర్చిపోవద్దంటూ చేస్తున్న ప్రచారం అందరిని ఆకర్షిస్తోంది. ఓవైపు అభ్యర్థి మీద ఆగ్రహం ఉన్నప్పటికి.. పార్టీ మాత్రం ఓడిపోకూడదన్నట్లుగా వారి తీరు చూస్తే.. పార్టీ మారిన తమ అభ్యర్థిని కాదు.. పార్టీని గెలిపించాలంటూ చేస్తున్న ప్రచారం కన్ఫ్యూజ్ కు గురి చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న భానునాయక్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మరి.. ఓటర్ల తీర్పు ఏ తీరులో ఉంటుందో చూడాలి.