Begin typing your search above and press return to search.

ప్రతీ ఇంటికీ 15 వేలు...బీజేపీ లాజిక్ రివర్స్ !

దేశవ్యాప్తంగా జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల వేళ బీజేపీ రెండవ తరం జీఎస్టీ ఆదా ఉత్సవాలను జరుపుకుంటోంది.

By:  Satya P   |   24 Sept 2025 7:00 AM IST
ప్రతీ ఇంటికీ 15 వేలు...బీజేపీ లాజిక్ రివర్స్ !
X

దేశవ్యాప్తంగా జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల వేళ బీజేపీ రెండవ తరం జీఎస్టీ ఆదా ఉత్సవాలను జరుపుకుంటోంది. ప్రస్తుతం బీజేపీ మొత్తం అంతా దీని మీదనే ఫోకస్ పెట్టింది. టాప్ టూ బాటమ్ నాయకులు పార్టీ శ్రేణులు అంతా దీని మీదనే పీక్స్ లో ప్రచారం చేస్తున్నారు. దసరా పండుగను దీపావళితో కలిపి ముందే ప్రతీ పేదింటి ముంగిటకు చేర్చామని బీజేపీ పెద్దలు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇక నరేంద్ర మోడీ అయితే ఈ విషయం మీద పబ్లిక్ మీటింగ్స్ లో మాట్లాడుతూనే జాతిని ఉద్దేశించి ప్రత్యేకంగా సందేశం ఇచ్చారు. అంతే కాదు దేశ ప్రజలకు బహిరంగ లేఖను రాశారు. బీజేపీ నాయకులు అయితే ప్రతీ నట్టింట బీజేపీ ఆదా చేసిన ఆదాయం ఎంతో లెక్క కట్టి మరీ వివరిస్తున్నారు.

అదుపూ పొదుపూ మీదే :

ప్రతీ సామాన్యుడి జేబులో నుంచి నెలలో పోయే పదిహేను వేల మొత్తాన్ని అలాగే పర్సులో ఉంచేశామని కాషాయం నేతలు అంటున్నారు. ఖర్చు పెట్టాల్సిన సొమ్ము ఇంటి గడప దాటలేదు అంటే పేదలకు మధ్యతరగతి వర్గాలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా కాకపోయినా పరోక్షంగా ఇస్తున్న అద్భుతమైన నగదు బదిలీ కానుకే కదా ఇది అని విశ్లేషించి మరీ చెబుతున్నారు. దాంతో బడ్జెట్ పద్మనాభాలు అంతా అవును సుమీ అనుకోవడమూ మొదలెట్టారు. జేబులు తడుముకోవడమూ ఒకటికి పదిసార్లు చేస్తూ బరువు బాగానే ఉందా లేదా అని టెస్ట్ చేసుకుంటున్నారు.

లాభమెంతో తేలలేదు కానీ :

అయితే పాలు ఉత్పత్తుల విషయంలో తగ్గుదల ఉంటుందని 22 నుంచే అమలు అవుతుందని భావించిన సగటు జీవి కి తెల్లవారుతూనే తొలి షాక్ పాల ప్యాకెట్ నుంచే తగిలింది. టెట్రా ప్యాక్ లకు తప్పించి మామూలు పాల ప్యాకెట్లకు ఈ తగ్గింపు వర్తించదు అన్న సత్యాన్ని తెల్సుకున్న మీదట ఖంగు తినడం బడుగు జీవి వంతు అయింది. మార్కెట్ కి షాపింగ్ కి వెళ్తే పాత రేట్లతోనే బిల్లు బాదింది. దాంతో ఏమిటిది అంటే కొత్త రేట్లు కొత్త సరుకుతోనే అన్న సమాధానంతో మరో షాక్ ట్రీట్మెంట్ దొరికింది.

వాటి ధరలే తగ్గాయా :

విలాస వస్తువుల ధరలే తగ్గాయని అంటున్న మాట. అంటే కార్లు బైక్స్, టీవీలు వంటివి అన్న మాట. నిత్యం తినే పప్పులో మినప్పప్పు ధర అలాగే ఉంది. జీఎస్టీ దాని మీద ఉంది. అందుకే ఇడ్లీ దోశ రెండూ ఘొల్లు మంటున్నాయి. అలాగే బ్రాండెడ్ బియ్యం ధరలు సైతం అలాగే ఉన్నాయని అంటున్నారు. మరో వైపు చూస్తే నెలకు పదిహేను వేలు ఆదా అవుతుందని ఊదరగొడుతున్నట్లుగా అంత స్థాయిలో ఆదా ఏమైనా జరుగుతోందా అన్న ధర్మ సందేహం అయితే సగటు జనాన్ని వేధిస్తోంది అంటున్నారు.

వీటిని తగ్గించండి మహా ప్రభో :

ఇక అందరికీ నిత్యావసరాలుగా ఉన్నవి పెట్రోల్ డీజిల్, అలాగే వంట గ్యాస్. వీటిని అర్జంటుగా తగ్గిస్తే పెద్దల కాళ్ళు కడిగి పేదోళ్ళు నెత్తిన చల్లుకుంటారు కదా అని అంటున్నారు లీటర్ పెట్రోల్ యాభై చేస్తే దసరా దీపావళి ఏంటి అన్ని పండుగలూ ఇంటి ముందే కొలువుంటాయని అంటున్నారు. అలాగే బీజేపీ కేంద్రంలో గద్దెనెక్కినపుడు వంట గ్యాస్ సిలిండర్ బండ నాలుగు వందల లోపే ఉందని గుర్తు చేస్తున్నారు. అందువల్ల దానికి తగ్గిస్తే ఏ మూడు వందలుగా చేస్తే కాషాయ పెద్దలను శాశ్వతంగానే తలచుకుంటారు అని అంటున్నారు.

అది కదా లాజిక్ అంటే :

సరే ఇవన్నీ పక్కన పెడితే నెలకు పది హేను వెల రూపాయలు సామాన్యుడికి ఆదా చేశామని అంటున్నారు కదా. గత ఎనిమిదేళ్ళుగా నాలుగు స్లాబులతో బాదిన బాదుడుకు ప్రతీ ఇంటి నుంచి ఇంతే మొత్తం బయటకు వెళ్ళింది కదా అని గుర్తు చేస్తున్నారు. ఆ లెక్కన అయితే సామాన్యులు ఈ ఎనిమిదేళ్లలో ప్రతీ ఇంటి నుంచి ఏకంగా 13 లక్షల రూపాయలు జీఎస్టీ పన్నుల రూపంలో చెల్లించారు అనే కదా అర్థం అని రివర్స్ లో లాజిక్ గా క్వశ్చన్ చేస్తున్నారు. మరి దీనికి జవాబు చెప్పండి అని ఇండియా కూటమి నేతలు అయితే నేరుగానే నిలదీస్తున్నారు. అంతే కాదు ప్రజలకు ఆదా అవుతోంది, రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయి కదా వారికి నష్టపరిహారం మాటేంటి అని తెలంగాణా కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ మరో ప్రశ్నను ఎన్డీయే పెద్దలకు సంధించారు.