ఆ ఒక్కటి తప్ప అంటున్న బీజేపీ...సీజేపీ ఏం చేస్తుంది ?
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వివాదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కఠినమైన నిర్ణయం దిశగా అడుగులు వేగంగా వేస్తోంది.
By: Satya P | 25 July 2026 12:13 AM ISTయమధర్మరాజు సతీ సావిత్రికి పతి ప్రాణంబు తప్ప తక్కిన వరాలు ఏమైనా కోరుకోమని అంటాడు. అలా ఉంది బీజేపీ కేంద్ర మంత్రులతో సీజేపీ ప్రతినిధుల చర్చల సారాంశం అని అంటున్నారు. ఈ చర్చలలో అన్ని విషయాలు బాగా సాగాయని రెండు వైపులా చెబుతున్నారు. కానీ అసలైన విషయం డెడ్ లాక్ పడిన ఇష్యూ ఒక్కటే ఉంది. అదే కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ఆ విషయంలో మాత్రం బీజేపీ పెద్దలు అయితే ససేమిరా అనే అంటున్నారు. ఆయన రాజీనామా కాదు కానీ చాలానే చేస్తున్నాం కదా అని చెబుతున్నారు. కానీ తమకు కావాల్సింది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామావే అని సీజేపీ అంటోంది. లేకపోతే ఈ నెల 20న నిర్వహించిన భారీ ఉద్యమం కంటే కూడా అతి పెద్ద ఉద్యమాన్నే నిర్వహిస్తామని కూడా హెచ్చరిస్తోంది.
రెండు ఓకే కానీ :
ఇదిలా ఉంటే కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో సీజేపీ ప్రతినిధి బృందంతో తాజాగా సమావేశమై అనేక అంశాలు చర్చించారు. ఈ సమావేశానికి సీజేపీ నుంచి జాతీయ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా జేపీ నడ్డా చెప్పినది ఏంటి అంటే జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షా విధానంలో సంస్కరణలకు సంబంధించి సీజేపీ లేవనెత్తిన డిమాండ్లను తాము సావధానంగా విన్నామని. అంతే కాదు సీజేపీ మూడు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచిందని చెప్పారు. పరీక్షా పత్రాల లీకేజీని అరికట్టడానికి కొన్ని సంస్కరణలను కూడా సూచించిందని అంటునారు. వీటి మీద సీజేపీ ప్రతినిధి బృందంతో కేంద్ర ప్రభుత్వం మరో విడత చర్చలు జరుపుతుందని నడ్డా చెప్పుకొచ్చారు. అయితే నీట్ పరీక్షల అక్రమాల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం, విద్యార్థులపై పెట్టిన ఎఫ్‌ఐఆర్‌లు, కేసులు ఉపసంహరించుకోవాలనే తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి తెలియచేశామని సూత్రప్రాయంగా అంగీకరించారని సీజేపీ ప్రతినిధులు అంటున్నారు. అయితే అన్నింటితో పాటుగా టాప్ ప్రయారిటీ తమకు ఒకటి ఉందని అదే కేంద్ర మంత్రి రాజీనామా అని వారు హైలెట్ చేస్తున్నారు.
అవకాశాలు లేవా :
ఇక కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ఎంతమేరకు అవకాశాలు ఉన్నాయంటే అతి తక్కువ అని అంటున్నారు. నిజానికి ఆయన చేత రాజీనామా ఇప్పించాలంటే సీన్ ఇంతవరకూ వచ్చేది కాదు కదా అని అంటున్నారు. అందువల్ల కేంద్ర బీజేపీ పెద్దలు ఏమి జరుగుతుందో తెలుసు. దాని పర్యవసానాలు కూడా ఎదుర్కోవడం ఎలాగో కూడా తెలుసు. మరి ఈ చర్చలు దేనికీ అంటే ప్రజాస్వామ్యంలో ఇవి అవసరం కాబట్టి. పైగా ఇష్యూ ఇపుడు దేశమంతా చూస్తోంది. సీజేపీ పెట్టిన డిమాండ్లు అలాగే కేంద్రం తీసుకుంటున్న చర్యలు అనీ జనం ముందు ఉన్నాయి. మరీ ఒకే ఒక డిమాండ్ మీద నిలబడి కేంద్ర మంత్రి రాజీనామావే తమకు కావాలని రాజకీయ డిమాండ్ చేయడం ద్వారా సీజేపీ పలుచబడుతుందని కూడా ఉంది. బీజేపీ వ్యూహాత్మకంగానే ఈ విషయంలో వ్యవహరిస్తోంది అని అంటున్నారు. నీట్ కి సంబంధించి చూస్తే ఏకంగా 47 మంది అధికారుల మీద కేంద్రం వేటు వేసింది.
భారీ ప్రక్షాళన దిశగా :
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వివాదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కఠినమైన నిర్ణయం దిశగా అడుగులు వేగంగా వేస్తోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్‌టీఏ ప్రక్షాళనలో భాగంగా ఏకంగా 47 మంది అధికారులపై వేటు వేసింది. బాధ్యులైన వారిని తొలగిస్తూ చట్టపరమైన చర్యలు అవుట్‌సోర్సింగ్ విధానంలో మార్పులతో సంస్థను ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. ఎన్‌టీఏ ప్రక్షాళన కోసం కేంద్రం తీసుకున్న చర్యలు అలాగే అధికారుల తొలగింపు వంటివి ఇపుడు చర్చకు తావిస్తున్నాయి. అంతే కాదు లీకేజీలు అవకతవకలకు బాధ్యులుగా గుర్తించిన 47 మంది ఎన్‌టీఏ అధికారులను సర్వీస్ నుండి తక్షణమే తొలగించారు. ఇది నిజంగా పవర్ ఫుల్ డెసిషన్ అని అంటున్నారు. అదే విధంగా తొలగించబడిన అధికారులలో కొందరిపై చట్టపరమైన క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ జరపనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మొత్తం పరిణామాలు చూస్తే కేంద్రం దూకుడుగానే వెళ్తోంది. అదే సమయంలో రాజకీయ డిమాండ్లకు తలొగ్గేది లేదని కూడా తెలియచేస్తోంది. దాంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఉంటుందా అంటే ఉండకపోవచ్చు అనే అంటున్నారు.
