సమరోత్సాహంతో తెలంగాణాకు మోడీ !
తెలంగాణా రాష్ట్రాన్ని పాలించాలన్నది బీజేపీ కల. అది ఇప్పటికి కాదు దశాబ్దాల నాటిది. అందుకే చిన్న రాష్ట్రాలకు మద్దతు తెలుపుతూ వచ్చింది.
By: Satya P | 8 May 2026 4:00 AM ISTతెలంగాణా రాష్ట్రాన్ని పాలించాలన్నది బీజేపీ కల. అది ఇప్పటికి కాదు దశాబ్దాల నాటిది. అందుకే చిన్న రాష్ట్రాలకు మద్దతు తెలుపుతూ వచ్చింది. కేసీఆర్ తెలంగాణా ఉద్యమం అందుకోగానే తొలి మద్దతు బీజేపీ వైపు నుంచే వచ్చింది. ఉమ్మడి ఏపీలో బీజేపీకి బలం ఉన్నది తెలంగాణాలోనే. అది కూడా దక్షిణ తెలంగాణాలో కొన్ని పట్టణ ప్రాంతాలలో. అయితే తెలంగాణా తెచ్చమని బీఆర్ఎస్ క్రెడిట్ తీసుకుని రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. ఇచ్చామని చెప్పి 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా గెలిచింది. మరి మద్దతు ఇచ్చామని చెప్పిన బీజేపీ తెలంగాణాలో తమ రాజకీయ వాటాను కూడా పొందేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది.
సెకండ్ స్టెప్ తో సక్సెస్ :
బీజేపీ ఏ రాష్ట్రం మీద అయినా గురి పెట్టాలే కానీ దాని వెనక అండర్ గ్రౌండ్ ప్రిపరేషన్ సైలెంట్ వర్క్ అన్నవి బీభత్సంగా చేసుకుని పోతుంది. ఫస్ట్ అటెంప్ట్ లో తమ బలాన్ని అంచనా వేసుకుంటుంది. ప్రత్యర్ధి బలాలను కూడా బేరీజు వేసుకుంటుంది. సెకండ్ స్టెప్ పడిందా అంటే ఇక సక్సెస్ రూట్ లోకే అది వెళ్తుంది. దానికి అచ్చమైన ఉదాహరణ పశ్చిమ బెంగాల్. అది ఎర్రన్న కోట. దశాబ్దాలుగా వామపక్ష భావ జాలంతో తరించిపోయిన బెంగాల్ నే బీజేపీ ఏమీ కాకుండా తన వైపునకు తిప్పుకుంది. 2016 లో కేవలం మూడు సీట్లు ఉన్న చోట పదేళ్ళు తిరగకుండానే ఏకంగా 207 సీట్లు సాధించి బంపర్ విక్టరీ కొట్టింది. దాంతో ఇపుడు తెలంగాణాలోనూ ఆ తరహా ప్రయోగం చేయబోతోంది అని అంటున్నారు.
ఆప్షన్ బీజేపీనే :
2014లో బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకుంటే అయిదారు మంది గెలిచారు. ఇక 2018లో మాత్రం ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి అసెంబ్లీలో ఉన్నారు. 2023లో ఆ సంఖ్య 8 దాకా చేరింది. అయితే ఓటు షేర్ ఇరవై శాతం దాకా వచ్చింది. అది ఆ పార్టీకి ఎంతో సంతృప్తిని ఇచ్చింది. 2024లో ఏకంగా 8 మంది ఎంపీలను బీజేపీ గెలుచుకుంది. అంటే సగానికి సగం తెలంగాణా అన్న మాట. దాంతో ఇపుడు ఆ ఊపుతోనే బీజేపీ 2028 ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రాండ్ గా రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే మోడీ తెలంగాణా టూర్ ఖరారు అయింది.
విజయాలతో మోడీ :
మోడీ ఈసారి తెలంగాణా రావడం వెనక అనేక విశేషాలు ఉన్నాయి. ఆయన దేశంలో ప్రధానిగా మూడవసారి బాధ్యతలు చేపట్టిన తరువాత తెలంగాణాకు రావడం ఇదే ప్రధమం. దాంతో ఆ ఉత్సాహం వేరే లెవెల్ గా ఉంటుంది. దానికి తోడు అన్నట్లుగా పశ్చిమ బెంగాల్ లో బీజేపీ కనీ వినీ ఎరగని విజయం సాధించింది. బీజేపీ పెద్దలకు ఏకు మేకుగా మారిన మమతా బెనర్జీని ఓడించడం అంటే మామూలు విషయం కాదు. ఆ సంబరం అలా ఉండగానే మోడీ తెలంగాణాకు రావడం అసలైన విశేషం. ఇక 9న బెంగాల్ కొత్త బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంలో మోడీ పాల్గొంటారు. అటు నుంచి అటే అన్నట్లుగా ఆయన తెలంగాణాకు రానున్నారు. అంటే కాషాయం విజయాల స్పూర్తిని బీజేపీ తెలంగాణా నేతలకు అందించి ఇక మీదట గట్టిగా పోరాడాలని మోడీ దిశా నిర్దేశం చేస్తారు అన్న మాట.
అభివృద్ధి పనులతో సిద్ధం :
ఇదిలా ఉంటే నరేంద్ర మోడీ తెలంగాణా పర్యటన ఖరారు అయింది. ఆయన ఈ మేరకు ఢిల్లీలోని ప్రధాని ఆఫీస్ మోడీ టొరొ షెడ్యూల్ ని రిలీజ్ చేసింది. దాని ప్రకారం చూస్తే మోడీ ఈ నెల 10వ తేదీన బెంగళూరు నుంచి డైరెక్ట్ గా ఒక ప్రత్యేక విమానంలో తెలంగాణా రాజధాని హైదరాబాద్ కి చేరుకుంటారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన హెచ్ఐసీసీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అలా తెలంగాణలో దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులకు నరంద్ర మోడీ శ్రీకారం చుడతారు అని అంటున్నారు.
ఏమి మాట్లాడుతారు :
ఇక ప్రధాని నరేంద్ర మోడీ ఆ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మరి మోడీ ఏమి మాట్లాడుతారు అన్నదే సర్వత్రా ఆసక్తిని కలిగించే విషయం. మోడీ ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు అవుతున్న విషయాన్ని తాజగా ఢిల్లీలో జరిగిన పార్టీ విజయోత్సవాలలో ప్రస్తావించారు. ఇక బీజేపీకి దక్షిణాదిన కీలక స్థావరంగా తెలంగాణా ఉంది. దాంతో తెలంగాణాను సాధించాలన్న బీజేపీ పట్టుదల నేపథ్యంలో మోడీ అటు ప్రజలకు ఇటు పార్టీకి కూడా ఉదీశించి ఉత్తేజపూరితమైన ప్రసంగం చేస్తారు అని అంటున్నారు. తెలంగాణాలో డబుల్ ఇంజన్ సర్కార్ ఎందుకు అవసరం అన్నది కూడా ఆయన వివరిస్తారు అని అంటున్నారు. ఆ ప్రసంగం తరువాత మోడీ అక్కడి నుంచి డైరెక్ట్ గా బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళతారు. ఇదిలా ఉంటే మోడీ బహిరంగ సభ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
