చిరులా వద్దు.. పవన్ ను ఫాలో అవ్వాలి.. విజయ్ కు పెరుగుతున్న విన్నపాలు
తమిళ రాజకీయాల్లో సత్తా చాటాలంటే ఒంటరి పోరు వద్దని.. కూటమి బాటే ముద్దన్నట్లుగా విజయ్ సన్నిహితుల వాదనలా వినిపిస్తోంది.
By: Garuda Media | 11 Jan 2026 10:07 AM ISTతమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర్లోకి వచ్చాయి. ఆ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సినీ నటుడు విజయ్ పార్టీ వ్యవహారం ఒక ఎత్తు అయితే.. తాజాగా ఆయన నటించిన ‘జన నాయగన్’ మూవీ సెన్సార్ ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ రిలీజ్ కాని పరిస్థితి. ఏపీ ప్రజల మాదిరే తమిళనాడులోనూ సంక్రాంతి పండుగ ఎంత పెద్దదో తెలిసిందే. దీపావళికి మించి పొంగల్ ను తమిళులు భారీగా చేసుకుంటారు. అలాంటి పెద్ద పండక్కి తన ఆఖరి సినిమా విడుదలయ్యేలా ప్లాన్ చేస్తే.. సెన్సార్ సమస్యల్ని ఎదుర్కొంటూ ఎప్పుడు విడుదల అవుతుందో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి వేళ.. విజయ్ సన్నిహితులు ఆయనకు మరోసారి చిరంజీవి.. పవన్ కల్యాణ్ రాజకీయ బాటను ఉదాహరణగా చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది.
తమిళ రాజకీయాల్లో సత్తా చాటాలంటే ఒంటరి పోరు వద్దని.. కూటమి బాటే ముద్దన్నట్లుగా విజయ్ సన్నిహితుల వాదనలా వినిపిస్తోంది. నిజానికి ఈ అంశంపై విజయ్ పార్టీ పెట్టిన నాటి నుంచే చర్చ జరుగుతోంది. ఈ అంశంపై విజయ్ ఇప్పటివరకు స్పష్టత రాలేదన్న మాట వినిపిస్తోంది. ఒక దశ వరకు మౌనంగా ఉన్న ఆయన.. తర్వాతి కాలంలో బీజేపీపై విమర్శలు చేయటం.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో మళ్లీ మౌనాన్ని ఆశ్రయించిన తీరు తెలిసిందే.
తాజాగా విజయ్ నటించిన జన నాయగన్ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ సకాలంలో అందకుండా ఉండటానికి అధికార డీఎంకే మాత్రమే కాదు.. బీజేపీ కూడా కారణమన్న ప్రచారం బలంగా సాగుతోంది. ఒకవేళ రాష్ట్రస్థాయిలో అధికార డీఎంకే అడ్డుకున్నా.. కేంద్రం దన్నుగా నిలిస్తే చిత్ర విడుదలకు అడ్డంకులు ఉండేవి కావన్న మాట బలంగా వినిపిస్తోంది. ఎంతకూ తన దారికి రాని విజయ్ ను తన దారికి తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగా బీజేపీ ప్లానింగ్ ఉందన్న మాట వినిపిస్తోంది.
దక్షిణాదిలో తమ పార్టీ సత్తా చాటాలని బీజేపీ అధినాయకత్వం చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రాని పరిస్థితి. కర్ణాటకలో కాస్త పట్టు తెచ్చుకున్నప్పటికి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి అంతంతమాత్రమే. 42 ఎంపీ స్థానాలున్న తమిళనాడులో బీజేపీ పట్టు సాధిస్తే.. సౌత్ లో బలపడటం సులువు అవుతుందని భావిస్తోంది. ఇందులో భాగంగా అన్నాడీఎంకేతో చెట్టాపట్టాలు వేసుకున్నప్పటికి.. ఆ పార్టీలో నాయకత్వ లేమి.. చీలికల నేపథ్యంలో విజయ్ నాయకత్వంలోని టీవీకే తమతో జట్టు కట్టాలన్నది కమలనాథుల ఆలోచనగా చెబుతున్నారు.
ఈ విషయంలో విజయ్ ఏటూ తేల్చుకోలేకపోతున్నారు. సరైన సమయంలో..విజయ్ ను ఇరకాటంలో పెట్టి తమ వైపునకు తిప్పుకోవాలన్న ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్లుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే.. అందులో నిజంలేదని బీజేపీ నేతలు చెబుతున్నా.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పాలి. కరూర్ జిల్లా తొక్కిసలాట దుర్ఘటన ఇష్యూలోనూ విజయ్ ను ఇరకాటంలో పెట్టి పొత్తుకు ఒప్పించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందనన అభిప్రాయం బలంగా ఉన్నా.. అలాంటిదేమీ లేదని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
విజయ్ కు ఇబ్బందులు కలిగించాలని భావించి ఉంటే.. కరూర్ జిల్లా తొక్కిసలాటలో 41 మంది మరణించిన సమయంలోనే ఆ పని చేసి ఉండేవాళ్లమని..విజయ్ బయటకు వచ్చేవారుకాదన్న మాట బీజేపీ సీనియర్ నేత హెచ్ రాజా నోట రావటం గమనార్హం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ వాదనల మీద రియాక్టు కావాల్సిన విజయ్ మౌనాన్ని ఆశ్రయించటంతో అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో కొత్త వాదన ఒకటి తమిళ రాజకీయాల్లో బలంగా వినిపిస్తోంది.
జన నాయగన్ మూవీ విడుదలకు సెన్సార్ అడ్డంకులు నెలకొన్న వేళ.. విజయ్ సన్నిహితులు ఆయనకు మెగాస్టార్ చిరంజీవి.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహాల్ని ఉదాహరణగా చెబుతున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఏపీలో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి ఒంటరిగా ఎంట్రీ ఇచ్చి ఫెయిల్ అయ్యారని.. ఆయన తమ్ముడు పవన్ జనసేనతో ఎంట్రీ ఇవ్వటం.. బీజేపీతో చేతులు కలిపి డిప్యూటీ సీఎంగా మారటమేకాదు.. కూటమి సర్కారులో కీలకభూమిక పోషించటాన్ని ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత చేస్తే.. ఈ తరహా ఉదాహరణల్ని మౌనంగా వినటమే తప్పించి..తన మనసులోని మాటను మాత్రం విజయ్ బయటకు రానివ్వటం లేదని చెబుతున్నారు. విజయ్ పెదవి విప్పే వరకు తమిళ రాజకీయాలు స్పష్టత రావని చెప్పకతప్పదు.
