బీజేపీకి భారీ విరాళాలు.. మొత్తం డొనేషన్లలో 82% ఆ పార్టీకే..!
2024 లోక్ సభ ఎన్నికలకు ముందు సుప్రింకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఎలక్టోరల్ బాండ్లను రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంటూ ఆ పథకాన్ని కొట్టివేసింది.
By: Raja Ch | 22 Dec 2025 5:00 AM IST2024 లోక్ సభ ఎన్నికలకు ముందు సుప్రింకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఎలక్టోరల్ బాండ్లను రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంటూ ఆ పథకాన్ని కొట్టివేసింది. అలా కోట్టివేసిన తర్వాత మొదటి ఆర్ధిక సంవత్సరం 2024 - 25లో తొమ్మిది ఎలక్టోరల్ ట్రస్టులు దేశంలోని రాజకీయ పార్టీలకు మొత్తం రూ.3,811 కోట్లను విరాళంగా ఇచ్చాయి. ఇందులో 82% భారతీయ జనతా పార్టీ వాటా కావడం గమనార్హం.
అవును... ఎలక్టోరల్ బాండ్లను సుప్రీంకోర్టు నిలిపివేసిన తర్వాత ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా 2024-25లో దేశంలోని రాజకీయ పార్టీలకు మొత్తం రూ.3,811 కోట్లు విరాళంగా వచ్చాయి. ఇందులో ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఆ మొత్తం నిధుల్లో రూ.3,112 కోట్లు అందాయి! ఇక మిగిలిన మొత్తంలో 8 శాతం కంటే తక్కువ రూ.299 కోట్లు కాంగ్రెస్ కు వెళ్లగా.. దాదాపు 10% అంటే రూ.400 కోట్లు మిగిలిన అన్ని పార్టీలకు వెళ్లాయి.
వాస్తవానికి.. ఈ నెల 20 నాటికి ప్రస్తుతం నమోదు చేసుకున్న 19 ఎలక్టోరల్ ట్రస్టులలోనూ 13 ఎలక్టోరల్ ట్రస్టుల సహకార నివేదికలు ఎన్నికల కమిషన్ వద్ద అందుబాటులో ఉన్నాయి. అయితే అందులో.. జన్హిత్, పరిబర్తన్, జైహింద్, జయభారత్ అనే నాలుగు ట్రస్టులు 2024-25లో తమ విరాళాలు శూన్యం అని ప్రకటించాయి. ఈ క్రమంలో..మిగిలిన 9 ట్రస్టులు కలిపి పార్టీలకు మొత్తం రూ.3,811 కోట్ల విరాళాలను ప్రకటించాయి.
ఇది 2023-24 లో వచ్చిన రూ.1,218 కోట్ల కంటే 200% ఎక్కువ. తాజా విరాళాల్లో ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్టు బీజేపీకి ప్రధాన దాతగా ఉంది. ఈ ట్రస్టు మొత్తం రూ.2,180.07 కోట్లు అందించింది. ఈ ట్రస్టు.. జిందాల్ స్టీల్ అండ్ పవర్, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇంఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, భారతీ ఎయిర్ టెల్, అరబిందో ఫార్మా, టోరెంటో ఫార్మాస్యూటికల్స్ వంటి పలు కీలక సంస్థల నుంచి నిధులు పొందింది.
2024-25లో ఏయే ట్రస్టు ఎంత విరాళం ఇచ్చిందనేది ఇప్పుడు చూద్దామ్...!:
ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ - రూ.2,668.46 కోట్లు
ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ - రూ.914.97 కోట్లు
న్యూ డెమోక్రటిక్ ఎలక్టోరల్ ట్రస్ట్ - రూ.160 కోట్లు
హర్మొనీ ఎలక్టోరల్ ట్రస్ట్ - రూ.35.65 కోట్లు
ట్రయంఫ్ ఎలక్టోరల్ ట్రస్ట్ - రూ.25 కోట్లు
సమాజ్ ఎలక్టోరల్ ట్రస్ట్ అసోసియేషన్ - రూ.6 కోట్లు
జన్ ప్రగతి ఎలక్టోరల్ ట్రస్ట్ - రూ.1.02 కోట్లు
జన్ కల్యాణ్ ఎలక్టోరల్ ట్రస్ట్ - రూ.19 లక్షలు
ఎన్జిగార్టిక్ ఎలక్టోరల్ ట్రస్ట్ - రూ.7.75 లక్షలు
