Begin typing your search above and press return to search.

బీజేపీకి డీఎంకేతో కొత్త రాజకీయ బంధం ?

దక్షిణాదిన అతి పురాతన ప్రాంతీయ పార్టీగా డీఎంకేకు పేరుంది. డీఎంకే 1964లో తమిళనాడు అసెంబ్లీలో ప్రవేశించి ప్రతిపక్ష స్థానాన్ని అందుకుంది.

By:  Satya P   |   23 May 2026 11:00 AM IST
బీజేపీకి డీఎంకేతో  కొత్త రాజకీయ బంధం ?
X

దక్షిణాదిన అతి పురాతన ప్రాంతీయ పార్టీగా డీఎంకేకు పేరుంది. డీఎంకే 1964లో తమిళనాడు అసెంబ్లీలో ప్రవేశించి ప్రతిపక్ష స్థానాన్ని అందుకుంది. అయితే అంతకు ముందే 1940 దశకం నుంచి దాని చరిత్ర ఉంది. ఏ విధంగా చూసుకున్నా దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీ అది. ఇక బీజేపీ కూడా జనసంఘ్ కాలం నాటిది. ఈ రెండు పార్టీల కలయిక సాధ్యమేనా అన్నది ఇపుడు చర్చ. ఎందుకంటే తమిళనాడులో కాంగ్రెస్ తో డీఎంకే దూరం జరిగింది. పార్లమెంట్ లో కూడా తమకు ఇండియా కూటమి నుంచి వేరు చేస్తూ ప్రత్యేక సీటింగ్ ఇవ్వాలని లోక్ సభ స్పీకర్ కి కనిమొళి లేఖ రాశారు ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంలో బీజేపీకి సరికొత్త ఆశలు పుట్టుకుని వస్తున్నాయని అంటున్నారు. డీఎంకేని తమ వైపు తిప్పుకోవాలన్నదే ఆ ఆశలకు కారణంగా ఉంది.

ఎన్డీఎతో పాత స్నేహం :

డీఎంకేకు ఎన్డీయేతో గతంలో స్నేహం ఉంది. వాజ్ పేయ్ ప్రభుత్వంలో డీఎంకే మంత్రులు కూడా ఉండేవారు. అలా బీజేపీతో డీఎంకేకు పూర్వ పరిచయాలు స్నేహాలు ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అయితే ఆ తరువాత కాలంలో డీఎంకే కాంగ్రెస్ కి చేరువ అయింది. జయలలిత బీజేపీ వైపు వచ్చారు అలా జయలలిత నాయకత్వంలోని అన్నాడీఎంకేతో తో బీజేపీ బంధం దశాబ్దాలుగా కొనసాగింది. అన్నాడీఎంకేతో 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దాకా కూడా ఆ మైత్రి ఉంటూ వచ్చింది. ఇపుడు చూస్తే తమిళనాడులో అన్నా డీఎంకే అస్తిత్వం పూర్తిగా దెబ్బ తినేలా ఉంది. దాంతో బీజేపీ డీఎంకే వైపు చూస్తోంది అని అంటున్నారు.

ముందు చూపుతోనే :

డీఈంకేకి పార్లమెంట్ లో పెద్ద సంఖ్యలో ఎంపీలు ఉన్నారు. లోక్ సభలో అయితే 22 మంది సభ్యులు ఉన్నారు. ఇపుడు బీజేపీకి కీలకమైన బిల్లులను ఆమోదించుకోవాలంటే సభలో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. ఆ మ్యాజిక్ నంబర్ 352 గా ఉంది. కానీ ఏప్రిల్ లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం లోక్ సభలో డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెడితే వచ్చిన ఓట్లు 298 గా ఉంది. దాంతో డీఎంకే లాంటి పార్టీలను మద్దతుగా తెచ్చుకుంటే సులువుగా బిల్లులను పాస్ చేసుకోవచ్చు అన్నది కూడా బీజేపీలో ఉన్న ముందు చూపు వ్యూహంగా చెబుతున్నారు. పైగా వచ్చే ఏడారి రాష్ట్రపతి ఎన్నికలు కూడా ఉన్నాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి గెలవాలి అంటే డీఎంకే లాంటి పార్టీల సహకారం తప్పనిసరి. మరి ఇవన్నీ బీజేపీ ఆలోచిస్తూ డీఎంకే వైపు చూస్తోంది. అయితే ఇది ఏ మేరకు నెరవేరుతుంది అన్నది కూడా మరో కీలక చర్చ.

సిద్ధాంత పోరాటం :

డీఎంకేది ద్రవిడ పోరాటం సనాతన ధర్మం మీద ఆ పార్టీ నిప్పులు చెరుగుతుంది. అదే విధంగా హిందీని వ్యతిరేకిస్తుంది. బీజేపీ హిందూత్వ పోకడలను నిలదీస్తుంది. డీలిమిటేషన్ తో దక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతోంది అని ఎలుగెత్తి మాట్లాడిందే స్టాలిన్. మరి ఆ పార్టీ బీజేపీతో కలిస్తే జనాల నుంచి వచ్చే ప్రతిస్పందన ఎంత ఘాటుగా ఉంటుందో కూడా ఆలోచించలేని వారు డీఎంకే నాయకులు కారని అంటున్నారు. అయితే రాజకీయాల్లో ఎపుడూ టైం, టైమింగ్ చాలా ముఖ్యం. జనాలను కన్వీన్స్ చేయడమూ దానిని బట్టే ఉంటుంది. తమిళనాడులో ఓటమి పాలు అయిన డీఎంకేకి ఇపుడు ఒక అండ దండ కావాలని అంటున్నారు. విజయ్ ప్రభుత్వం ఆరు నెలలలో కూలుతుందని స్టాలిన్ పదే పదే అంటున్నా ఆశలు నెరవేరేది ఏ మాత్రం అన్నది ఒక ప్రశ్న. ఇక కేంద్ర పెద్దల సాయం సహకారం ఉంటే తమిళనాడులో తన పార్టీని మళ్ళీ ముందుకు తీసుకుని వెళ్లవచ్చు అన్నది కూడా ఉంటుంది. విజయ్ కనుక బలపడితే అన్నాడీఎంకే కి మాత్రమే కాదు, డీఎంకేకీ ప్రమాదమే అన్నది తెలియని వారు స్టాలిన్ కారని అంటున్నారు. మొత్తానికి బీజేపీకి అవసరాలు ఉన్నాయి. డీఎంకేకి అనివార్యతలు ఉన్నాయి. ఈ రెండూ ఎక్కడో ఒకచోట కలవకపోతాయా అన్నదే చర్చ. చూడాలి మరి ఏమి జరుగుతుందో.