Begin typing your search above and press return to search.

బీజేపీ వాటా తేల్చమంటోందా ?

మరి జనసేన వర్గాల ఆలోచనల మేరకు 30 శాతం సీట్లు ఆ పార్టీ కోరుతోంది అని అంటున్నారు. బీజేపీ ఎన్ని సీట్లు కోరుతుంది అన్నదే చర్చగా ఉంది.

By:  Satya P   |   21 Aug 2026 9:10 AM IST
బీజేపీ వాటా తేల్చమంటోందా ?
X

స్థానిక సంస్థల ఎన్నికలు టీడీపీ కూటమిలో కొత్త రాజకీయాన్ని చూపించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. మిత్రులు ఈసారి గట్టి పట్టుదల మీద ఉండడమే అందుకు కారణం. 2024 ఎన్నికల్లో బీజేపీకి 10 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. అలాగే అయిదు దాకా ఎంపీ సీట్లు ఇచ్చారు. అయితే ఇందులో మూడు ఎంపీలను ఎనిమిది ఎమ్మెల్యేలను బీజేపీ గెలుచుకుంది. ఒక విధంగా కూటమితో జత కట్టి బీజేపీ బాగానే లాభపడింది అని అంటున్నారు. అయితే బీజేపీ ఇపుడు అక్కడితో ఆగేది లేదని సంకేతాలు ఇస్తోంది. గతం కంటే తమకు బలం పెరిగింది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ఇవ్వాలని కోరుతోంది.

నితిన్ నబీన్ దిశా నిర్దేశం :

ఇక ఇటీవలనే విశాఖ వచ్చి పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశాలను నిర్వహించిన నితిన్ నబీన్ ప్రత్యేకించి ఏపీలో బీజేపీ బలోపేతం మీద కీలక సూచనలు ఇచ్చారని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఒక మంచి అవకాశంగా చెబుతూ ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని దిశా నిర్దేశం చేశారు అని అంటున్నారు. అంతే కాదు పల్లెల నుంచి పట్టణాల దాకా బీజేపీ ప్రభావం చూపించాలని కోరారు. కొత్తగా ఏర్పడే పాలక వర్గాలలో బీజేపీ పాత్ర స్ప్ష్టంగా ఉండాలని బీజేపీ భాగస్వామ్యం కూడా కనిపించాలని నితిన్ నబీన్ కోరారు.

ఎక్కువ సీట్లు కోసం :

జాతీయ అధ్యక్షుడు ఇచ్చిన సలహా సూచనలతో రాష్ట్ర బీజేపీ అయితే ఎక్కువ సీట్లను కోరడానికి సిద్ధం అవుతోంది అని అంటున్నారు. అయితే ఈ మధ్యన ఒక ప్రచారం కూటమి పొత్తుల విషయంలో బయటకు వచ్చింది. దాని ప్రకారం టీడీపీ 80 శాతం జనసేన 15 శాతం బీజేపీ 5 శాతం సీట్లలో పోటీ చేస్తాయన్నది. అయితే దాని మీద జనసేన నుంచి అయితే ఘాటుగా రియాక్షన్ వచ్చింది. తాము ఎక్కువ సీట్లు కోరుతామని ఆ పార్టీ అంటోంది. బీజేపీ అయితే ఇంతవరకూ దీని మీద మాట్లాడకపోయినా బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి ఎక్కువ సీట్లు తీసుకోమనే సూచనలు వచ్చాయని అంటున్నారు. నితిన్ నబీన్ ఇచ్చిన ఈ సందేశం రాష్ట్ర శాఖను అప్రమత్తం చేసింది అని అంటున్నారు.

ఎంత వాటా కావాలంటే :

మరి జనసేన వర్గాల ఆలోచనల మేరకు 30 శాతం సీట్లు ఆ పార్టీ కోరుతోంది అని అంటున్నారు. బీజేపీ ఎన్ని సీట్లు కోరుతుంది అన్నదే చర్చగా ఉంది. అయితే బీజేపీ పది నుంచి పదిహేను శాతం సీట్లు కోరవచ్చు అని అంటున్నారు. అందులో పట్టణాలలో బీజేపీ బలంగా ఉంద్ది అని విద్యావంతులు అగ్ర వర్ణాలలో తమ పార్టీకి ఆదరణ ఉంటుందని బీజేపీ భావిస్తోంది కాబట్టి అక్కడ సీట్లు ఎక్కువగా కోరవచ్చు అని అంటున్నారు. అంటే మునిసిపాలిటీలు కార్పోరేషన్లలో బీజేపీ తన వాటా పట్టుబట్టే అవకాశాలు అని అంటున్నారు.

ఆమోదయోగ్యమైన విధంగానే పొత్తులు :

విజయవాడ విశాఖపట్నం వంటి చోట్ల కార్పోరేషన్లలో కూడా బీజేపీ తన పట్టుని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే జనసేన కోరినట్లుగా 30 శాతం బీజేపీ కోరినట్లుగా 15 శాతం దాకా సీట్లు కేటాయిస్తే టీడీపీ పోటీ చేసేది అచ్చంగా 55 శాతమే ఉండొచ్చు అని అంటున్నారు. మరి అలా జరుగుతుందా టీడీపీ క్యాడర్ ఒప్పుకుంటారా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా స్థానిక ఎన్నికల్లో సర్దుబాట్లు కూటమికి తల పోట్లు అన్న మాట ఉన్నప్పటికీ చంద్రబాబు వ్యూహాలు చాణక్యంతో దీనిని అధిగమిస్తారు అని అందరికీ ఆమోదయోగ్యమైన విధంగానే పొత్తులు కుదురుతాయని అంటున్నారు.