Begin typing your search above and press return to search.

డీలిమిటేషన్ బిల్లు ఆమోదం....బీజేపీ ధీమా వెనక ?

బీజేపీకి సొంతంగా మెజారిటీ లేకపోవడంతో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుల ఆమోదం సవాలుగా మారింది. అయితే నవంబర్ నెలాఖరులో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి బిల్లులను ఆమోదించుకోవాలని కేంద్రం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఉద్ధవ్ శివసేన, ఎన్సీపీ, డీఎంకే సహా విపక్ష ఎంపీల మద్దతు కూడగట్టే వ్యూహంలో ఉన్నట్లు సమాచారం.

By:  Satya P   |   13 Nov 2026 9:32 AM IST
డీలిమిటేషన్ బిల్లు ఆమోదం....బీజేపీ ధీమా వెనక ?
X

కేంద్రంలో మూడవసారి నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణం చేశారు అన్నది వాస్తవమే కానీ బీజేపీకి 240 సీట్లు మాత్రమే వచ్చాయన్నది అంతకంటే వాస్తవం. బీజేపీకి సొంతంగా మెజారిటీ రాని ప్రభుత్వం ప్రస్తుతం సాగుతోంది. మిత్రులతో కొనసాగుతున్న ఈ ప్రభుత్వంలో సాధారణ బిల్లుల ఆమోదానికే బొటా బొటీ సంఖ్యాబలం ఉంది. అలాంటిది రాజ్యాంగ సవరణలు చేయాలన్న బీజేపీ అతి ఉత్సాహంతో చేస్తున్న ప్రయత్నాలు అయితే విఫలం అవుతున్నాయి. నిజానికి చూస్తే బీజేపీ 2014 నుంచి 2019 మధ్యలో కంటే 2019 నుంచి 2024 మధ్యలో అనేక రాజ్యాంగ సవరణ బిల్లులు ఆమోదించుకుంది. దానికి కారణం బీజేపీకి సొంతంగా 303 మంది ఎంపీలు ఉండడం. ఇక ఎన్డీయే మిత్రులతో కలుపుకుంటే ఆ నంబర్ 350 దాకా ఉంది. దాంతో సులువుగా రాజ్యాంగ సవరణ బిల్లులు ఆమోదం పొందాయి. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. అందుకే గడచిన రెండున్నరేళ్ల కాలంలో బీజేపీ రాజ్యాంగ సవరణ బిల్లులు పెద్దగా ఆమోదించినది కూడా లేదని గుర్తు చేస్తున్నారు.

ఒకసారి వీగినా :

ఇక బీజేపీకి డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపైన ఎక్కువ ఆసక్తి ఉంది. ఆ బిల్లులు ఆమోదం పొందాలని చూస్తోంది. ఎందుకంటే ఈ బిల్లులు కనుక ఆమోదం పొందితే దేశ రాజకీయమే ఒక్కసారిగా మారిపోతుంది. అత్యధిక సంఖ్యలో ఎంపీలు వస్తారు. అందులో మూడవ వంతు మహిళలకు రిజర్వ్ అవుతాయి. ఒక్క మాటలో చెప్పాలీ అంటే ప్రస్తుతం ఉన్న ఎంపీ నియోజకవర్గాల స్వరూప స్వభావాలు సమూలంగా మారిపోతాయన్న మాట. ఇక కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఎక్కువ రాష్ట్రాలలో ఎన్డీయే మిత్రులతో కలసి ఉంది. దాంతో కోరుకున్న విధంగా ఈ డీలిమిటేషన్ తో పాటు మహిళా రిజర్వేషన్ సాగుతుంది అని అంటున్నారు. ఈ రకమైన రూపకల్పన బీజేపీకి ఎన్డీయే మిత్రులకు రాజకీయ లాభాన్ని కలిగిస్తాయని విపక్షాలకు గట్టి దెబ్బ తగులుతుందని ప్రతిపక్ష శిబిరం ఆందోళన చెందుతోంది. అందుకే డీలిమిటేషన్ ని అడ్డుకుంటోంది. ఈ ఏడాది ఏప్రిల్ 16, 17 తేదీలలో జరిగిన ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలలో ఈ బిల్లులు ప్రవేశపెడితే ఎన్డీయేకు వచ్చిన ఓట్లు కేవలం 298 మాత్రమే. దాంతో భారీ తేడాతో బిల్లులు వీగిపోయాయి అని గుర్తు చేస్తున్నారు.

నవంబర్ నెలాఖరులో :

అయితే ఇపుడు హస్తిన వర్గాలలో ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం చూస్తే పార్లమెంట్ మరోసారి ప్రత్యేక సమావేశాలను ఎన్డీయే ప్రభుత్వం నిర్వహించనుంది అంటున్నారు. శీతాకాల సమావేశాలు డిసెంబర్ లో జరుగుతాయి. దాని కంటే ముందే ఈ సమావేశాలను నిర్వహించి డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను ఆమోదించుకోవాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉందని అంటున్నారు. అంతే కాదు ఈసారి పక్కాగా బిల్లులు ఆమోదం పొందుతాయని కూడా భావిస్తోంది అంటున్నారు. పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజారిటీ ఈ రెండు కీలక బిల్లులకు అవసరం. అయితే దానిని సునాయాసంగా సాధిస్తామని బీజేపీ ధీమా పడుతోంది. మరి దాని వెనక వ్యూహాలు ఏమిటి అన్నది ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చగా ఉంది.

ఆ పార్టీలే కీలకం :

బీజేపీ ధీమా వెనక కొన్ని కీలక పార్టీలతో పాటు చిన్న పార్టీలు తటస్థ పార్టీలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే ఉద్ధవ్ థాక్రే శివసేన నుంచి ఆరుగురుని షిండే శివసేన వైపుగా తీసుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఇరవై మందికి తీసుకున్నారు. ఈ నంబర్ చూస్తే ఎన్డీయే బలం 224 దాకా పెరిగింది అని అంటున్నారు. అంతే కాదు శరద్ పవార్ ఎన్సీపీ ఎంపీలు ఎనిమిది మందికి కూడా బిల్లుకు అనుకూలం చేసుకోవాలని, ఉద్ధవ్ శివసేనతో సంప్రదింపుల ద్వారా వారికి ఉన్న మరో ఆరుగురు ఎంపీల ఓటు తీసుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. 22 మంది ఎంపీలు ఉన్న డీఎంకే బలం కూడా ఇపుడు కీలకంగా ఉంది. వారిని కూడా తమ వైపుగా తిప్పుకుంటే మూడింట రెండొంతుల మెజారిటీ రావడం ఖాయమని బీజేపీ పెద్దలు నమ్మకంగా ఉన్నారని అంటున్నారు. ఇక్కడే కొంత మతలబు కూడా ఉంది. కొన్ని పార్టీలు బిల్లుకు మద్దతు నేరుగా ఇవ్వకపోవచ్చు. అవి వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోతే అక్కడికి విపక్ష బలం తగ్గిపోయి మూడింట రెండొంతుల మెజారిటీలో నంబర్ మరింతగా తగ్గుతుంది. అలా కూడా బిల్లులు ఆమోదం పొందుతాయని బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది అని అంటున్నారు.