Begin typing your search above and press return to search.

కమలం కాలు దువ్వినట్లేనా ?!

అదే సమయంలో ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఖర్గే ర్యాలీ చేసిన వేదికపై ఆయన వెళ్లిన తర్వాత దానిని శుద్ది చేశారు.

By:  Tupaki Political Desk   |   2 Sept 2026 6:00 PM IST
కమలం కాలు దువ్వినట్లేనా ?!
X

బీహార్ లో పేపర్ లీకేజీలు, నియామకాల్లో అవకతవకలపై నిరసన తెలిపిన విద్యార్థుల మీద లాఠీఛార్జ్, టియర్ గ్యాసులు ప్రయోగించడం, అరెస్టులు చేయడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించి ఇది విద్యార్థుల భవిష్యత్తుపై, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని ఆరోపించింది. అదే సమయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ ‘బీహార్ లో ఏకె 47 ఆటంకవాది మీద కాదు విద్యార్థి మీద ప్రయోగించారు. విద్యార్థులను హింసించారు. జైలుకు పంపించారు. దీనికి హోంమంత్రి అమిత్ షా జవాబుదారీగా ఉండాలి. లేకుంటే ప్రజలు వారిని ఒకరోజు బయటకు లాగి జవాబు అడుగుతారు’ అని హెచ్చరించారు.

అదే సమయంలో ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఖర్గే ర్యాలీ చేసిన వేదికపై ఆయన వెళ్లిన తర్వాత దానిని శుద్ది చేశారు. దీనిని దళిత వ్యతిరేక చర్యగా కాంగ్రెస్ అభివర్ణించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్దకు వెళ్లిన యువజన కాంగ్రెస్ నిరసన తెలిపి, కార్యాలయం మీద నల్లరంగు చల్లింది. దీంతో రెండు పార్టీల మధ్య వివాదం మొదలయింది.

బీజేపీ కార్యాలయం మీద యువజన కాంగ్రెస్ పార్టీ దాడికి నిరసనగా నల్లగొండ జిల్లా కేంద్రంలో పార్టీ జిల్లా అద్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు క్యాంపు కార్యాలయం మీద టమాటాలు, కోడిగుడ్లు విసిరి, మంత్రి ఫ్లెక్సీని తగులబెట్టారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ జిల్లా కార్యాలయం, పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి ఫర్నీచర్, టీవీ, ఫ్రిజ్ లను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ లు జరిపి అరెస్టులు చేశారు.

ఆ తరువాత ఈ గొడవ యాదాద్రి భువనగిరికి మళ్లింది. అక్కడ బీజేవైఎం కార్యకర్తలు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ క్యాంపు కార్యాలయం మీద దాడిచేసి, ఫర్నీచర్ ధ్వంసం చేసి, ఎమ్మెల్యే ఫ్లెక్సీల మీద ఆయిల్, నల్లరంగు చల్లారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయం మీద దాడికి దిగడంతో రెండు చోట్లా పోలీసులు లాఠీచార్జ్ జరిపారు.

నల్లగొండలో పార్టీ అధ్యక్షుడి ఇంటి మీద దాడి నేపథ్యంలో పరామర్శించేందుకు బయలుదేరిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఇది ప్రజాస్వామ్యం మీద దాడి అని అన్నారు. మరోవైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దీనిపై స్పందిస్తూ ‘దాడులు చేసే వారిని కాపాడుతూ, పరామర్శకు వెల్తున్న వారిని అరెస్ట్ చేయడమేనా ఇందిరమ్మ రాజ్యం’ అని ప్రశ్నించారు.

మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీనిపై స్పందిస్తూ కాంగ్రెస్ గూండాయిజం మీద విచారణ జరపాలని, సీసీటీవీ పుటేజీలు పరిశీలించి నిందితుల మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డీజీపీకి మెమోరాండం అందించారు. వరసగా రెండు రోజుల దాడుల నేపథ్యంలో జాతీయ బీజేపీ అధ్యక్షుడు నితన్ నబీన్ స్పందించారు.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుకు ఫోన్ చేసి విషయాలు తెలుసుకున్నారు. ‘కాంగ్రెస్ గూండాలు దాడి చేస్తే అధికార యంత్రాంగం మౌనం వహిస్తుంది. బీజేపీ నేతలు బాధితులను కలవాలంటే అరెస్టు చేస్తారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం గురించి చెప్పడం హస్యాస్పదం. తెలంగాణ రాహుల్ గాంధీ నియంత మనస్తత్వానికి జవాబు చెబుతుంది’ అని ఎక్స్ ఖాతాలో స్పందించారు.

రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీజేపీ మెతక వైఖరి అవలంభిస్తుందని జరుగుతున్న చర్చ నేపథ్యంలో తాజా దాడులు, ప్రతి దాడులు చర్చానీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ విషయంలో ఇక కమలం పార్టీ జూలు విదిల్చి కాలు దువ్వినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే నిరసనలు హింసాత్మకం కాకూడదని, ప్రజాస్వామ్యబద్దంగా నిరసనలు జరిగితేనే ప్రజల నుండి ఆదరణ ఉంటుందని అంటున్నారు. మరి ఈ దాడులు ఎక్కడి వరకు వెళతాయి ? ఎక్కడ ముగుస్తాయి ? అనే దానికి కాలమే సమాధానం చెబుతుంది.