బీఆర్ఎస్, కాంగ్రెస్ వారు సరే.. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎవరో?
తెలంగాణలో సరిగ్గా రెండేళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తున్నాం అంటూ రాష్ట్ర బీజేపీ నాయకులు గట్టి ధీమా వ్యక్తం చేశారు.
By: Tupaki Political Desk | 6 Oct 2025 5:30 PM ISTతెలంగాణలో సరిగ్గా రెండేళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తున్నాం అంటూ రాష్ట్ర బీజేపీ నాయకులు గట్టి ధీమా వ్యక్తం చేశారు. వాస్తవానికి అంతకుముందు 2018-23 మధ్య బీఆర్ఎస్ ప్రభుత్వంలో పరిస్థితులు అలాగే ఉన్నాయి. ప్రతిపక్షం కాంగ్రెస్ పుంజుకోలేదు.. దీంతో బీజేపీ ఏమైనా సంచలనాలు నమోదు చేస్తుందా? అనిపించింది ఒక దశలో. కానీ, చివరకు ఆ పార్టీ 8 సీట్లతో సరిపెట్టుకుంది. పలు స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. అయితే, ఆ ఎన్నికలను వదిలేస్తే తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తేదీ (నవంబరు 11) వచ్చింది. ఇది బీఆర్ఎస్ సిటింగ్ స్థానం. అధికార కాంగ్రెస్ గట్టిగా గురిపెట్టింది. ఈ రెండు పార్టీల అభ్యర్థులు దాదాపు ఎవరనేది కూడా తేలిపోయింది. బీఆర్ఎస్ సిటింగ్ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను బరిలో దింపి వారం దాటింది. ఆమె ప్రచారంలోనూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి యువ నాయకుడు నవీన్ యాదవ్ టికెట్ రేసులో ముందున్నారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి పేర్లు సైతం వినిపిస్తున్నా.. నవీన్ యాదవ్ కే టికెట్ ఖాయం అంటున్నారు.
బీజేపీకి ప్రతిష్ఠాత్మకం
తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీకి మూడు విధాలుగా సవాల్. కేంద్ర మంత్రి, మొన్నటివరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయిన కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోనిదే జూబ్లీహిల్స్. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడే. ఇక హైదరాబాద్ కే చెందిన రామచందర్ రావు ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. ఈ మూడు అంశాల ప్రకారం బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై గట్టి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది.
అభ్యర్థిత్వాల పేర్లు ఇవే..
బీఆర్ఎస్ లో ఉప ఎన్నిక టికెట్ కు ఇద్దరి ముగ్గురి పేర్లు వినిపించాయి. కాంగ్రెస్ లోనూ నాలుగైదు పేర్లు బయటకు వచ్చాయి. కానీ, బీజేపీ నుంచి ఎవరూ టికెట్ కోసం హడావుడి చేయలేదు. ఇప్పటికే కాంగ్రెస్ (దాదాపు), బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు కాగా, బీజేపీ నుంచి బుధవారం కాని తేలేలా లేదు. మంగళవారం ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ముగ్గురి పేర్లను కేంద్ర నాయకత్వానికి పంపనున్నట్లు సమాచారం.
-జూబ్లీహిల్స్ బీజేపీ టికెట్ ను జూటూరు కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, గత ఎన్నికల్లో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి ఆశిస్తున్నారు. వీరిలో ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. దీపక్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అండదండలు ఉన్నాయి. కీర్తిరెడ్డికి కూడా కిషన్ రెడ్డి నుంచి మద్దతు ఉందని చెబుతున్నారు. ఈ ముగ్గురిలో ఒకరికి టికెట్ ఖాయం అంటున్నారు. దీపక్ రెడ్డి వైపే కాస్త మొగ్గు కనిపిస్తోందని కూడా పేర్కొంటున్నారు.
