Begin typing your search above and press return to search.

హిందువులను కుక్కల కంటే హీనంగా చూస్తున్నారు : చీకోటి ప్రవీణ్ సంచలన కామెంట్స్

ఈ సందర్భంగా హిందువులకు చీకోటి ప్రవీణ్ కొన్ని కీలక సూచనలు చేశారు. హిందువులు ఐక్యంగా లేకపోతే అణచివేతకు గురవుతారని, బంగ్లాదేశ్ సంఘటనలే ఇందుకు నిదర్శనమని అన్నారు.

By:  A.N.Kumar   |   3 Jan 2026 6:50 PM IST
హిందువులను కుక్కల కంటే హీనంగా చూస్తున్నారు : చీకోటి ప్రవీణ్ సంచలన కామెంట్స్
X

బంగ్లాదేశ్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై జరుగుతున్న అకృత్యాల పట్ల బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితులను ప్రస్తావిస్తూ హిందూ సమాజం మేల్కోవాల్సిన సమయం వచ్చిందని ఆయన హెచ్చరించారు.

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అత్యంత బలహీనమైనదని.. అది అస్థిర ప్రభుత్వం అని చీకోటి ప్రవీణ్ అభివర్ణించారు. మైనార్టీలైన హిందువులను రక్షించడంలో అక్కడి యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం కూడా హిందువులకు వ్యతిరేకంగా మారుతోందని, అందుకే అక్కడ హత్యలు, దాడులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని ఆయన ఆరోపించారు.

ఐక్యతే ఆయుధం కావాలి

ఈ సందర్భంగా హిందువులకు చీకోటి ప్రవీణ్ కొన్ని కీలక సూచనలు చేశారు. హిందువులు ఐక్యంగా లేకపోతే అణచివేతకు గురవుతారని, బంగ్లాదేశ్ సంఘటనలే ఇందుకు నిదర్శనమని అన్నారు. అక్కడ హిందువులు ప్రాణాలను కాపాడుకోవాలంటే పోరాటం చేయడం తప్ప మరో మార్గం లేదని ఆయన పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను చూసి భారత్‌లోని హిందువులు పాఠాలు నేర్చుకోవాలని, ఇక్కడ కూడా ఐక్యత లోపిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.

కశ్మీర్ పరిస్థితులపై ఆందోళన

బంగ్లాదేశ్‌తో పాటు కశ్మీర్‌లో జరుగుతున్న పరిణామాలను కూడా ఆయన ప్రస్తావించారు. కశ్మీర్‌లో మతం అడిగి మరీ హిందూ పర్యాటకులపై దాడులు చేస్తున్నారని, ఇది హిందూ సమాజానికి ఎంత ప్రమాదకరమో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని కోరారు. "హిందువులు హిందువుల కోసమే పనిచేయాలి. హిందుత్వాన్ని గౌరవించే, సపోర్టు చేసే ప్రభుత్వాలకే అండగా నిలబడాలి." అని చీకోటి ప్రవీణ్ అన్నారు.

హిందూ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవడానికి రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకం కావాలని చీకోటి ప్రవీణ్ అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్ హిందువుల రక్షణ కోసం అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి పెరగాల్సిన అవసరం ఉందని ఆయన తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు.

ఒకప్పుడు యుద్దం అంటే బాంబులు దాడులు, మిస్సైల్స్ కావు.. ఇప్పుడు రకరకాల యుద్ధాలు ఉంటాయి.. ‘రైజిన్’ అనే విషం వాటర్ లో కలిపి హిందువులను వేల సంఖ్యలో చంపాలని ఇటీవల ఒక ఉగ్రవాది కుట్ర చేశాడని.. కేంద్ర ప్రభుత్వం భద్రతా బలగాలు ఏజెన్సీలు తిప్పికొట్టాయని..ఇలాంటి కుట్రలు చాలా జరుగుతున్నాయని చీకోటి ప్రవీణ్ ఆరోపించారు.

మన చుట్టూ శత్రుదేశాలకే ఉన్నాయని.. పాకిస్తాన్, చైనా , టర్కీ లాంటి దేశాలు మన దేశంలో గందరగోళం మారణహోమం సృష్టించాలని చూస్తున్నాయని చీకోటి సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రంలో మోడీ ఉండొద్దని.. బీజేపీ ఉంటే వారి ఆటలు సాగవని ఎత్తులు వేస్తున్నారని.. బీజేపీని ఓడగొట్టాలని ప్రయత్నిస్తున్నారని.. అన్నింటికి హిందువుల ఐక్యతనే ముఖ్యం అని చీకోటి అన్నారు.

బీజేపీ పాలనలోనే హిందువులు, ముస్లింలు కూడా ప్రశాంతంగా ఉన్నారని.. ఎంఐఎం లాంటి తీవ్రంగా స్పందించే పార్టీలకే దేశంలో నష్టం అని స్పష్టం చేశారు. దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారినే బీజేపీ ఏరివేస్తుందని చీకోటి స్పష్టం చేశారు. 60-70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశానికి సెక్యూలరిజం అని చెప్పి హిందువులకు అన్యాయం చేసిందని.. బీజేపీ వచ్చాకనే హిందువులకు న్యాయం జరిగిందని చీకోటి ప్రవీణ్ స్పష్టం చేశారు.