'రేవంత్ రాజీనామా చేయాలి'.. ఎవరి డిమాండ్ అంటే!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్లు బీజేపీ, బీఆర్ ఎస్‌ల నుంచి జోరుగా వినిపిస్తున్నాయి.
By: Garuda Media | 27 July 2026 9:28 PM ISTతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్లు బీజేపీ, బీఆర్ ఎస్‌ల నుంచి జోరుగా వినిపిస్తున్నాయి. ఈ రెండు పార్టీల కీలక నాయకులు సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన దేశవ్యాప్త నిరసనల నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ డిమాండ్‌ను తాము కూడా చేశామంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అంతే కాదు.. విద్యార్థులకు తాము అండగా ఉంటామని తెలిపారు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో పదో తరగతి ప్రశ్న పత్రం లీకేజీ అయిందని.. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని.. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా ప్రశ్నించారు. పదోతరగతి ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలన్నారు. బీఆర్ఎస్ హయాంలోనూ విద్యార్థులు అగచాట్లు పడ్డారని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో విద్యా వ్యవస్థ దారుణంగా ఉందని ఆరోపించారు. విద్యార్థులకు భరోసా ఇవ్వడంలోనూ...పరీక్షలను పారదర్శకంగా నిర్వహించ డంలోనూ రేవంత్ రెడ్డి సర్కారు విఫలమైందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రాజీనామా చేయాలన్నారు.
ఇక, బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ సైతం.. సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన హైడ్రా వ్యవస్థ దారుణంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. నేరుగా హైకోర్టే ఈ వ్యవస్థపై నిప్పులు చెరిగిందన్నారు. హైడ్రా కమిషనర్‌ను సైతం తక్షణమే మార్చాలని ఆదేశించిందని.. దీంతో సీఎం విఫలమైనట్టేనని ఆయన పేర్కొన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. హైడ్రాతో ఎవరికి మేలు జరిగిందో.. అందరికీ తెలిసిందేనన్నారు. పేదలు, మధ్యతరగతి వర్గాల వారిని క్షోభ పెట్టారని, వారి గూడును తొలగించారని విమర్శించారు.
