బంకీపూర్ లో బీజేపీ సెల్ఫ్ గోల్.. ఈ తప్పులతోనే ఓటమి!
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్ ప్రాతినిధ్యం వహించిన బిహార్ లోని బంకీపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమిని ఎదుర్కొవడం హాట్ టాపిక్ అవుతోంది.
By: Tupaki Political Desk | 4 Aug 2026 7:00 PM ISTబీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్ ప్రాతినిధ్యం వహించిన బిహార్ లోని బంకీపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమిని ఎదుర్కొవడం హాట్ టాపిక్ అవుతోంది. గత ఏడాది నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ నుంచి నితీన్ నబీన్ సుమారు 50 వేల ఓట్ల ఆధిక్యంతో గెలవగా, కేవలం 10 నెలల వ్యవధిలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి నీరజ్ సిన్హా ఘోర పరాజయం పాలవడంపై విస్తృత చర్చ జరుగుతోంది. వరుసగా ఐదు ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గెలిచిన బీజేపీ తాజా ఉప ఎన్నికలలో బోల్తా పడటానికి కారణాలు ఏంటి? అన్న అంశంపై తీవ్ర తర్జనభర్జన కొనసాగుతోంది. ఇక బిహార్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన 4 నెలలకే చేదు ఫలితం మూటగట్టుకోవడాన్ని పార్టీ అగ్ర నాయకత్వం జీర్ణించుకోలేకపోతోందని అంటున్నారు.
బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గెలుపుకంటే బీజేపీ ఓటమే ఎక్కువ చర్చగా మారింది. పట్నా నగరానికి గుండెకాయ వంటి బంకీపూర్ నియోజకవర్గం గత 30 ఏళ్లుగా కాషాయ కోటగా ఉండగా, ఎన్నికల ప్రకటన విడుదలైన తర్వాత నియోజకవర్గంలో అడుగుపెట్టిన ప్రశాంత్ కిషోర్ సునాయాశంగా గెలవడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పది నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కనీసం ఒకచోట కూడా డిపాజిట్ తెచ్చుకోని జనసురాజ్ పార్టీ ఇప్పుడు మిగిలిన ప్రధాన పార్టీలను వెనక్కి నెట్టి విజేతగా ఆవిర్భవించడం విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ గెలుపునకు బీజేపీ వైఫల్యమే ఎక్కువ కారణమని విశ్లేషిస్తున్నారు.
బంకీపూర్ లో బీజేపీ ఓటమికి దారి తీసిన కారణాలపై పరిశీలకుల విశ్లేషణలు ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యంగా సునాయాశంగా గెలిచేస్తామన్న బీజేపీ ధీమానే దారుణ ఓటమికి దారితీసిందని వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి ఉదాహరణగా పోలింగ్ సరళిని చూపుతున్నారు. జూలై 30న జరిగిన పోలింగులో కేవలం 34.30 శాత్రమే ఓటింగ్ జరగడం బీజేపీ ఓటమికి ప్రధాన కారణంగా విశ్లేషిస్తున్నారు. కేవలం పది నెలల వ్యవధిలో జరిగిన ఉప ఎన్నికపై ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడం, బలమైన ఓటు బ్యాంకు ఉన్న బీజేపీ ఎలాగైనా గెలిచేస్తామన్న ధీమాలో పడిపోవడంతోనే అత్యల్ప ఓటింగ్ నమోదైందని అంటున్నారు. బీజేపీ కేడర్ బలంగా పనిచేసి ఓటర్లను పోలింగ్ కేంద్రం వరకు తీసుకువచ్చి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదని అభిప్రాయపడుతున్నారు.
అంతేకాకుండా బంకీపూర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాగానే అభ్యర్థి ఎంపికలో బీజేపీ చేసిన పొరపాట్లు కూడా ఓటమికి దారితీశాయని అంటున్నారు. ముందుగా అభిషేక్ మిశ్రాను అభ్యర్థిగా ప్రకటించారని, ఆ తర్వాత ఆయన కుటుంబంపై అవినీతి ఆరోపణలు ఉన్నాయనే కారణంగా కేవలం 30 గంటల వ్యవధిలో నీరజ్ కుమార్ సిన్హాను బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించారని అంటున్నారు. ఈ అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీని దెబ్బతీశారని అంటున్నారు.
ఇక ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు కూడా ఓటర్ల ఆగ్రహానికి గురిచేశాయంటున్నారు. బంకీపూర్ లో తాము కుక్కను నిలిపినా జనం ఓట్లేస్తారన్నట్లు బీజేపీ నేతలు ప్రచారం చేశారని, దీంతో ఓటర్లు మనస్థాపానికి గురయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటివరకు తాము నితీన్ నబీన్ ఆయన తండ్రి నవిన్ కిషోర్ ప్రసాద్ సిన్హాను చూసి ఓట్లేశామని, కానీ ఇప్పుడు బీజేపీ నేతలు మాత్రం ఓటర్లను చిన్నచూపు చేసేలా ప్రచారం చేశారని స్థానికులు మండిపడుతున్నారని అంటున్నారు. అందుకే ప్రత్యామ్నాయం ఉంటే ఓటర్లు తీర్పు మారుతుందనే సంకేతాలు ఇచ్చేలా ప్రశాంత్ కిషోర్ కు బాసటగా నిలిచారని విశ్లేషిస్తున్నారు.
మరోవైపు ఢిల్లీలో జరిగిన జెన్-జీ ఆందోళనలు, నీట్ పేపరు లీకేజీ, 12వ తరగతి మూల్యాంకనంలో లోపాలు, అయోధ్య రామమందిరం విరాళాల మాయం వంటి పరిణామాలు కూడా బీజేపీపై తీవ్ర ప్రభావం చూపాయని అంటున్నారు. ఎన్నికల సమయంలో ఆయా అంశాలను ప్రజల మధ్యకు తీసుకువెళ్లడంలో జనసురాజ్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ కిషోర్ సక్సెస్ అయ్యారని అంటున్నారు. ఇలా కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు బంకీపూర్ లో బీజేపీ ఓటమికి అనేక పరిణామాలు దారితీశాయని విశ్లేషిస్తున్నారు.
