ఏపీ బీజేపీ కి కొత్త నేతలు.. మార్పు వస్తుందా.. ?
ఏపీలో కూటమి ప్రభుత్వ భాగస్వామ్య పక్షంగా ఉన్న బీజేపీ.. కీలక మార్పులు చేసింది.
By: Garuda Media | 26 Sept 2026 8:00 AM ISTఏపీలో కూటమి ప్రభుత్వ భాగస్వామ్య పక్షంగా ఉన్న బీజేపీ.. కీలక మార్పులు చేసింది. పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలక మార్పులు చేస్తూ.. ఏపీకి కొత్త ఇంచార్జ్‌లను నియమించింది. అలానే కో-ఇన్‌చార్జిలను నియమించింది. ఏపీ బీజేపీ ఇన్‌చార్జిగా మధ్యప్రదేశ్‌కు చెందిన మాజీ మంత్రి అరవింద్ భదౌరియాను, కో-ఇన్‌చార్జిగా తమిళనాడుకు చెందిన వనతి శ్రీనివాసన్‌ను పార్టీ అధిష్ఠానం నియమించింది. తద్వారా పార్టీ విషయంలో అధిష్టానం కీలక అడుగు లు వేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అన్నట్టుగా పార్టీ వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఏం చేస్తారు.. ?
పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ఆది నుంచి బీజేపీవ్యూహాత్మకంగా అడుగులు వేసింది. సామాజిక వర్గాలను ప్రాతిపదికగా తీసుకుని రాష్ట్ర ఇంచార్జ్ నియామకాలు కూడా చేసింది. అయితే.. ఇప్పుడు అధికారంలో ఉన్న నేపథ్యంలో దీనిని మరింత దూకుడుగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయనుంది. అరవింద్ విషయానికి వస్తే.. మధ్య ప్రదేశ్‌కు చెందిన ఆయన.. పార్టీని అక్కడ బలోపేతం చేయడంతోపాటు.. బలమైన కాంగ్రెస్‌పార్టీకి దీటుగా బీజేపీని మలిచారు. తద్వారా అధికారంలోకి తీసుకురాగలిగారు.
ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ సంస్థాగత నాయకత్వం నుంచి వచ్చిన అరవింద్‌కు క్షేత్రస్థాయి రాజకీయాలు, కేడర్‌ను ఎలా నడిపించాలి? రాజకీయంగా ఎలాంటివ్యూహాలు వేయాలి.. అనే విషయాలపై గట్టి పట్టుంది. ఇవి మధ్యప్రదేశ్ బీజేపీకి బాగా కలిసివచ్చాయి. ముఖ్యంగా హిందూత్వ వాదనను బలంగా అమలు చేయడంలో ఆయన పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏపీలోనూ హిందూత్వ ఓటు బ్యాంకును ఒడిసి పట్టుకుని.. తద్వారా బీజేపీని బలోపేతం చేసేందుకు అరవింద్ కృషి చేసే అవకాశం ఉంది. పైగా.. రాష్ట్ర బీజేపీలో పెద్దగా విభేదాలు లేని నేపథ్యంలో ఆయన దూసుకుపోవడం కూడా ఖాయంగానే కనిపిస్తోంది.
వనతి శ్రీనివాసన్.. తమిళనాడుకు చెందిన నాయకురాలు. మాజీ ఎమ్మెల్యే కూడా. తమిళ నాట మహిళా ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. ఏపీలోనూ.. ఇదే తరహా రాజకీయాలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నట్టుగా ఏపీలో బీజేపీకి మహిళా ప్రాతినిధ్యం లేదు. ఒకరిద్దరు నాయకులు ఉన్నా.. వారు సైలెంట్ అయ్యారు. ఈ నేపథ్యంలో వనతి శ్రీనివాసన్ ప్రధానంగా మహిళా ఓటు బ్యాంకును ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యం.. గ్రామీణ రాజకీయాలపై పట్టున్న వనతి.. ఏపీలోనూ గ్రామీణ రాజకీయాలపై బీజేపీ ముద్రవేసే అవకాశం ఉంది. ఏదేమైనా బీజేపీలో జరిగిన ఈ మార్పులు ఏపీలో పార్టీకి ఏమేరకు దోహదపడతాయన్నది చూడాలి.
