Begin typing your search above and press return to search.

పంజాబ్ : అకాలీదళ్ బాటలో బీజేపీ

పంజాబ్ శాసనసభకు 2027 ఫిబ్రవరి నాటికి ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుత శాసనసభ పదవీకాలం మార్చి 2027తో ముగియనుంది.

By:  Garuda Media   |   31 Aug 2026 1:00 PM IST
పంజాబ్ : అకాలీదళ్ బాటలో బీజేపీ
X

పంజాబ్ శాసనసభకు 2027 ఫిబ్రవరి నాటికి ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుత శాసనసభ పదవీకాలం మార్చి 2027తో ముగియనుంది. ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాలలో సర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా సవరణ, నమోదు కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ ఆగస్టులో, తుది జాబితా ఆక్టోబరు 12న పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో నవంబరు లేదా డిసెంబరులో పంజాబ్ ఎన్నికలు నిర్వహిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

పంజాబ్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, శిరోమణి అకాళీదళ్ పార్టీలు ఏకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 117 శాసనసభ స్థానాలు ఉన్న పంజాబ్ లో గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 92, కాంగ్రెస్ 18, అకాళీదల్ 3, బీజేపీ 2 స్థానాలు గెలుచుకున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 18.56 వాతం, అకాళీదల్ 13.42 శాతం ఓట్లు సాధించాయి. అకాళీదల్ తో బీజేపీకి 1950 - 60 జనసంఘ్ కాలం నుండి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

1967, 1977లలో ఈ రెండు పార్టీలు కూటములుగా నిలబడి పోటీ చేసారు. 1996 నుండి 2020 వరకు 24 ఏళ్ల పాటు ఇది పంజాబ్ లో బలమయిన కూటమిగా నిలిచింది. అకాళీదల్ గ్రామీణ సిక్కు ఓట్లను ఆకర్షిస్తే, బీజేపీ పట్టణ ప్రాంత హిందూ ఓట్లను ఆకర్షించేది. సాధారణంగా అకాళీదల్ 94, బీజేపీ 23 స్థానాలలో పోటీ చేసేది.

2020లో కేంద్రం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన రైతు సంఘాలకు మద్దతుగా అకాళీదల్ ఎన్డీఏ నుండి బయటకు వచ్చింది. ఆ తర్వాత కేంద్రం రైతుల ఆందోళనలకు తలవంచి రైతు చట్టాలను ఉపసంహరించుకున్నప్పటికీ బీజేపీ - అకాళీదల్ మధ్య సంబంధాలు మెరుగుపడలేదు.

కొన్ని రోజలు క్రితం సుఖ్ బీర్ సింగ్ బాదల్ ప్రధానమంత్రి మోదీని కలిసిన నేపథ్యంలో రెండు పార్టీలు తిరిగి జతకడతాయన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ మేరకు అంతర్గత చర్చలు జరుగుతున్నాయి అనేందుకు అకాళీదల్ నేతలు కూటమికి అనుకూలంగా మాట్లాడుతున్న మాటలు బలం చేకూరుస్తున్నాయి. అయితే తాము ఒంటరిగా 117 స్థానాలలో పోటీ చేస్తామని బీజేపీ చెబుతున్నా, పొత్తు కుదిరితే అత్యధిక స్థానాలు బీజేపీకి కేటాయించాలని, తామే పెద్దన్న పాత్ర పోషిస్తామని పట్టుబడుతున్నట్లు తెలుస్తుంది.

ఐదేళ్ల ఆప్ ప్రభుత్వం ప్రస్తుతం యాంటీ ఇంకంబెన్సీ ఎదుర్కొంటున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ, అకాళీదల్ ఎదురుదాడికి దిగుతున్నాయి. రైతు సమస్యలు, మాదకద్రవ్యాలు, అభివృద్ధి వంటి అంశాలు చర్చకు వస్తున్నాయి. అయితే ఈ ఏడాది మేలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ 1997 వార్డులకు గాను 958 స్థానాలలో విజయం సాధించింది. తాజా సర్వేలలో ఆప్ 34 శాతం, కాంగ్రెస్ 30.2 శాతం ఓట్లను సాధిస్తాయని వెల్లడయింది. సీఎం అభ్యర్థిగా ప్రస్తుతం భగవంత్ సింగ్ మాన్ 40 శాతం ఆదరణ లబించింది. అయితే ఇక్కడ బీజేపీ, అకాళీదల్ కూటమి ఖాయం అయితే ఫలితాలు మారే అవకాశం ఉంది.