అన్నాడీఎంకేకు ‘షా’క్.. అమ్మ గుర్తొచ్చేలా చేశారు.
అందుకని సీట్ల సర్దుబాటును త్వరగా తేల్చాలంటూ ఢిల్లీ వెళ్లిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, తమిళనాడు మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామిని నిరీక్షింపజేశారు.
By: Tupaki Political Desk | 21 March 2026 1:00 AM ISTతమిళనాడులో రెండు కూటముల మధ్య మహా సమరం జరుగుతోంది. తమకు కంట్లో నలుసులా మారిన సీఎం స్టాలిన్ ను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాలని బీజేపీ పెద్దలు కంకణం కట్టుకున్నారు. దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్న అన్నాడీఎంకేతో పొత్తును కొనసాగిస్తూ ఈసారి కూడా కలిసి బరిలో దిగుతోంది. మరోవైపు కొత్త పార్టీ సినీ నటుడు విజయ్ కు చెందిన టీవీకేతోనూ బేరాలు సాగిస్తోంది. అయితే, మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనుండగా ప్రధాన భాగస్వామ్య పక్షమైన అన్నాడీఎంకేకు బీజేపీ కీలక నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చుక్కలు చూపించారు. వచ్చే నెల 23న జరిగే ఎన్నికలకు మరెంతో సమయం లేదు. అందుకని సీట్ల సర్దుబాటును త్వరగా తేల్చాలంటూ ఢిల్లీ వెళ్లిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, తమిళనాడు మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామిని నిరీక్షింపజేశారు.
తమిళనాడు టార్గెట్
దక్షిణాదిన కర్ణాటకలో సొంతంగా, ఏపీలో కూటమి రూపంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ తెలంగాణపైన ఎప్పటినుంచో ఆశలు పెట్టుకుంది. తమిళనాడు మీద మాత్రం పట్టు సాధించలేకపోతోంది. ఈసారి మాత్రం అన్నాడీఎంకేతో కలిసి అధికారం కొల్లగొట్టాలని చూస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో దారుణ ఫలితాలు వచ్చినా సరే.. ఆ పార్టీతోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తోంది. అయితే, బీజేపీ తన బలానికి మించి తమిళనాడులో సీట్లు అడుగుతోందనే మిత్రపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి.
ఎడప్పాడి.. ఎంత పనైంది?
సీట్ల సర్దుబాటు కోసం ఢిల్లీ వెళ్లిన పళనిస్వామిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండు గంటల పాటు నిరీక్షింపజేశారు. కేంద్ర హోం మంత్రి కాబట్టి తీరిక లేని పని కారణంగా ఇలా జరిగిందా? అదేమో కానీ.. షా మాత్రం రాత్రి 10 గంటల తర్వాతనే పళనిస్వామితో భేటీ అయ్యారట. వీరిమధ్య పలు అంశాలపై చర్చలు జరిగాయని.. ముఖ్యంగా కొన్ని సీట్ల విషయంలో నెలకొన్న ప్రతిష్ఠంభనను తొలగించే ప్రయత్నం జరిగిందని అంటున్నారు. బీజేపీ 30 అసెంబ్లీ సీట్లు కోరుతుండగా, అన్నాడీఎంకే 29 ఇస్తామంటోంది. ఇంతకూ రెండు గంటలు వేచి ఉన్న పళనిస్వామికి షా ఇచ్చిన టైం ఎంతో తెలుసా? కేవలం 15 నుంచి 20 నిమిషాలేనట. తమిళనాడుతో పాటు మిగతా నాలుగు రాష్ట్రాల ఎన్నికల వ్యూహాల్లో షా బిజీగా ఉన్నారు. అందుకే, సమయం పట్టి ఉండొచ్చని కొందరు చెబుతున్నారు. మొత్తానికి పళనిస్వామికి వారి పార్టీ అధినేత్రి, దివంగత సీఎం జయలలిత గుర్తుకొచ్చేలా చేశారు.
