Begin typing your search above and press return to search.

బీజేపీకి ప్రాణ సంకటం....విపక్షాలకు చెలగాటం

ప్రస్తుతం లోక్ సభలో 543 మంది ఎంపీలు ఉన్నారు. డీ లిమిటేషన్ బిల్లు కనుక ఆమోదం పొందితే ఆ సంఖ్య అమాంతం 850 దాకా పెరుగుతుంది.

By:  Satya P   |   28 July 2026 12:41 PM IST
బీజేపీకి  ప్రాణ సంకటం....విపక్షాలకు చెలగాటం
X

కేంద్రంలో బీజేపీకి ఇపుడు రెండు బిల్లులే శ్రీరామ రక్షగా మారనున్నాయని అంటున్నారు. అందులో ఒకటి డీ లిమిటేషన్ బిల్లు అయితే మరొకటి మహిళా రిజర్వేషన్ బిల్లు. ఈ రెండు బిల్లులను పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ ద్వారా నెగ్గించుకుని చట్టంగా తీసుకుని వస్తే కనుక బీజేపీకి 2029 ఎన్నికల్లో ఆశలు సజీవంగా ఉంటాయని కమలనాధులు నమ్ముతున్నారు. అందుకే బీజేపీకి ఈ బిల్లులు ఎంతో కీలకమే కాదు ప్రాణ సమానం అని అంటున్నారు. ఈ బిల్లుల ఆమోదం కోసం బీజేపీ చేయని ప్రయత్నం లేదు, అలాగే మద్దతు కూడగట్టడం కోసం ఎన్ని వ్యూహాలు పన్నాయో అన్నీ పన్నుతోంది.

వర్షాకాల సమావేశాలే కీలకం :

ఇక ఈ బిల్లుల ఆమోదానికి సరైన సమయం వర్షాకాల సమావేశాలు అని బీజేపీ భావిస్తోంది. అందుకే ఆగస్టు 13 దాకా నిర్వహించే ఈ సమావేశాలలోనే బిల్లులను ఆమోద ముద్ర వేయించుకుంటే 2029 నాటికి కావాల్సినంత సమయం ఉంటుందని అపుడు ఈ బిల్లులు చట్టంగా మారితే ఎంతగానో ఉపయోగం జరుగుతుందని భావిస్తోంది. ఇపుడు కాకపోతే మళ్ళీ నవంబర్ డిసెంబర్ లలో జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాలోనే బిల్లులు తేవాల్సి ఉంటుంది. అదే కనుక జరిగితే 2027 వచ్చేస్తుంది. అప్పటికి ఎన్నికలు గట్టిగా రెండేళ్లు ఉంటాయి. దాంతో ఈ బిల్లులు చట్టం అయినా అమలు చేయడానికి అవసరం అయిన సమయం ఉండదని బీజేపీ బెంగపడుతోంది అని అంటున్నారు.

లాభం ఎలా అంటే :

ప్రస్తుతం లోక్ సభలో 543 మంది ఎంపీలు ఉన్నారు. డీ లిమిటేషన్ బిల్లు కనుక ఆమోదం పొందితే ఆ సంఖ్య అమాంతం 850 దాకా పెరుగుతుంది. అంటే మరో మూడు వందల ఎంపీలు అన్న మాట. వీరంతా ఎక్కువగా యూపీ బీహార్ తదితర ఉత్తరాది రాష్ట్రాల నుంచి వస్తారు. అదే బీజేపీకి అడ్వాంటేజ్ కానుంది అని అంటున్నారు. అదే విధంగా చూస్తే కనుక ప్రత్యర్ధుల బలమైన లోక్ సభ నియోజకవర్గాలు పునర్వ్యవస్థీకరణలో రెండుగా చీలిపోతాయని అధికారంలో ఉన్న బీజేపీ లాంటి పార్టీలకే అది అనుకూలంగా ఉంటుందని అంటున్నారు. అదే విధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు కనుక ఆమోదం పొందితే ముప్పై మూడు శాతం సీట్లు వారి పరం అవుతాయి. అంతే ప్రతిపాదిత 850 ఎంపీ సీట్లలో 280 దాకా వారికే దక్కుతాయని అంటున్నారు. ఇక్కడ కూడా బలమైన ప్రత్యర్ధులను గురి చూసి మరీ ఆయా నియోజకవర్గాలను విమెన్ రిజర్వేషన్లుగా మార్చేసే ప్రక్రియ కూడా రాజకీయ వ్యూహంలో భాగంగా జరగవచ్చు అని ప్రచారం సాగుతోంది.

ఆయువు పట్టుగానే :

అందుకే ఈ రెండు బిల్లులు బీజేపీకి ఆయువు పట్టుగా ఉన్నాయి. ఆ సంగతి తెలిసే విపక్షాలు కూడా ఈ బిల్లులు పార్లమెంట్ అనుమతి పొందకుండా చూస్తున్నాయి. పార్లమెంట్ లో ప్రతీ రోజూ రభస సాగుతోంది. గందరగోళం కూడా నెలకొంటోంది. అసలు చర్చలు సాగడం లేదు, దాంతో ఈ వర్షాకాల సమావేశాలు వానార్పణంగా చేస్తే ఇక ఈ బిల్లులు తిరిగి శీతాకాల సమావేశాల దాకా పార్లమెంట్ ముందుకు రావని విపక్షం భావిస్తోంది. అప్పటికి తగిన వ్యూహంతో సిద్ధం అయితే 2029 ఎన్నికలలో డీ లిమిటేషన్ అన్న ప్రసక్తి ఉండదని విపక్షం కొత్త ఆలోచనలు చేస్తోంది. మొత్తం మీద బీజేపీకి ఈ బిల్లులు ప్రాణ సంకటం అయితే విపక్షాలకు చెలగాటంగా ఉందని అంటున్నారు. దాంతో పార్లమెంట్ లో బీజేపీ ఏ వ్యూహం అనుసరించాలో తెలియక సతమతమవుతోంది అని అంటున్నారు.