Begin typing your search above and press return to search.

నదిని శుభ్రం చేశాడు.. విదేశీ ఉద్యోగం పొందాడు.. ఏకంగా నెదర్లాండ్ ఆహ్వానం

సోషల్ మీడియాలో ఫాలోవర్లు, లైక్స్, వ్యూస్ కోసం చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్లు కంటెంట్ చేస్తుంటారు.

By:  A.N.Kumar   |   7 Sept 2026 7:53 AM IST
నదిని శుభ్రం చేశాడు.. విదేశీ ఉద్యోగం పొందాడు.. ఏకంగా నెదర్లాండ్ ఆహ్వానం
X

సోషల్ మీడియాలో ఫాలోవర్లు, లైక్స్, వ్యూస్ కోసం చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్లు కంటెంట్ చేస్తుంటారు. అయితే మధ్యప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల యువ ఇన్‌ఫ్లుయెన్సర్ బిట్టు తబాహీ మాత్రం అందుకు భిన్నంగా నిలిచారు. సోషల్ మీడియాను ఒక మంచి పనికి వేదికగా మార్చుకుని.. నెలల తరబడి కలుషితమైన నదిని శుభ్రం చేశారు. ఎలాంటి ప్రభుత్వ లేదా సంస్థాగత సహాయం కోసం ఎదురుచూడకుండా తన సొంత డబ్బుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పుడు ఆయన చేసిన పనికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా బియోరాకు చెందిన బిట్టు తబాహీ అసలు పేరు సురేంద్ర సింగ్ చౌదరి. ఆయన తన ప్రాంతంలోని తీవ్రంగా కలుషితమైన అజ్నార్ నదిని శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నారు. నదిలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, ఖాళీ బాటిళ్లు, ఆల్గీతో పాటు ఇతర చెత్తను స్వయంగా తొలగించడం ప్రారంభించారు.

ఈ పని అంత సులభంగా సాగలేదు. నదిలోకి స్వయంగా దిగి చెత్తను తొలగించడంతో పాటు శుభ్రత కోసం అవసరమైన ఖర్చులను కూడా తన జేబు నుంచే భరించారు. నెలల తరబడి నిరంతరంగా పనిచేస్తూ నదిలోని పలు ప్రాంతాలను శుభ్రం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

బిట్టు చేసిన పనికి సంబంధించిన ‘ముందు-తర్వాత’ వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. నది శుభ్రం చేయడానికి ముందు, ఆ తర్వాత వచ్చిన మార్పు స్పష్టంగా కనిపించడంతో ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తాయి. కొందరి నుంచి విమర్శలు ఎదురైనా ఆయన మాత్రం తన ప్రయత్నాన్ని ఆపలేదు. ఇప్పటికే బిట్టు సేవలను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ప్రశంసించారు. తాజాగా ఆయన చేసిన సేవలకు మరో అరుదైన గుర్తింపు లభించింది.

ది ఓషన్ క్లీనప్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ బోయన్ స్లాట్ బిట్టు చేసిన నది శుభ్రత కార్యక్రమాన్ని గమనించారు. ఆయన బిట్టుకు తమ సంస్థలో పనిచేసే అవకాశం కల్పిస్తూ ఉద్యోగ ఆఫర్ ఇచ్చారు. అంతేకాకుండా నెదర్లాండ్స్‌కు వచ్చి తమ సంస్థతో కలిసి పనిచేయాలని ఆహ్వానించారు.

ఒక సాధారణ యువకుడు తన చుట్టూ ఉన్న సమస్యను చూసి ఇతరుల కోసం ఎదురుచూడకుండా స్వయంగా పరిష్కరించేందుకు ముందడుగు వేస్తే ఎలాంటి అవకాశాలు వస్తాయో బిట్టు కథ చూపిస్తోంది. సోషల్ మీడియాను కేవలం వినోదం కోసం కాకుండా సామాజిక మార్పు కోసం ఉపయోగిస్తే ప్రపంచస్థాయిలోనూ గుర్తింపు పొందవచ్చని ఆయన ప్రయాణం నిరూపిస్తోంది.

అజ్నార్ నది శుభ్రతతో ప్రారంభమైన బిట్టు తబాహీ ప్రయాణం ఇప్పుడు నెదర్లాండ్స్ వరకు చేరడం.. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న యువతకు స్ఫూర్తిగా మారింది.