Begin typing your search above and press return to search.

ఎందుకు? ఆర్నెల్లలో అంతలా పడిన బిట్ కాయిన్ విలువ!

గత ఏడాది అక్టోబరు ఆరున బిట్ కాయిన్ ధర చరిత్రలో మొదటిసారి 1,26,272 డాలర్లకు నమోదై.. సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

By:  Garuda Media   |   30 March 2026 12:07 PM IST
ఎందుకు? ఆర్నెల్లలో అంతలా పడిన బిట్ కాయిన్ విలువ!
X

గత ఏడాది అక్టోబరు ఆరున బిట్ కాయిన్ ధర చరిత్రలో మొదటిసారి 1,26,272 డాలర్లకు నమోదై.. సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అంటే.. ఆ రోజున ఒక బిట్ కాయిన్ మీ చేతిలో ఉంటే మన రూపాయిల్లో అది రూ.1.19 కోట్లు. లెక్క వేసినప్పుడు ఇప్పటి మారకం విలువతో వేస్తే మరింత పెరుగుతుంది. అయితే.. గత అక్టోబరు నాటి మారకం విలువతో లెక్కిస్తే.. ఇంచుమించు ఈ ధర పలుకుతుంది. లేదంటే.. కాస్త తగ్గొచ్చు. మొత్తంగా అంత భారీగా ఉన్న బిట్ కాయిన్ ధర ఇప్పుడు 66500 డాలర్లకు పడిపోవటం గమనార్హం. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.61.87 లక్షలు. ఎక్కడ కోటి 19 లక్షలు.. ఎక్కడ రూ.61 లక్షలు. ఎందుకింత భారీగా బిట్ కాయిన్ ధర పడిపోయింది? అన్నదిప్పడు ప్రశ్నగా మారింది.

ఈ ప్రశ్నకు రోటీన్ గా వచ్చే సమాధానం పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల వల్లే బిట్ కాయిన్ విలువ హెచ్చుతగ్గులకు లోనవుతుందని చెబుతుంటారు. కానీ.. లోతుల్లోకి వెళ్లినప్పుడు.. అనిశ్చితి పెరిగే కొద్దీ బిట్ కాయిన్ లాంటి వాటిని సురక్షిత మదుపుగా భావిస్తారు. అలాంటప్పుడు ధర పెరగాలే కానీ.. తగ్గకూడదు. కానీ.. ఇక్కడ పరిస్థితి రివర్సులో ఉండటానికి కారణం.. బయటకు రాని ఆసక్తికర అంశాలుగా చెప్పాలి. కొన్ని పరిణామాలు పెద్దగా ప్రచారంలోకి రావు. కానీ.. వాటి ప్రభావం చాలానే ఉంటుంది. ఇప్పుడు బిట్ కాయిన్ విషయంలోనూ అలాంటిదే జరిగాయని చెప్పాలి.

సాధారణంగా బిట్ కాయిన్ విలువలో భారీ మార్పులకు కారణమయ్యే అంశాల్ని చూస్తే.. మార్కెట్ లో భారీగా బిట్ కాయిన్లు కలిగి ఉన్న వ్యక్తులు.. సంస్థలు వాటిని మార్కెట్ లోకి వదిలి.. లిక్విడ్ చేసుకుంటాయి. ధర మరింత పడిన తర్వాత మళ్లీ కొనుగోలు చేసే ట్రేడింగ్ ఒకటి ఉంటుంది. ఇదొకటైతే.. కంప్యూటర్ ప్రోగ్రామ్స్ కూడా దీనికి కారణంగా చెబుతారు. ధర ఒక నిర్ణీత స్థాయి కంటే తగ్గగానే బాట్స్ (కంప్యూటర్ ప్రోగ్రామ్స్) వాటంతట అవే అమ్మకాలు జరుపుతాయి. చైన్ రియాక్షన్ లా మారి ధర వేగంగా పడిపోయి.. కనిష్ఠాలకు చేరుకునే పరిస్థితి. ఇంకొన్ని సందర్భాల్లో ఇన్వెస్టర్లు అప్పు తీసుకొని బిట్ కాయిన్ కొంటారు. ధర కొంచెం తగ్గగానే వారి పొజిషన్లు ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతాయి. ఇలాంటి పరిస్థితి మార్కెట్ లో అనూహ్యమైన అమ్మకాల ఒత్తిడిని క్రియేట్ చేస్తుంది.

ఇవే కాకుండా పెద్ద పెద్ద నిర్వెస్టర్లు.. పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు తీసుకునే నిర్ణయాలు.. సోషల్ మీడియా, వార్తా సంసథల కథనాలతో భయాన్ని క్రియేట్ చేసి తప్పుదోవ పట్టించేలా చేసి.. విలువ పడేలా చేస్తుంటారు. ఇలా అంచనాలకు మించిన అంశాలు బిట్ కాయిన్ విలువ పడేలా చేస్తుంటాయి. మరి.. గడిచిన నాలుగైదు నెలల్లో బిట్ కాయిన్ కు సంబంధించి పెద్దగా ప్రాచుర్యంలోకి రాని పరిణామాలు ఏమైనా చోటు చేసుకున్నాయా? అన్నది చూస్తే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.

ఈ మార్చిలో బిట్ కాయిన్లు కలిగిన పలు మైనింగ సంస్థలు తమ వ్యూహాన్ని మార్చుకోవటం.. అమ్మకాలు జరపటం బిట్ కాయిన్ విలువ తగ్గటానికి కారణంగా చెప్పాలి. ఎంఏఆర్ఏ హోల్డింగ్స్ సంస్థ మార్చి మొదటి వారం నుంచి చివరి వారం మధ్యలో తమ వద్ద ఉన్న బిట్ కాయిన్లలో సుమారు 15,133 బిట్ కాయిన్లను అమ్మేసింది. కోర్ సైంటిఫిక్, బిట డీర్ లాంటి సంస్థలు తమ వద్ద ఉన్న వేలాది బిట్ కాయిన్లను అమ్ముతున్నాయి. ఈ మొత్తాన్ని ఏఐ డేటా సెంటర్ల మీద పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నాయి.

ఈ ఏడాది మార్చిలో భూటాన్ ప్రభుత్వం 84 మిలియన్ల విలువైన బిట్ కాయిన్లను అమ్మటం కూడా మార్కెట్ లో కొత్త తరహా ఆందోళనకు కారణంగా చెప్పాలి. ఫిబ్రవరి మధ్యలో ఒక్క రోజులో మార్కెట్ లోకి బిలియన్ల కొద్దీ బిట్ కాయిన్లు పొజిషన్ లిక్విడేట్ కావటం కూడా ధర పతనానికి కారణంగా చెప్పాలి. మొత్తంగా ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో చోటు చేసుకున్న పలు పరిణామాలు క్రిప్టో ఫియర్ కు కారణమై.. అమ్మకాలకు దిగటంతో రాకెట్ వేగంతో దూసుకెళుతున్న బిట్ కాయిన్లు.. నేల చూపులు చూపుతూ.. సగానికి పైగా విలువ పడిపోయిన పరిస్థితి.