Begin typing your search above and press return to search.

న్యూయార్క్ టైమ్స్ సంచలన కథం.. బిట్ కాయిన్ సృష్టికర్త ఆ దేశం వాడేనని స్పష్ఠం..!

క్రిప్టో కరెన్సీ ప్రపంచంలో ఆడమ్ బ్యాక్ ఒక పరిచయం అక్కర్లేని పేరు. బిట్‌కాయిన్ సృష్టికి పునాది వేసిన అనేక సాంకేతిక అంశాలపై ఆయనకు పట్టు ఉంది.

By:  Tupaki Political Desk   |   9 April 2026 7:00 PM IST
న్యూయార్క్ టైమ్స్ సంచలన కథం.. బిట్ కాయిన్ సృష్టికర్త ఆ దేశం వాడేనని స్పష్ఠం..!
X

చేతిలో ఒక్క కాయిన్ కూడా ఉండదు.. కానీ దాని విలువ మాత్రం కోట్లలో ఉంటుంది! ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన బిట్‌కాయిన్ వెనుక ఉన్న ఆ మెదడు ఎవరిది? 'సటోషీ నకమోటో' అనే పేరు వెనుక దాగున్న అసలు వ్యక్తి ఎవరు? పదేళ్లుగా టెక్ మేధావులు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు వేటాడుతున్నా చిక్కని ఆ రహస్యం.. ఇప్పుడు 'న్యూయార్క్ టైమ్స్' కథనంతో సరికొత్త మలుపు తిరిగింది. ఒక బ్రిటిష్ క్రిప్టాలజిస్టే ఈ డిజిటల్ విప్లవానికి మూలపురుషుడా? అసలు ఆ అజ్ఞాతం వెనుక ఉన్న భయం ఏంటి? ఆసక్తికరమైన ఈ క్రిప్టో మిస్టరీ లోతులు తెలుసుకుందాం..

ఆడమ్ బ్యాక్.. ఆ ‘సటోషీ’ ఇతడేనా?

క్రిప్టో కరెన్సీ ప్రపంచంలో ఆడమ్ బ్యాక్ ఒక పరిచయం అక్కర్లేని పేరు. బిట్‌కాయిన్ సృష్టికి పునాది వేసిన అనేక సాంకేతిక అంశాలపై ఆయనకు పట్టు ఉంది. తాజాగా న్యూయార్క్ టైమ్స్ వెలువర్చిన కథనాల ప్రకారం.., బిట్‌కాయిన్ తొలినాళ్లలో సటోషీ పంపిన ఈ-మెయిళ్లను పరిశీలిస్తే, అందులో వాడిన పదజాలం, అక్షరక్రమం (బ్రిటిష్ ఇంగ్లిష్) ఆడమ్ బ్యాక్ వాడే శైలికి దగ్గరగా ఉన్నట్లు గుర్తించారు. ఉదాహరణకు 'Favour' వంటి పదాల్లో బ్రిటిష్ స్టైల్ వాడడం ఆయనను ప్రధాన అనుమానితుడిగా నిలబెట్టింది.

కోడ్ వెనుక ఉన్న తెలివితేటలు

సటోషీ నకమోటో 31వేల లైన్ల కోడ్‌తో అత్యంత సంక్లిష్టమైన బిట్‌కాయిన్ వ్యవస్థను సృష్టించాడు. 2008లో విడుదలైన ‘బిట్‌కాయిన్ పీ2పీఈ ఇ-క్యాష్ పేపర్’లో బ్యాక్ పేరు ప్రస్తావనకు రావడం గమనార్హం. ఆ సమయంలో సటోషీ, బ్యాక్ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయని చెబుతున్నప్పటికీ, అది కేవలం ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించడానికి ఆడిన నాటకమే అని కొందరు విశ్లేషిస్తున్నారు. తన అసలు గుర్తింపు బయటపడకుండా ఉండేందుకు బ్యాక్ స్వయంగా సటోషీ అనే మారుపేరు సృష్టించి ఉండవచ్చని కథనం వెలువరించింది.

అజ్ఞాతం వెనుక అసలు భయం

బిట్‌కాయిన్ సృష్టికర్త వద్ద ప్రస్తుతం లక్షలాది బిట్‌కాయిన్లు ఉన్నట్లు అంచనా. వాటి విలువ కొన్ని వందల బిలియన్ డాలర్లు ఉంటుంది. అంతటి భారీ సంపద ఉన్న వ్యక్తి బయటపడితే, ప్రభుత్వాల నుంచి పన్నుల వేధింపులు లేదంటే నేరగాళ్ల నుంచి ప్రాణహాని కలిగే అవకాశం ఉంది. అందుకే, తన గుర్తింపును రహస్యంగా ఉంచడమే సురక్షితమని సటోషీ భావించి ఉండవచ్చు. పైగా, బిట్‌కాయిన్ అనేది ఎవరి నియంత్రణలో లేని ఒక వికేంద్రీకృత వ్యవస్థ కావాలని ఆయన కోరుకున్నారు.. సృష్టికర్త ఎవరో తెలిస్తే ఆ ఉద్దేశం దెబ్బతినే ప్రమాదం ఉంది.

మారుతున్న కోడ్..

బిట్‌కాయిన్ కోడ్ రోజురోజుకీ క్లిష్టంగా మారుతుండడం, చట్టపరమైన ఇబ్బందులు రావడం వంటి కారణాల వల్ల సటోషీ ఈ ప్రాజెక్టు నుంచి పూర్తిగా తప్పుకొని ఉండొచ్చని కొందరు నమ్ముతున్నారు. మరికొందరైతే సటోషీ ఇప్పటికే మరణించి ఉండవచ్చని లేదా ఒక వ్యక్తి కాకుండా అది ఒక బృందం అయి ఉంటుందని భావిస్తారు. బ్యాక్ మాత్రం తాను సటోషీని కాదని ఖండిస్తున్నా, టెక్ ప్రపంచం మాత్రం ఆయన వైపే వేలెత్తి చూపుతోంది.

బిట్‌కాయిన్ సృష్టికర్త ఎవరనేది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఆ అజ్ఞాతమే బిట్‌కాయిన్‌కు ఒక రకమైన ఆకర్షణను, నమ్మకాన్ని కల్పించింది. సటోషీ నకమోటో అనే వ్యక్తి నిజంగానే ఉన్నాడా? అన్నది పక్కన పెడితే, ఆయన సృష్టించిన సాంకేతికత మాత్రం ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థనే సవాలు విసురుతోంది. ఈ రహస్యం ఎప్పటికీ గుట్టుగానే ఉండిపోతుందా? లేక భవిష్యత్తులో ఎప్పుడైనా ఆ 'డిజిటల్ దేవుడు' బయటపడతాడా అనేది కాలమే తేల్చాలి.