డాలర్ కాదు.. బంగారం కాదు..యుద్ధం మధ్యలో బిట్ కాయిన్ భూం
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. దశాబ్దాలుగా యుద్ధం అన్నా, ఆర్థిక అనిశ్చితి అన్నా పెట్టుబడిదారులకు గుర్తుకు వచ్చే మొదటి పేరు 'బంగారం'.
By: A.N.Kumar | 17 March 2026 10:39 PM ISTప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. దశాబ్దాలుగా యుద్ధం అన్నా, ఆర్థిక అనిశ్చితి అన్నా పెట్టుబడిదారులకు గుర్తుకు వచ్చే మొదటి పేరు 'బంగారం'. కానీ ఇప్పుడు కాలం మారుతోంది. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాల నేపథ్యంలో పెట్టుబడిదారులు తమ రూటు మార్చారు. ప్రస్తుతం మార్కెట్ వర్గాల్లో వినిపిస్తున్న నినాదం ఒకటి "డాలర్ కాదు.. బంగారం కాదు.. యుద్ధం మధ్యలో బిట్‌కాయిన్ భూం!"
బంగారం మెరుపు తగ్గడానికి కారణాలేంటి?
సాధారణంగా యుద్ధం వస్తే సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం ధరలు ఆకాశాన్ని తాకాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అందుకు విరుద్ధంగా బంగారం ధరలు దాదాపు 5 శాతం మేర పతనం కావడం గమనార్హం. దీనికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా డాలర్ విలువ పెరగడం వల్ల బంగారం కొనుగోలు ఖరీదైన వ్యవహారంగా మారింది. చమురు ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే అవకాశం ఉండటంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం లేదని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఎటువంటి వడ్డీని ఇవ్వని బంగారం కంటే బాండ్లు, ఇతర డిజిటల్ ఆస్తులు ఇన్వెస్టర్లకు లాభదాయకంగా కనిపిస్తున్నాయి.
డిజిటల్ గోల్డ్‌గా బిట్‌కాయిన్ అవతరణ
బంగారం వెలవెలబోతుంటే బిట్‌కాయిన్ మాత్రం జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది. ఫిబ్రవరి చివరి నుండి కేవలం కొద్ది రోజుల్లోనే 12 శాతం పైగా వృద్ధిని నమోదు చేస్తూ 74,500 డాలర్ల మార్కును తాకింది. ఇది గత ఆరు వారాల్లోనే అత్యధిక ధర కావడం విశేషం. కేవలం బిట్‌కాయిన్ మాత్రమే కాకుండా ఇతర క్రిప్టో కరెన్సీలైన ఎథీరియమ్ (10% వృద్ధి), సోలానా (9% వృద్ధి) కూడా భారీ లాభాలను ఆర్జించాయి. ఈ పరిణామం చూస్తుంటే సాంప్రదాయ 'బంగారం' స్థానాన్ని 'డిజిటల్ గోల్డ్' గా పిలవబడే బిట్‌కాయిన్ భర్తీ చేస్తోందా? అనే చర్చ మొదలైంది.
కార్పొరేట్ దిగ్గజాల ఎంట్రీ
ఈసారి పెరుగుదల వెనుక కేవలం రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రమే లేరు. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక సంస్థలైన బ్లాక్ రాక్, ఫిడెలిటీ ఇన్వెస్ట్ మెంట్ వంటి దిగ్గజాలు క్రిప్టో మార్కెట్‌లోకి ప్రవేశించడం అతిపెద్ద మలుపు. యూఎస్ బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌ల (ఈటీఎఫ్ లు) ద్వారా వందల మిలియన్ల డాలర్లు మార్కెట్లోకి వస్తున్నాయి. మార్చి నెలలో ఈ పెట్టుబడులు బిలియన్ డాలర్ల మైలురాయిని దాటడం, బిట్‌కాయిన్ పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న నమ్మకాన్ని రెట్టింపు చేసింది.
నిపుణుల హెచ్చరికలు.. భవిష్యత్తు
బిట్‌కాయిన్ ఎంత వేగంగా పెరుగుతున్నప్పటికీ దాని ధరల్లో ఉండే అస్థిరత పెట్టుబడిదారులను కలవరపెడుతూనే ఉంటుంది. బంగారం అనేది భౌతికమైన ఆస్తి, దీనిని కేంద్ర బ్యాంకులు నియంత్రిస్తాయి. కానీ బిట్‌కాయిన్‌కు అటువంటి నియంత్రణ లేదు. అయినప్పటికీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలుకొని నేటి ఇరాన్ ఉద్రిక్తతల వరకు ప్రతి సంక్షోభంలోనూ బిట్‌కాయిన్ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా నిలుస్తోంది. యువత, ఆధునిక ఇన్వెస్టర్లు భౌతిక ఆస్తుల కంటే డిజిటల్ ఆస్తులకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
పెట్టుబడి ప్రపంచంలో 'సేఫ్ హెవెన్' నిర్వచనం మారుతోంది. యుద్ధం వస్తే బంగారం కొనే రోజులు పోయి, బిట్‌కాయిన్ వైపు మొగ్గు చూపే రోజులు వచ్చాయి. అయితే అధిక లాభాలతో పాటు అధిక నష్టభయం కూడా ఉండే క్రిప్టో మార్కెట్‌లో ఆచి తూచి అడుగువేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
