Begin typing your search above and press return to search.

కాలిఫోర్నియాలో కలకలం.. చిన్నారి బర్త్ డే పార్టీలో కాల్పులు!

అమెరికాలో గన్ కల్చర్ రోజురోజుకీ పెరుగుతుందని చెబుతోన్న వేళ.. తాజాగా కాలిఫోర్నియాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

By:  Raja Ch   |   30 Nov 2025 11:09 AM IST
కాలిఫోర్నియాలో కలకలం.. చిన్నారి బర్త్  డే పార్టీలో కాల్పులు!
X

అమెరికాలో గన్ కల్చర్ రోజురోజుకీ పెరుగుతుందని చెబుతోన్న వేళ.. తాజాగా కాలిఫోర్నియాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... కాలిఫోర్నియాలోని స్టాక్ టన్ లో శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని శాన్ కోక్విన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం వెల్లడించింది. ఓ చిన్నారి పుట్టిన రోజు వేడుకల్లో ఈ దారుణం చోటు చేసుకుంది.

అవును... కాలిఫోర్నియాలో ఓ చిన్నారి పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండగా.. జనసమూహంలో కలిసిపోయిన దుండగుడు హఠాత్తుగా కాల్పులకు తెగబడినట్లు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. దాదాపు 20 మంది వరకూ గాయపడినట్లు చెబుతున్నారు.

బాధితుల్లో ఎక్కువ మంది 9 నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలు ఉన్నట్లు కథనాలొస్తున్నాయి! ఈ క్రమంలో... మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. గాయపడిన వారిలో పలువురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు!

ఈ సందర్భంగా స్పందించిన శాన్ జోక్విన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం... స్టాక్టన్ లోని లూసిల్ అవెన్యూలోని 1900 బ్లాక్ లో జరిగిన కాల్పులపై శాన్ జోక్విన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ప్రస్తుతం దర్యాప్తు చేస్తోందని.. ఈ ఘటనలో గాయపడిన అనేక మంది బాధితులను స్థానిక ఆసుపత్రులకు తరలించినట్లు వెల్లడించింది. ఈ మేరకు ‘ఎక్స్’ లో ఓ పోస్ట్ పెట్టింది.

ఈ సందర్భంగా స్పందించిన స్టాక్టన్ వైస్ మేయర్ జాసన్ లీ.. ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రాత్రి జరిగిన ఘటన వల్ల తన హృదయం మాటల్లో చెప్పలేని విధంగా బరువెక్కిందని.. స్టాక్టన్ వైస్ మేయర్ గా, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వక్తిగా.. ఒక పిల్లవాడి పుట్టిన రోజు వేడుకల్లో జరిగిన సామూహిక కాల్పుల గురించి తెలుసుకుని చాలా బాధపడినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఏమి జరిగిందో ఖచ్చితంగా తెలుసుకోవడానికి తాను సిబ్బంది, ప్రజా భద్రతా అధికారులను సంప్రదిస్తున్నామని తెలిపారు. ప్రభావితమైన కుటుంబాలు న్యాయం, వారికి మద్దతు ఇవ్వడానికి అందుబాటులో ఉన్న ప్రతి వనరును పొందాలని అన్నారు. ఇదే సమయంలో.. అనేక మంది ప్రత్యక్ష సాక్షులు, స్థానిక నివాసితులు సోషల్ మీడియాలొ వివరాలను పంచుకుంటున్నారు.