Begin typing your search above and press return to search.

జాబ్ ఇంటర్వ్యూకు వెళుతున్నారా? బిల్ గేట్స్ తాజా టిప్స్ తెలుసా?

ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా? అక్కడ ఎదురయ్యే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్పాలన్న దానిపై టెన్షన్ ఉంటుంది.

By:  Garuda Media   |   1 Sept 2025 5:00 PM IST
జాబ్ ఇంటర్వ్యూకు వెళుతున్నారా? బిల్ గేట్స్ తాజా టిప్స్ తెలుసా?
X

ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా? అక్కడ ఎదురయ్యే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్పాలన్న దానిపై టెన్షన్ ఉంటుంది. ఏ ప్రశ్నకు ఎలాంటి సమాధానం చెబితే ఏమవుతుందన్న సందేహం ఉంటుంది. ఐటీ ఉద్యోగాన్ని సొంతం చేసుకోవటానికి వీలుగా పలు రౌండ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతా ఓకే అయి.. చివరి రౌండ్ లో ఎదురయ్యే కొన్ని ప్రశ్నల విషయంలో ఏం చెబితే ఏమవుతుందో అన్న ఆందోళన ఉంటుంది. మరి.. ముఖ్యంగా జీతం ఎంత కావాలన్న దానిపై ఏం చెప్పాలన్న సందేహాం పలువురిని వెంటాడుతుంటుంది.

ఈ తరహా సందేహాలపై దిగ్గజ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తాజాగా కొన్ని సలహాలు..సూచనలు ఇచ్చారు. ఆయన చెప్పిన మాటల్ని శ్రద్ధగా వినటమే కాదు.. ఆచరిస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పాలి. ప్రతి ఇంటర్వ్యూలో వచ్చే సాధారణమైన ఒక ప్రశ్న.. అత్యంత కష్టంగా..క్లిష్టంగా ఉంటుంది. అదే.. ఈ ఉద్యోగానికి మిమ్మల్నే ఎందుకు ఎంచుకోవాలి? అని. దీనికి ఎలాంటి సమాధానం చెప్పాలన్న దానిపై బిల్ గేట్స్ చేస్తున్న సూచన ఏమంటే.

చదువుకునే సమయంలో నేర్చుకున్న దాని కంటే ఎక్కువగా సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్ లను రాయగలనని.. కోడింగ్ చేయగలనన్న విషయాన్ని ఆత్మవిశ్వాసంతో చెప్పాలన్న సూచన చేశారు. అంతేకాదు.. కొత్తవారితో సులువుగా కలిసిపోతానని.. టీం వర్కును ఇష్టపడతానన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలన్నారు. ఐటీ జాబ్ చేయాలన్నది తన కల అన్న విషయాన్ని చెప్పటంతో పాటు.. రోజు రోజుకు సబ్జెక్టు విషయంలో ఎంత బెటర్ అయ్యామనే విషయాన్ని మన పనితో చూపించాలని చెప్పారు.

బలాలు.. బలహీనతల గురించి చెప్పాలని అడిగినప్పుడు తెలియని విషయాల్ని తెలియదని నిజాయితీగా చెప్పాలని సూచన చేశారు. అదే సమయంలో ఎలాంటి ఉద్యోగాన్ని సమర్థంగా.. ఇష్టంగా చేయగలమన్న విషయాన్ని తెలియజేయాలన్న ఆయన.. ఒక ఉదాహరణగా తన గురించి చెప్పుకొచ్చారు. తనకు మార్కెటింగ్ విభాగంలో పని చేయటం ఇష్టం లేదని.. అందులో తాను కమిట్ మెంట్ తో పని చేయలేనని చెప్పారు.

ఇంటర్వ్యూలో భాగంగా అడిగే మరో కీలకమైన ప్రశ్న.. ఎంత జీతం కావాలి? శాలరీ అంచనాలు ఏమిటి? అని అడిగినప్పుడు ఏం చేయాలన్న దానిపై బిల్ గేట్స్ కీలక సూచనలు చేశారు. శాలరీ అంచనాల గురించి అడిగితే.. వెంటనే వచ్చే డబ్బుల కంటే స్టాక్స్ ఆప్షన్స్ పై ఎక్కువగా ఫోకస్ చేయాలని.. ఆ అంశాన్ని ప్రస్తావించాలని చెప్పారు.

ఈ తరహాలో మాట్లాడటం ద్వారా ప్రయోజనాలు ఉంటాయన్నారు. ఉద్యోగంలో ఎలాంటి రిస్కు అయినా తీసుకోవచ్చు కాబట్టి.. సంస్థ ఇచ్చే శాలరీలో భాగంగా స్టాక్స్ ఇవ్వాలని అడగాలని చెప్పారు. ఇలా అడగటం ద్వారా.. ఇంటర్వ్యూ చేసే వారికి స్టాక్స్ అడగటం ద్వారా సంస్థ ఫ్యూచర్ మీద ఉన్న నమ్మకం.. ఉద్యోగంలో రాణించాలన్న అంశం అర్థమవుతుందని చెప్పారు. మొత్తంగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి బిల్ గేట్స్ ఇచ్చిన సూచనలు ఎంతో మేలు చేస్తాయని చెప్పక తప్పదు.