ఎప్ స్టీన్ ఫైల్స్ : బిల్ గేట్స్ పశ్చాత్తాపం వెనుక అసలు కథ
బిల్ గేట్స్ తన వివరణలో ఎక్కడా తాను చట్టవిరుద్ధమైన పనులు చేయలేదని స్పష్టం చేశారు.
By: A.N.Kumar | 25 Feb 2026 10:20 PM ISTసాధారణంగా ఒక వ్యక్తిని వారు ఎంచుకున్న స్నేహితులను బట్టి అంచనా వేస్తారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఆదర్శంగా నిలిచిన టెక్ దిగ్గజం.. మానవతావాది బిల్ గేట్స్ విషయంలో ఇప్పుడు ఇదే చర్చనీయాంశమైంది. లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్‌తో తనకున్న గత సంబంధాల పట్ల గేట్స్ వ్యక్తం చేసిన పశ్చాత్తాపం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది.
విలువల విశ్లేషణలో వైఫల్యం?
బిల్ గేట్స్ తన వివరణలో ఎక్కడా తాను చట్టవిరుద్ధమైన పనులు చేయలేదని స్పష్టం చేశారు. అయితే 2008లోనే మైనర్ల అక్రమ రవాణా కేసులో దోషిగా తేలిన ఎప్స్టీన్‌తో 2011 నుండి 2014 వరకు సంబంధాలు కొనసాగించడం వెనుక ఉన్న తర్కం ఏమిటన్నదే ప్రశ్న. ఒక సామాన్యుడికి ఉండే కనీస విజ్ఞత, ప్రపంచంలోని అత్యున్నత సమాచార వ్యవస్థలు అందుబాటులో ఉన్న గేట్స్ వంటి వ్యక్తికి లేకుండా పోయిందా? లేక దాతృత్వం పేరుతో జరిగిన ఈ భేటీల వెనుక మరేదైనా కారణం ఉందా?
వ్యక్తిగత తప్పు.. సంస్థాగత దెబ్బ
గేట్స్ ఫౌండేషన్ ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య, విద్యా రంగాల్లో అద్భుతమైన మార్పులు తెచ్చింది. కానీ సంస్థ అధినేత వ్యక్తిగత నిర్ణయాలు ఆ సంస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తాయని గేట్స్ స్వయంగా అంగీకరించారు. "ఇది నా జీవితంలో అతిపెద్ద తప్పు" అని ఆయన అనడం.. తన తప్పును ఒప్పుకోవడంలో ఉన్న ధైర్యాన్ని సూచించినప్పటికీ, ఆ తప్పు వల్ల జరిగిన నష్టం మాత్రం పూడ్చలేనిది. మెలిండా ఫ్రెంచ్ గేట్స్ ముందే హెచ్చరించినా గేట్స్ వినకపోవడం ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా చీలికకు దారితీసిందనేది జగమెరిగిన సత్యం.రష్యన్ మహిళలతో సంబంధాలు.. వివాహేతర సంబంధాల గురించి ఆయన చేసిన బహిరంగ ప్రకటన.. ఎప్స్టీన్ ఫైల్స్ ద్వారా బయటపడే సమాచారం కంటే ముందే నష్టనివారణ చర్యల్లో భాగంగా చేసినట్లు కనిపిస్తోంది. ఒక నేరస్తుడికి సామాజిక హోదా కల్పించడంలో గేట్స్ వంటి ప్రముఖుల సాన్నిహిత్యం తోడ్పడింది. ఇది కేవలం గేట్స్ తప్పిదమే కాదు.. అధికారం, సంపద చుట్టూ తిరిగే ఒక ప్రమాదకరమైన సంస్కృతికి అద్దం పడుతోంది.
పశ్చాత్తాపం వ్యక్తం చేయడం వల్ల నైతిక గౌరవం కొంత పెరగవచ్చు.. కానీ చరిత్ర పుటల్లో నమోదైన మరకలు అంత సులభంగా చెరిగిపోవు. గేట్స్ కేవలం "క్షమించండి" అని చెప్పడంతో సరిపెట్టకుండా తన ఫౌండేషన్ ద్వారా పారదర్శకతను మరింత పెంచాల్సిన అవసరం ఉంది. సంపద ఎంత ఉన్నా, సామాజిక బాధ్యత, నైతిక విలువలే ఒక వ్యక్తిని నిజమైన మహోన్నతుడిగా నిలబెడతాయని ఈ సంఘటన మరోసారి నిరూపించింది.
