మోడీ ని మెప్పించిన గాయని.. గెలిచారా? ఓడారా?!
కట్ చేస్తే.. తాజాగా జరిగిన బీహార్ ఎన్నికల్లో సదరు యువతికి బీజేపీ పిలిచి మరీ టికెట్ ఇచ్చింది. అంతేకాదు.. ఆమెతో మోడీ సోషల్ మీడియాలో సంభాషణ కూడా చేశారు.
By: Garuda Media | 15 Nov 2025 9:51 AM ISTఇటీవల కాలంలో బీజేపీ కొత్త ట్రెండ్ ఫాలో అవుతోంది. దీనిలో భాగంగా ఇన్ల్ఫుయెన్సర్ల(ప్రభావం చేయగల వ్యక్తులు)కు కూడా.. ఆ పార్టీ టికెట్లు ఇస్తోంది. పశ్చిమ బెంగాల్ పార్లమెంటు ఎన్నికల్లో ఇలానే ఒక యువతికి ఇచ్చింది. అయితే.. ఆమె ఓడిపోయా రు. ఆ తర్వాత.. ఇప్పుడు జరిగిన బీహార్ ఎన్నికల్లోనూ ఇదే ప్రయోగం చేసింది. 2024, జనవరిలో అయోధ్యలో రామమందిరా న్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఆ సమయంలో ఆయన పక్కనే ఓ యువతి నిలబడి.. భజన కీర్తనలు ఆలపించారు. రామచరిత మానస్‌లోని కొన్ని పంక్తులను శ్రవణపేయంగా ఆలపించడంతో ప్రధాని మోడీ ముగ్ధులయ్యారు.
కట్ చేస్తే.. తాజాగా జరిగిన బీహార్ ఎన్నికల్లో సదరు యువతికి బీజేపీ పిలిచి మరీ టికెట్ ఇచ్చింది. అంతే కాదు.. ఆమెతో మోడీ సోషల్ మీడియాలో సంభాషణ కూడా చేశారు. ఆమెను గెలిపించాలని ఆయన నేరుగా కాదు కానీ.. ఆన్‌లైన్‌లో విన్నవించారు. ఆమే.. మైథిలీ ఠాకూర్. వయసు 25 సంవత్సరాలు.(ఖచ్చితంగా ఎన్నికల బీఫాం దాఖలు చేసే సమయానికి 25 వచ్చాయి.) ఆమెను బీజేపీ..అలీనగర్ నియోజకవర్గం నుంచి నిలబెట్టింది. కానీ, వాస్తవానికి ఆమెపై పెద్దగా పార్టీకి అంచనాలు లేవు. అంతేకాదు.. సీనియర్ నాయకులు కూడా పెద్దగా ప్రచారానికి రాలేదు.
కానీ.. యూట్యూబ్‌లో ఆమెకు ఉన్న పరిచయాలు, ఫాలోవర్లు స్వతంత్రంగా(వాలంటరీ) ప్రచారం చేశారు. ఇది ఆమెకు బాగా కలిసి వచ్చింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో అలీనగర్ నుంచి సిట్టింగును ఓడించి మరీ.. విజయం దక్కించుకున్నారు. 11 వేల ఓట్ల పైచిలుకు ఆధిక్యం సాధించారు. తొలిసారి 25 ఏళ్ల వయసులో బీహార్ అసెంబ్లీలో అడుగు పెడుతున్న తొలి యువతిగా ఆమె పేరు తెచ్చుకోనున్నారు. కాగా.. బీహార్‌లోని మధుబన్ జిల్లాకు చెందిన మైథిలి ఠాకూర్ జానపద గాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. రియాలిటీ షోల్లో పాల్గొని బాగా గుర్తింపు పొందారు. ఆమె యూట్యూబ్ ఛానెల్‌కు 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఇన్‌స్టాలోనూ 64 లక్షల మంది ఉన్నారు.
