చంద్రబాబు అనుభవం .. నితీష్ కి పనికొచ్చిందా!
డబ్బులే కాదు.. సలహాలు కూడా ఊరికేనేరావు!. ఎంతో అనుభవం ఉంటే తప్ప.. సలహాలు బోధపడవు.
By: Garuda Media | 15 Nov 2025 4:00 PM ISTడబ్బులే కాదు.. సలహాలు కూడా ఊరికేనేరావు!. ఎంతో అనుభవం ఉంటే తప్ప.. సలహాలు బోధపడవు. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు కొట్టిన పిండి. సుదీర్ఘ రాజకీయ అనుభవం.. అనేక మంది సీఎంలను చూసిన ఎక్స్‌పీరియెన్స్.. అదేవిధం గా మారుతున్న కాలానికి అనుగుణంగా తననుతాను మార్చుకునే తత్వం వంటివి చంద్రబాబుకు బాగానే బోధపడ్డాయి. దీంతో ఆయన భవిష్యత్తును కూడా స్వప్నించగలరు. ఈ విషయంలో ఆయనంటే గిట్టనివారు ఎద్దేవా చేస్తారు.కానీ.. వాస్తవం వాస్తవమే కదా!.అచ్చంగా అదే ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో కనిపిస్తోంది.
బీహార్‌లో భారీ ఎత్తున ఎన్డీయే గెలుపుగుర్రం ఎక్కింది. అసలు కలలో కూడా ఊహించని విధంగా విజయం దక్కించుకుంది. దీని వెనుక మహిళా ఓటు బ్యాంకు కీలకంగా మారిందన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. ఎందుకంటే.. ఎన్నికల పోలింగ్ జరిగిన రెండు దశల్లోనూ భారీ ఎత్తున మహిళలు పోలింగ్ బూతుల్లో నిలబడ్డారు. రాత్రి పొద్దు పోయే వరకు కూడా వేచి ఉండి మరీ ఓటేశారు. అప్పట్లోనే మహిళలు ఇంతగా పోటెత్తారంటే.. ఖచ్చితంగా సుపరిపాలనకేనని మేధావులు, బీజేపీ నాయకులు కూడా అంచనా వేశారు. ఇలా.. మహిళా ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకోవడంతో నితీష్ కుమార్(ప్రస్తుత సీఎం)కు సీఎం చంద్రబాబు ఇచ్చిన సలహా సంజీవనిగా పనిచేసిందని తెలుస్తోంది.
కేంద్రంలో ఎన్డీయే కూటమి కొలువుతీరిన తర్వాత.. తరచుగా సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటించారు. ఈ క్రమంలో పలు మార్లు ఆయన ప్రధాని మోడీతోనూ భేటీ అయ్యారు. ఈ సమయంలో ప్రధాని మోడీ, చంద్రబాబు మధ్య బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రస్తావన వచ్చింది.(ఈ విషయం అప్పటి పత్రికల్లోనూ వార్తల రూపంలో వచ్చింది. 'బీహార్ ఎన్నికలపై బాబుతో చర్చించిన ప్రధాని' టైటిల్‌తో వార్తలు వచ్చాయి). ఆ సమయంలోనే చంద్రబాబు.. బీహార్ సీఎంకు కొన్ని సలహాలు... సూచనలు, ఏపీలో చేపట్టిన ప్రచారం వెనుక ఉన్న కీలక విషయాలను పంచుకుంటానని చెప్పడంతో నితీష్ రాత్రికి రాత్రి ఢిల్లీకి వచ్చారు.
ఏపీ భవన్‌లో సీఎం చంద్రబాబుతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమయంలోనే ఆయన మహిళలను సెంట్రిక్‌గా చేసుకుని తాము విజయం దక్కించుకున్నట్టు ఏపీసంగతులను వివరించారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా మహిళల్లో చైతన్యం పెరుగుతోంద ని బాబు వివరించారు. మహిళలను సెంట్రిక్‌గా చేసుకుని ముందుకు సాగితే.. విజయం తథ్యమని.. ఏపీలో తాము అదే చేశామని..ఈ సందర్భంగా పలు పథకాలను ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీలను కూడా నితీష్‌కు వివరించారు.
అయితే.. అంత పెద్ద ఎత్తున హామీలు ఇచ్చే పరిస్థితి లేదన్న నితీష్ మరో మాట చెప్పాలని కోరడంతో పసుపు కుంకుమ పథకాన్ని గుర్తు చేశారు. అప్పట్లో రూ.10 వేల చోప్పున ఇచ్చిన విషయాన్ని చెప్పడంతో నితీష్.. ఆ పథకాన్ని అమలు చేశారు. ఇప్పుడు ఆ ఫలితం కళ్ల ముందు కనిపిస్తుండడంతో జాతీయస్థాయి విశ్లేషకులు.. చంద్రబాబు-నితీష్‌కు చెప్పిన `మహిళా మంత్రం` ఫలించిందన్న కామెంట్లు చేస్తున్నారు.
