బీహార్ వార్ : రెండు కూటములలో సీట్ల కోసం కుస్తీ
ఎన్నికలు అంటే సీట్ల దగ్గరే పంచాయతీ మొదలవుతుంది. ఒక్కో నియోజకవర్గంలో ఆశావహులు అనేక మంది ఉంటారు.
By: Satya P | 9 Oct 2025 9:16 AM ISTఎన్నికలు అంటే సీట్ల దగ్గరే పంచాయతీ మొదలవుతుంది. ఒక్కో నియోజకవర్గంలో ఆశావహులు అనేక మంది ఉంటారు. పైగా పొత్తులు ఉంటాయి. అలా అన్ని పార్టీలకు చెందిన నాయకులు సీట్లను ఆశిస్తారు. దాంతో ఎవరికి సీటు ఇవ్వాలి ఏ పార్టీకి ప్రాధాన్యత ఇవ్వాలి అన్నది చర్చగా ఉంటుంది. ఇక చూస్తే చూస్తే బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష మహా కూటమి తమ సీట్ల పంపకాలలో ఫుల్ బిజీ అయిపోయాయి. రెండు కూటములూ తమ అభ్యర్థుల గురించిన కసరత్తుని ముమ్మరం చేశాయి.
మీటింగ్స్ తో బిజీ :
సీట్ల విషయం వస్తే అధికార ఎన్డీయేకు దాని సమస్యలు చాలా ఉన్నాయి. అలాగే విపక్షంలోని మహా కూటమికి కూడా దాని బాధలు దానికి ఉన్నాయి. దాంతో ఎవరూ ఎక్కడా ఇంకా అభ్యర్ధులను ఖరారు చేయలేదు. మరో వైపు చూస్తే కనుక రెండు కూటములలోని భాగస్వామ్య పార్టీలు వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి.
చెరి సగం సీట్లతో :
ఇక బీహార్ లో ఎన్డీయే పార్టీలలో బీజేపీ జేడీయూ చెరి సగం సీట్లను పంచుకోవడానికి సిద్ధపడుతున్నాయి మొత్తం 243 సీట్లు ఉంటే ఇతర మిత్ర పార్టీలకు 28 సీట్లను వదిలేసి 215 సీట్లను చెరి సగం పంచుకోవాలని బీజేపీ జేడీయూ నిర్ణయిచాయి. అయితే తమకు అతి తక్కువ సీట్లు ఇవ్వడం పట్ల కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ గుస్సా మీద ఉంది అని అంటున్నారు. దాంతో ఆ పార్టీ వైఖరి ఎలా ఉంటుందో చూడాలని చెబుతున్నారు.
బీజేపీ పెద్దలు సిద్ధం :
ఇక బీహార్ లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి చర్చించడానికి పాట్నాలోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బీజేపీ ఎన్నికల కమిటీ మూడవ సమావేశం నిర్వహించింది ఈ సమావేశానికి కేంద్ర మంత్రి, బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దిలీప్ జైస్వాల్, ఎన్నికల కమిటీ సభ్యులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీట్ల పంపిణీ అభ్యర్థులపై చర్చించారు ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలను బట్టి బీజేపీ చాలా స్థానాలకు తన అభ్యర్థుల జాబితాను ఖరారు చేయవచ్చని భావిస్తున్నారు. మరో వైపు చూస్తే జేడీయూ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా అభ్యర్థుల జాబితాకు తుది మెరుగులు దిద్దడం గురించి పార్టీ సీనియర్ నాయకులతో కీలకమైన చర్చలు జరుపుతున్నారు.
మహా కూటమిలో అదే సీన్ :
ఈసారి తప్పనిసరిగా అధికారంలోకి వస్తామని భావిస్తున్న మహా కూటమి కూడా కసరత్తుని ముమ్మరం చేసింది. ఈ కూటమిలో ముఖ్య భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల జాబితా గురించి చర్చించడానికి న్యూఢిల్లీలో తన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తోంది బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజేష్ రామ్ ఇదే విషయం మీద మాట్లాడుతూ పార్టీ తన వాటా కిందకు వచ్చే సీట్లపై చర్చిస్తానబు అంటున్నారు రాష్ట్రీయ జనతాదళ్ ఇతర కూటమి భాగస్వాముల మధ్య సీట్ల పంపకాలపై సామరస్యంగానే చర్చలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
సీట్ల పేచీ స్టార్ట్ :
బీహార్ లో మహా కూటమిలో సీట్ల పేచీ స్టార్ట్ అయింది అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈసారి అధిక సీట్లను డిమాండ్ చేస్తోంది. ఆర్జేడీ అయితే తాను సొంతంగా 150 సీట్లకు పోటీ చేసి మిగిలిన 93 సీట్లనే మిత్రులకు ఇవ్వాలని చూస్తోంది. కాంగ్రెస్ తాను కూడా సొంతంగా వంద సీట్లకు పోటీ చేయాలని అనుకుంటోంది. ఈ విషయం మీద మహా కూటమి ఎన్నికల సమన్వయ కమిటీ కీలక సమావేశం ఆర్జేడీ నాయకుడు తేజస్వి ప్రసాద్ యాదవ్ అధ్యక్షతన జరిగింది. సమావేశం తర్వాత సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా మాట్లాడుతూ, సీట్ల పంపకాలకు సంబంధించిన కొన్ని అంశాలను ఖరారు చేస్తున్నామని చెప్పారు. అదే సమయంలో సిపిఐ ఎంఎల్ పార్టీ గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు కావాలని డిమాండ్ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు బాగానే తాము గెలుచుకున్నామని దీంతో పార్టీకి మంచి ట్రాక్ రికార్డ్ ఉందని గుర్తు చేస్తోంది. దానిని పరిగణనలోకి తీసుకుంటే నియోజకవర్గాలలో న్యాయమైన తీరున గౌరవప్రదమైన వాటాను తమకు కేటాయించాల్సిన అవసరం ఉందని సిపిఐ ఎంఎల్ కేంద్ర కమిటీ కోరుతోంది. మొత్తానికి రెండు శిబిరాలలో సీట్ల పంచాయతీ పెద్ద ఎత్తున సాగుతోంది.
