రాహుల్ లాలూ కొడుకు అన్నదమ్ముల బంధం ఏమైంది ?
ఈ మధ్యనే బీహార్ లో ఏకంగా పదిహేను రోజుల పాటు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్రను నిర్వహించారు.
By: Satya P | 15 Sept 2025 9:24 AM ISTఈ మధ్యనే బీహార్ లో ఏకంగా పదిహేను రోజుల పాటు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్రను నిర్వహించారు. ఈ యాత్రలో ఆయనతో కలిసి ఆర్జేడీ పార్టీ కీలక నాయకుడు బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అయిన తేజస్వి యాదవ్ పాల్గొన్నారు. ఈ ర్యాలీలు సభలు విజయవంతం అయ్యాయి. అయితే ఆ తరువాతనే బీహార్ లో మహా ఘట్ బంధానికి బీటలు వారడం మొదలైంది అని అంటున్నారు.
ఒంటరిగానే పోటీ అంటూ :
ఇక బీహార్ లో ఒంటరిగానే తాము పోటీ చేస్తామని మొత్తం 243 అసెంబ్లీ సీట్లకు తాము రెడీ అని లాలూ కొడుకు ఆర్జేడీ సీనియర్ నేత తేజస్వి యాదవ్ ప్రకటించారు. ఈ ప్రకటన మహా ఘట్ బంధం మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. అన్న దమ్ములుగా ఉంటూ రాహుల్ తేజస్వి యాదవ్ ర్యాలీలలో హుషారుగా పాల్గొన్నారు. బీహార్ లో వచ్చేది మహా ఘట్ బంధన్ సర్కారే అని కూడా గట్టిగా చెప్పారు. అయితే ఏమి జరిగిందో ఏమో కానీ ఇపుడు సడెన్ గా ఆర్జేడీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంది అని అంటున్నారు.
అదే రీజన్ నా :
అయితే ఎందుకు ఈ విధంగా తేజస్వి యాదవ్ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే దానికి రీజన్ కూడా ఉంది అని అంటున్నారు. ఈసారి కచ్చితంగా మహా ఘట్ బంధం గెలుస్తుంది అన్న సూచనలు ఒక వైపు ఉన్నాయి. మరో వైపు ఓటర్ అధికార్ యాత్ర రాహుల్ నిర్వహిస్తే బీహార్ లో విరగబడి జనాలు వచ్చారు. దాంతో కాంగ్రెస్ కి మళ్ళీ అక్కడ పూర్వ వైభవం వస్తోంది అని అగ్ర నేతలు భావిస్తున్నారుట. ఈ కారణంగానే గతంలో మాదిరిగా మొక్కుబడిగా ఏ పదో పదిహేనో సీట్లు కాకుండా భారీ స్థాయిలోనే సీట్లను కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది అని అంటున్నారు. తమకు కూడా సమాన వాటా కావాలని కోరుతోంది అన్నది టాక్. అలా అయితే రేపటి రోజున ప్రభుత్వం ఏర్పాటులోనూ కీలక పాత్ర పోషించడమే కాకుండా వీలుంటే అధికారంలోనూ వాటా కోరవచ్చు అన్న దీర్ఘ కాలిక ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు.
సీఎం ఎవరో చెప్పలేదా :
అంతే కాకుండా రాహుల్ ని బీహార్ లో మీడియా అడిగిన ఒక ప్రశ్నకు ఆయన నుంచి ఆర్జేడీ ఆశించిన జవాబు రాకపోవడం వల్ల కూడా ఆ పార్టీ అలిగింది అని అంటున్నారు. మహా ఘట్ బంధన్ గెలిస్తే ఎవరు సీఎం అవుతారు అన్న ప్రశ్నకు రాహుల్ తేజస్వి యాదవ్ తన పక్కన ఉన్నా కూడా ఆయన పేరు చెప్పకపోవడం మీద కూడా తమ్ముడు గుస్సా అయ్యారని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కాంగ్రెస్ కి బీహార్ ఎన్నికల మీద ధీమా బాగా పెరిగిందని అంటున్నారు. ఆ కారణంగానే సీట్లను అధికంగా డిమాండ్ చేయడంతో ఎవరి పొత్తు లేకుండా తాము ఒంటరిగా గెలవగలమని తేజస్వి యాదవ్ ధీమాగా ఈ ప్రకటన చేశారు అని అంటున్నారు. చూడాలి మరి ఇది ఇలాగే సాగుతుందా ఎక్కడో అక్కడ మళ్ళీ ఇద్దరూ తగ్గి వస్తారా అన్నది.
