బీహార్ దంగల్: తేజస్వీతో సరిజోడు ఎన్డీయేలో ఎవరు ?
బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమరం కీలక ఘట్టానికి చేరుకుంది. మరో రెండు వారాలలో ఏకంగా తొలి విడత పోలింగ్ జరగనుంది.
By: Satya P | 24 Oct 2025 8:15 AM ISTబీహార్ అసెంబ్లీ ఎన్నికల సమరం కీలక ఘట్టానికి చేరుకుంది. మరో రెండు వారాలలో ఏకంగా తొలి విడత పోలింగ్ జరగనుంది. ఆ తరువాత పది రోజుల తేడాలో బీహార్ కి నయా రాజ్ ఎవరో తేలిపోతుంది. రెండు విడతలుగా జరుగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసి ప్రచార ఘట్టానికి తెర లేచింది. ప్రధాన పార్టీలు అన్నీ కూడా బీహార్ ఎన్నికల ప్రచారంలో తలమునకలు అవుతున్నారు. ఈ నెల 25 నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డీయే తరఫున భారీ ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు.
సీఎం అభ్యర్థిగా :
ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఒక వ్యూహాత్మమైన నిర్ణయాన్ని తీసుకుంది. బీహార్ లో కాంగ్రెస్ ఆర్జేడీ ఇతర పక్షాలు కలసి ఏర్పడిన మహా ఘట్ బంధన్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వీ యాదవ్ పేరుని కాంగ్రెస్ అగ్ర నేత అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. తమ కూటమి గెలిస్తే సీఎం గా తేజస్వి యాదవ్ అవుతారు అని స్పష్టం చేశారు. ఇప్పటిదాకా ఈ విషయంలో కాంగ్రెస్ వైపు నుంచి పెద్దగా స్పందన లేదని ఒక ప్రచారం అయితే సాగింది. దానిని పూర్వ పక్షం చేస్తూ కాంగ్రెస్ ఆర్జేడీకే సీఎం పదవిని అప్పగిస్తోంది. ఉప ముఖ్యమంత్రి పదవిని తీసుకోవాలని చూస్తోంది. దీంతో కాంగ్రెస్ ఆర్జేడీల మధ్య ఒక సామరస్యపూర్వకమైన వాతావరణం మరింత బలంగా కొనసాగుతోంది అన్నది ఈ అభ్యర్థి ఎంపికతో రుజువు అయింది.
ఎన్డీయే సీఎం ఎవరు :
ఇక కాంగ్రెస్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. తమ కూటమి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించామని, ఎన్డీయే కూటమి నుంచి సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని సవాల్ చేసింది. సీఎం అభ్యర్థి లేకుండానే ఎన్నికలకు వెళ్తారా అంటూ కూడా రెట్టిస్తోంది. దీంతోనే ఎన్డీయే మీద తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోంది. ఎన్డీయేలో బీజేపీ జేడీయూ ఇతర పక్షాలు ఉన్నాయి. అయితే జేడీయూకి చెందిన నితీష్ కుమార్ ప్రస్తుతం సీఎం గా ఉన్నారు. ఆయన పేరునే మరోసారి ప్రకటించాలని జేడీయూ కోరుతోంది. అయితే బీజేపీ అగ్రనేత అమిత్ షా మాత్రం ఎన్నికల తరువాత ఎన్డీయే శాసనసభా పక్షం కొత్త సీఎం ని ఎన్నుకుంటుంది అని తాజాగా ఒక టీవీ చానల్ కి చెప్పారు. దాంతో ఎన్డీయేలో ఈ అంశం ఒకింత చర్చనీయాంశం అయింది. అదే సమయంలో మహా ఘట్ బంధం తమ సీఎం అభ్యర్ధిని ఎంపిక చేసి మరీ ఎన్డీయేకు సవాల్ చేస్తోంది. దాంతో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఎన్డీయే శిబిరం సతమతమవుతోంది అని అంటున్నారు.
తేజస్వి వర్సెస్ నితీష్ :
ప్రస్తుతం ఎన్డీయే సీఎం అభ్యర్ధిని ప్రకటించకపోయినా ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఉన్నారు ఆయనకు పోటీగా యువకుడు అయిన తేజస్వి యాదవ్ ఉన్నారు దింతో ఏడున్నర పదుల వయసు కలిగిన నితీష్ తో తేజస్వికి పోలిక పెట్టి జనాలు చూస్తారు. అది సహజంగానే మహా ఘట్ బంధన్ కి కలసి వస్తుంది అని అంటున్నారు. యూత్ అంతా తేజస్వి వైపు ఉండే చాన్స్ కచ్చితంగా ఉంటుంది. ప్రతీ ఎన్నికకూ అయిదు శాతం కొత్త ఓటర్లు జమ అవుతారు. వారి ఓట్లు కచ్చితంగా మహా ఘట్ బంధన్ కే వెళ్తాయని అంటున్నారు. పైగా రెండు దశాబ్దాలుగా నితీష్ కుమార్ సీఎం గా చూసి ఉన్న జనాలకు మార్పు కావాలని ఉంటే కచ్చితంగా తేజస్వి యాదవ్ మంచి చాయిస్ అవుతారు. అలా కాకుండా ఉండాలీ అంటే ఎన్డీయే కూటమి తమ సీఎం అభ్యర్ధిగా నితీష్ కాకుండా కొత్త ఫేస్ ని బరిలోకి దించాలి, అది అంత సులువు కాదని అంటున్నారు. జేడీయూకి ఆగ్రహం వచ్చి కూటమి ఇబ్బంది పడుతుంది. దాంతో బీజేపీ పరిస్థితి చాలా చిత్రంగా మారుతోందని అంటున్నారు.
