Begin typing your search above and press return to search.

ఏడుగురు కుమార్తెలు, ఇద్ద‌రు కుమారులు...మా లొల్లి మేమే తేల్చుకుంటాం.. విభేదాల‌పై లాలూ తొలి మాట‌

ఏడుగురు కుమార్తెలు, ఇద్ద‌రు కుమారులు.. మొత్తం 9 మంది సంతానం.. త‌ల్లిదండ్రులు ముఖ్య‌మంత్రులుగా ప‌నిచేసిన‌వారే.

By:  Tupaki Political Desk   |   18 Nov 2025 6:00 PM IST
ఏడుగురు కుమార్తెలు, ఇద్ద‌రు కుమారులు...మా లొల్లి మేమే తేల్చుకుంటాం.. విభేదాల‌పై లాలూ తొలి మాట‌
X

ఏడుగురు కుమార్తెలు, ఇద్ద‌రు కుమారులు.. మొత్తం 9 మంది సంతానం.. త‌ల్లిదండ్రులు ముఖ్య‌మంత్రులుగా ప‌నిచేసిన‌వారే. దాదాపు 15 ఏళ్లు ఉమ్మ‌డి, విభ‌జిత రాష్ట్రాన్ని కూడా పాలించిన కుటుంటం..! కాస్త కాలం క‌లిసివ‌స్తే వారి వార‌సుడు కూడా సీఎం అయ్యే చాన్స్! కానీ, వ‌రుస‌గా రెండోసారి కూడా చేజారిన అవ‌కాశం. ఇదీ బిహార్ లో లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ రికార్డు. స‌మోసా మే ఆలూ.. బిహార్ మే లాలూ (స‌మోసాలో ఆలూ ఉన్నంత కాలం బిహార్ లో లాలూ ఉంటాడు) అనేది ఒక ద‌శ‌లో మార్మోగిన నినాదం. కానీ, 20 ఏళ్లుగా వారి కుటుంబం తీవ్ర రాజ‌కీయ ఒడిదొడుకుల్లో ఉంది. మ‌ధ్య‌లో ఐదేళ్లు లాలూ రైల్వే శాఖ మంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యం త‌ప్పితే మిగతా అంతా ప్ర‌తిప‌క్షంలోనే. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో మ‌రిత ఘోరంగా, 15 ఏళ్ల‌లో లేనంత‌గా త‌క్కువ స్థాయి సీట్లకు ప‌రిమితం కావ‌డంతో లాలూ కుటుంబానికి మ‌రింత గ‌డ్డు కాలం ఎదురైంది. ఇదే స‌మ‌యంలో కుటుంబ విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. అదికూడా తండ్రి లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కోసం ఏకంగా త‌న కిడ్నీని దానం చేసిన కుమార్తె రోహిణి కావ‌డంతో ప్రాధాన్యం సంత‌రించుకుంది.

ప‌ట్నా నుంచి ఢిల్లీకి ముగ్గురు కుమార్తెలు

లాలూ ఏడుగురు కుమార్తెల్లో రోహిణి రాజ‌కీయాల నుంచి వైదొల‌గుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పొరుగునున్న యూపీకి చెందిన స‌మాజ్ వాదీ పార్టీ ఎంపీ సంజ‌య్ యాద‌వ్, త‌న సోద‌రుడు, ఆర్జేడీ శాస‌న‌స‌భా ప‌క్ష నేత అయిన తేజ‌స్వీ యాద‌వ్ స్నేహితుడు ర‌మీజ్ ఖాన్ లు త‌న నిర్ణ‌యానికి కార‌ణం అంటూ తెలిపారు. ఇదే స‌మ‌యంలో లాలూ మ‌రో ముగ్గురు కుమార్తెలు బ్యాగ్ లు స‌ర్దుకుని ఢిల్లీ వెళ్లిపోయారు. మ‌రోవైపు ఈ గొడ‌వ‌ల‌కు తేజ‌స్వీ అనుచ‌రులే కార‌ణం అంటూ వారి సోద‌రుడు తేజ్ ప్ర‌తాప్ యాద‌వ్ ఆరోప‌ణ‌లకు దిగారు.

ఉత్త‌రాదిన బ‌ల‌మైన కుటుంబం

లాలూది ఉత్త‌రాదిన బాగా ప్రాబ‌ల్యం క‌లిగిన కుటుంబం. ఈయ‌న కుమార్తెల్లో ఒక‌రి పేరు మీసా భార‌తి. 1975లో దేశంలో ఎమ‌ర్జెన్సీ విధించి మీసా చ‌ట్టం కింద ఎడాపెడా అరెస్టులు చేశారు. లాలూ కూడా అరెస్ట‌యి జైలు జీవితం గ‌డిపారు. ఆ స‌మ‌యంలో పుట్టిన కుమార్తె మీసా భార‌తి అని పేరు పెట్టారు. ఈమెను యూపీ మాజీ సీఎం, స‌మాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాద‌వ్ పెద్ద కుమారుడు అఖిలేష్ కు ఇచ్చి వివాహం చేయాల‌ని 1997లో భావించారు. కానీ, అది కుద‌ర‌లేదు. అప్పుడు వీలు కాకున్నా త‌ర్వాతి కాలంలో ఈ కుటంబాలు వియ్యం అందుకున్నాయి. లాలూ చిన్న కుమార్తె రాజ్య‌ల‌క్ష్మిని ములాయం కుటుంబానికి చెందిన తేజ్ ప్ర‌తాప్ యాద‌వ్ కు ఇచ్చి వివాహం చేశారు.

ఇది మా పంచాయితీ..

కుమార్తెలు అల‌గ‌డం, మ‌రో కుమారుడు రెబ‌ల్ గా మార‌డం, పార్టీకి మ‌రో ఘోర‌ ఓట‌మి.. ఇన్ని ఇబ్బందుల మ‌ధ్య లాలూ తొలిసారిగా స్పందించారు. త‌మ కుటుంబంలోని విష‌యాలు అంత‌ర్గతం అని, వాటిని తానే ప‌రిష్క‌రిస్తాన‌ని తెలిపారు. మ‌రోవైపు రాష్ట్రీయ జ‌న‌తా ద‌ళ్ (ఆర్జేడీ) శాస‌న స‌భా ప‌క్ష నేత‌గా తేజ‌స్వీ యాద‌వ్ ను తాజాగా ఎన్నుకున్నారు. ఎన్నిక‌ల్లో ఆయ‌న క‌ష్టాన్ని ప్ర‌శంసించారు.