'ఓట్ చోరీ'... కాంగ్రెస్ వాదనకు బలం చేకూరుస్తోన్న వైరల్ వీడియో!
దేశ రాజకీయాల్లో ఇటీవల ఓట్ చోరీ అంశం అత్యంత హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.
By: Raja Ch | 8 Nov 2025 1:03 PM ISTదేశ రాజకీయాల్లో ఇటీవల ఓట్ చోరీ అంశం అత్యంత హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై బీజేపీ, ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుంటూ లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందులో భాగంగా.. ఎన్నికల్లో టోకుగా ఓట్లను చోరీ చేసే పనిలో బీజేపీ నిమగ్నమైందని.. ఆ విధంగానే మోడీ ప్రధాని అయ్యారని అంటున్నారు.
ఇదే సమయంలో ఓట్ల చోరీపై తమ దగ్గర చాలా సమాచారం ఉందని.. దీనిపై తమ విశ్లేషణ కొనసాగిస్తున్నామని.. హర్యానా ఎన్నికల్లో ఓట్ల చోరీపై తాను ఇటీవల ప్రజెంటేషన్ ఇచ్చానని చెబుతున్నారు. మరోవైపు బీజేపీ ఈ ఆరోపణలను ఖండిస్తుంది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ వాదనకు బలం చేకూర్చేటట్లు అన్నట్లుగా ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
అవును... కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ ఆరోపణలకు బలం చేకూరేలా అన్నట్లుగా ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో భాగంగా... బీహార్ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ (రాం విలాస్)కి చెందిన సమస్తిపూర్ లోక్ సభ సభ్యురాలు శాంభవి చౌదరికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీంతో.. ఓట్ చోరీ ఆరోపణలకు ఇంతకంటే సాక్ష్యం ఏమి కావాలనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
వివరాళ్లోకి వెళ్తే.. తాను ఓటు వేసినట్లు మీడియా ముందు చేతి వేలికి ఉన్న ఇంక్ మార్క్ ను చూపించే క్రమంలో ఆమె తన రెండు వెళ్లనూ చూపించారు. ఇందులో భాగంగా.. తొలుత కుడిచేతి వేలిని చూపించిన ఆమె, ఆ తర్వాత దాన్ని కిందికి దించి.. ఎడమ చేతి వేలిని చూపారు. అయితే... ఆ రెండు చేతి వేళ్లకూ ఇంక్ మార్క్ ఉండటం గమనార్హం.
ఆ సమయంలో ఆమె పక్కన.. ఆమె తండ్రి, బీహార్ మంత్రి అశోక్ చౌదరి.. తల్లి నితా చౌదరీ ఉన్నారు. వారిద్దరూ ఒక చేతి వేలిని మాత్రమే చూపగా, శాంభవి మాత్రం రెండు చేతి వేళ్లనూ చూపించారు.
దీంతో.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె రెండుసార్లు ఓటు వేశారు అనడానికి ఇంతకు మించి ఉదాహరణ ఏమి కావాలంటూ ఆర్జేడీ – కాంగ్రెస్ కూటమి చెబుతోంది. ఒకసారి ఒక ఓటు వేసిన వ్యక్తికి రెండు వెళ్లకూ ఇంకు గుర్తులు ఎల ఉంటాయని ప్రశ్నిస్తుంది. దీన్నే బీజేపీ మార్కు ఓట్ చోరీ అంటారని మండిపడుతోంది!
స్పందించిన ఎన్నికల కమిషన్!:
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారడం.. నెటిజన్లు ఈసీని ఒక్కరేంజ్ లో విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్న వేళ పాట్న జిల్లా ఎన్నికల అధికారులు స్పందించారు! ఇందులో భాగంగా... శాంభవి చౌదరి ఒకే పోలింగ్ బూత్ లో ఓటు వేశారని.. అయితే, పొరపాటున ఆమె రెండు చేతి వేళ్లకూ ఇంకు వేశారని చెప్పుకొస్తున్నారు!
