Begin typing your search above and press return to search.

బీహార్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలకు వెరీ బ్యాడ్ ట్రాక్ రికార్డు

తమాషా ఏంటి అంటే సర్వే చేసిన ప్రతీ సంస్థ కూడా ఎన్డీయేకే పట్టం కట్టడం, కనీసం ఏ ఒక్క సంస్థ కూడా మహా కూటమి ఘట్ బంధన్ గెలుపు దరిదాపుల్లోకి వస్తుందని చెప్పలేదు.

By:  Satya P   |   12 Nov 2025 4:00 PM IST
బీహార్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలకు వెరీ బ్యాడ్ ట్రాక్ రికార్డు
X

బీహార్ లో ఇలా ఎన్నికలు ముగిసాయో లేదో అలా వెల్లువలా ఎగ్జిట్ పోల్స్ వచ్చి పడ్డాయి. తమాషా ఏంటి అంటే సర్వే చేసిన ప్రతీ సంస్థ కూడా ఎన్డీయేకే పట్టం కట్టడం, కనీసం ఏ ఒక్క సంస్థ కూడా మహా కూటమి ఘట్ బంధన్ గెలుపు దరిదాపుల్లోకి వస్తుందని చెప్పలేదు. ఇది చాలా ఆశ్చర్యానికి గురి చేసిన విషయంగా అంతా చూస్తున్నారు. మరో వైపు చూస్తే ఎగ్జిట్ పోల్స్ ని అంచనా కట్టిన సంస్థల ట్రాక్ రికార్డ్ సైతం ఇపుడు చర్చకు వస్తోంది. ఈ సంస్థలు గతంలో చెప్పినది ఏ మేరకు జరిగింది అంటే లేదనే అంటున్నారు. అంత వరకూ ఎందుకు 2020లో ఈ సంస్థలే ఇచ్చిన సర్వేలు చూస్తే అంతా రివర్స్ లో ఫలితాలు వచ్చి వీటి క్రెడిబిలిటీని తీసి పక్కన పెట్టేశాయని గుర్తు చేస్తున్నారు.

మెయిన్ ఏజెన్సీలు మౌనం :

విచిత్రం ఏంటి అంటే బీహర్ లో ఎన్డీయే భారీ మెజారిటీతో గెలిచి తీరుతుందని కొన్ని సంస్థలు ఏకపక్షంగా ఇచ్చిన అంచనాలు అలా ఉంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాకు చెందిన వారు అయితే మౌనంగా ఉన్నారు. వారి నుంచి ఏ రకమైన అంచనా కానీ సర్వే కానీ రాకపోవడమే విడ్డూరం అని అంటున్నారు. ఎందుకు అంటే ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉన్న కొన్ని ప్రధాన వార్తా సంస్థలు మాత్రం ఈ ఎగ్జిట్ పోల్స్ కి దూరంగా ఉండడం. అవి ఎందుకు అలా దూరం పాటించాయి, మరికొన్ని ఏజెన్సీలు ఎందుకు ఇలా జడలు విప్పుకుని మరీ అధికార పక్షానికి చప్పట్లు కొట్టాయన్నదే ఇపుడు జరుగుతున్న చర్చ.

బీహార్ తీరే వేరు :

ఇక బీహార్ ఓటర్ల మనసులో ఏముందో చెప్పడం చాలా కష్టమని గతంలో అనేక సందర్భాలలో రుజువు అయింది అని అంటున్నారు. ఎపుడూ కూడా ఎగ్జిట్ పోల్స్ ఈ విషయంలో విఫలం అవుతున్నాయని అంటున్నారు 2020లో జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మహా ఘట్ బంధన్ గెలిచి తీరుతుందని అంచనా వేశాయి. ఇందులో ప్రధాన వార్తా సంస్థలు కూడా ఉన్నాయి. తీరా ఈవీఎంలను ఓపెన్ చేస్తే ఎన్డీయే ప్రభంజనం కనిపించి సర్వేలు మొత్తం తప్పు అయిపోయాయి. దీని కంటే ముందు 2015లో బీహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పింది ఒకటి అయితే జరిగింది మరొటి అన్నది గుర్తు చేస్తున్నారు. ఆనాడు కూడా ఇండియాటుడే-యాక్సిస్, టైమ్స్ నౌ-సీఓటర్, టీవీ9 వంటి ప్రముఖ మీడియా సంస్థల సర్వేలు తప్పాయని అంటున్నారు. నితీష్ కుమార్ ఆర్జేడీ కలసి అప్పట్లో పోటీ చేస్తే ఎన్డీయేది గెలుపు అని సర్వేలు అంచనా కట్టాయి. కానీ వచ్చింది నితీష్ ఆర్జేడీ కూటమి అని గుర్తు చేస్తున్నారు.

ఎగ్జిట్ పోల్స్ సర్వేలు తప్పు :

ఈ మాట మీద మహా ఘట్ బంధన్ నేతలు ఉన్నారు. మరోసారి ఎగ్జిట్ పోల్స్ సర్వేలు తప్పు అని తేలబోతున్నాయని గెలిచేది తామే అని ఆ కూటమి నేతలు విశ్వసంతో ఉన్నారు. అయితే బీహార్ ఓటర్ల నాడి ఏమిటి అన్నది గడచిన ఎన్నికలో పసిగట్టడంలో ఫెయిల్ అయిన కారణంగానే ఈసారి ఇండియా టుడే, ఏబీపీతో పాటు సీఓటర్ వంటి సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్స్ ఊసే ఎత్తలేదని అంటున్నారు. తాము ఏమి చెప్పినా రివర్స్ లో ఫలితాలు వస్తే క్రెడిబిలిటీ పోతుందనే గమ్మున ఉన్నాయట. ఇలా బ్యాడ్ ట్రాక్ రికార్డు ఎగ్జిట్ పోల్స్ కి ఒక్క బీహార్ లోనే ఉండడం విశేషం. దీంతో ఈ నెల 14న ఏమి జరుగుతుంది అన్నది మరింత ఉత్కంఠను పెంచుతోంది. చూడాలి మరి ఎగ్జాక్ట్ ఫలితాలు ఎలా ఉంటాయో. బీహార్ పీఠం ఎవరిదో.